రిలయన్స్: స్టాక్‌ మార్కెట్‌‌పై భారతీయుల అభిప్రాయంపై ఈ కంపెనీ ఎలా ప్రభావం చూపింది? 1977లో ఏం జరిగింది?

    • రచయిత, అజిత్ గాధ్వీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

రిలయన్స్ గ్రూప్‌ టెలికాం కంపెనీ 'జియో ప్లాట్‌ఫామ్స్' మెగా ఐపీఓ దేశ విదేశాల్లో ఇటీవల వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తోంది.

ఆ కంపెనీ రూ. 30,213 కోట్ల విలువైన ఐపీఓను జారీ చేసింది.

మరోవైపు, జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఒకదాని తర్వాత ఒకటి కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఈ ఐపీఓ దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 23 (శుక్రవారం) చివరి గడువు కాగా, మనీ కంట్రోల్ డాట్ కామ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ ఇష్యూ సుమారు 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

కోటికి పైగా దరఖాస్తులు అందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఐపీఓ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ అని పీటీఐ వార్తా సంస్థ రిపోర్టు పేర్కొంది.

రిలయన్స్ గ్రూప్ తొలి ఐపీఓ

రిలయన్స్ జియో ఐపీఓ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న ఈ సందడితో, 49 ఏళ్ల క్రితం తొలిసారి రిలయన్స్ గ్రూప్ తన ఐపీఓను ప్రారంభించినప్పుడు వాతావరణం ఎలా ఉంది, దాని ద్వారా పెట్టుబడిదారులు ఎంత లాభం పొందారు అనేది ఆసక్తికరంగా మారింది.

పారిశ్రామికవేత్త ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌ను స్థాపించారు.

ఈ గ్రూప్ 1977లో తొలిసారి ఐపీఓకి వచ్చింది. అప్పట్లో ఈ కంపెనీ పేరు రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్.

1977లో నవంబర్ 15-17 మధ్య ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ రూ. 2.80 కోట్లు సమీకరించింది. 1978 జనవరి 23న రిలయన్స్ టెక్స్‌టైల్స్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (బీఎస్ఈ), అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయ్యాయి.

ఫార్చ్యూన్ ఇండియా మేగజీన్ రిపోర్టు ప్రకారం.. రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్ ఒక్కో షేరు రూ.10కు 28.2 లక్షల షేర్లను జారీ చేసింది. ఈ ఇష్యూకు 7.19 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌లు వచ్చాయి.

దీనివల్ల కంపెనీకి సుమారు 58 వేల షేర్‌హోల్డర్లు వచ్చారు. ట్రేడింగ్ తొలిరోజు ఒక్కో షేరు రూ.17 నుంచి రూ.18 మధ్యలో అమ్ముడుపోయాయి. అంటే.. ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజే 70 శాతం నుంచి 80 శాతం లాభం వచ్చింది.

ఆ తర్వాత1985లో, రిలయన్స్ టెక్స్‌టైల్స్‌ పేరును రిలయన్స్ ఇండస్ట్రీస్‌గా మార్చారు.

ఐపీఓ తర్వాత 57,949 షేర్‌హోల్డర్లు రిజిస్టర్ అయినట్లు కంపెనీ 1976-77 వార్షిక నివేదికలో తెలిసింది. దీనిలో 56,129 మంది షేర్‌హోల్డర్లు 200 వరకు షేర్లు కలిగి ఉండగా, 1,647 షేర్‌హోల్డర్లు 225 నుంచి 1000 షేర్లను, 125 మంది షేర్‌హోల్డర్లు 1,050 నుంచి 5000 షేర్లు కలిగి ఉన్నారు. 48 మంది షేర్‌హోల్డర్ల వద్ద 5 వేలకు పైగా షేర్లు ఉన్నాయి.

రూ.10 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ రూ.17 నుంచి రూ.18 మధ్యలో లిస్ట్ అయిన తర్వాత, అదే సంవత్సరంలో రూ.50కి పెరిగింది. రెండు సంవత్సరాల తర్వాత అది రూ.104కి, నాలుగు సంవత్సరాల తర్వాత రూ.186కి చేరుకుంది.

ఇన్వెస్టర్లకు ఎంత లాభం వచ్చింది?

ఒక వ్యక్తి 1977లో రిలయన్స్ ఐపీఓకు వచ్చిన సమయంలో రూ.1,000 పెట్టుబడిగా పెట్టి, 100 షేర్లను కొనుగోలు చేసి ఉంటే, బోనస్ షేర్లు, షేరు ధరలోని పెరుగుదలతో కలిపి ప్రస్తుత పెట్టుబడి విలువ సుమారు రూ.50 లక్షలు అయి ఉండేదని ఫార్చ్యూన్ ఇండియా రిపోర్టు పేర్కొంది.

ఇన్ని సంవత్సరాల్లో కంపెనీ చెల్లించిన డివిడెండ్లు దీనికి అదనం.

"1977లో నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రిలయన్స్ టెక్స్‌టైల్స్ మార్కెటింగ్ ప్రచారం కోసం ముంబయిలోని చౌపట్టి, మెరైన్ డ్రైవ్‌ను అలంకరించారు. అది నాకు ఒక అద్భుతమైన క్షణం" అని రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఐపీఓను గుర్తుచేసుకుంటూ.. ఇటీవల జరిగిన రిలయన్స్ జియో కార్యక్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అన్నారు.

రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్ ఐపీఓ సమయంలో తొలిసారి చిన్న పట్టణాల ప్రజలు కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ డైరెక్టర్, సీఈఓ అజయ్ గార్గ్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.

1977లో, భారత మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా బంగారం, భూమి లేదా బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టేవారు.

ముంబయిలోని స్టాక్ మార్కెట్ కొద్దిమంది పెద్ద బ్రోకర్లకు, ధనవంతులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ, ధీరూభాయ్ తన ఏజెంట్లను గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న పట్టణాలకు పంపారు.

ధీరూభాయ్ అంబానీ ఇన్వెస్టర్లకు 'స్టార్‌'గా మారినప్పుడు..

ఆస్ట్రేలియా జర్నలిస్ట్, రచయిత హమీష్ మెక్‌డొనాల్డ్, ''ద పాలిస్టర్ ప్రిన్స్: ద రైజ్ ఆఫ్ ధీరూభాయ్ అంబానీ'' అనే పేరుతో ధీరూభాయ్ అంబానీ జీవితంపై ఒక బయోగ్రఫీ రాశారు.

ఈ బుక్ 1998లో ప్రచురితమైంది. దీనిలో.. 'గురు ఆఫ్ ది ఈక్విటీ కల్ట్' అనే పేరుతో ఒక చాప్టర్ రాశారు. దీనిలో 1977లో రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఐపీఓ గురించి వివరించారు.

''ఇందిరా గాంధీ రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ధీరూభాయ్ అంబానీకి స్వర్ణయుగం. వార్షిక అమ్మకాల పరంగా.. 1979లో భారత్‌లో టాప్ 50 కంపెనీల్లో ఒకటిగా కూడా ఆయన కంపెనీ లేదు. కానీ, 1984 నాటికి.. రిలయన్స్ భారత్‌లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా మారింది. భారత్‌లో ధీరూభాయ్ అంబానీ ఒక ప్రముఖమైన వ్యక్తిగా మారారు. అభిమానులు కేవలం వ్యాపారవేత్తగా కాకుండా.. ఒక క్రికెటర్‌ లేదా ఫిల్మ్ స్టార్‌ మాదిరిగా ఆయన్ను ఆరాధించేవారు'' అని హమీష్ మెక్‌డొనాల్డ్ రాశారు.

"ధీరూభాయ్ 1970లలో తన వ్యాపారాన్ని విస్తరించి, మూలధనాన్ని సమీకరించడానికి సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో 'మైనైలాన్ లిమిటెడ్' అనే కంపెనీని ధీరూభాయ్ ప్రారంభించారు. 1975లో కర్ణాటక, బాంబే హైకోర్టుల ఆమోదంతో ఆయన రిలయన్స్, మైనైలాన్‌లను విలీనం చేశారు. దీనిలో, కేవలం రూ. 11,000 పెయిడప్ క్యాపిటల్‌తో ఉన్న మైనైలాన్, రూ. 6 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన రిలయన్స్ అన్ని ఆస్తులను, అప్పులను స్వాధీనం చేసుకుంది" అని పేర్కొన్నారు.

1977 మార్చిలో ఆ కంపెనీ బెంగళూరు నుంచి ముంబయికి (అప్పట్లో బాంబేకి) తిరిగి తరలివచ్చి 'రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్'గా పేరు మార్చుకుంది.

1977 అక్టోబర్-నవంబర్ నెలల్లో, ధీరూభాయ్, ఆయన తమ్ముడు నథుభాయ్ (నట్వర్‌లాల్) తమ వద్ద ఉన్న షేర్లను అమ్ముతూ... రిలయన్స్ మొదటి ఐపీఓను ప్రారంభించారు. ఆ తర్వాత, రిలయన్స్ క్రమంగా రైట్స్, బోనస్ ఇష్యూల ద్వారా తన ఈక్విటీ బేస్‌ను విస్తరించుకుంది. 1979 సెప్టెంబర్‌లో ఆర్థిక సంస్థలు తమ రుణాలలో 20 శాతాన్ని ఈక్విటీగా మార్చుకున్నాయి.

"1980లో భారత్‌లో షేర్‌హోల్డర్ల సంఖ్య 10 లక్షల కన్నా తక్కువగా ఉండేది. కానీ, 1985 నాటికి అది 40 లక్షలకు పెరిగింది. వీరిలో, ఒక్క రిలయన్స్‌కే 10 లక్షలకు పైగా షేర్‌హోల్డర్లు ఉన్నారు. భారత్‌లోని ప్రతి నలుగురు షేర్‌హోల్డర్లలో ఒకరి వద్ద రిలయన్స్ షేర్లు ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో ధీరూభాయ్ అంబానీ 'హీరో' హోదాను పొందారు" అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

మధ్యతరగతి ప్రజలు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం పెరిగిందా?

ధీరూభాయ్ అంబానీ చిన్నగా ప్రారంభించి ఒక భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం వల్లే, భారత్‌లోని చిన్న పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ వైపు ఆకర్షితులయ్యారని భావిస్తారు.

ధీరూభాయ్ తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఆయన వద్ద కేవలం రూ. 14,000 మాత్రమే ఉండేవని రిలయన్స్ గ్రూప్ వెబ్‌సైట్ వివరాల్లో తెలిసింది. ఆ తర్వాత, మూడున్నర దశాబ్దాలలో రిలయన్స్ 60,000 కోట్ల రూపాయల స్థాయికి ఎదిగి, ఫార్చ్యూన్ 500 జాబితాలో చేరిన మొట్టమొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా నిలిచింది.

రిలయన్స్ ప్రయత్నాల వల్ల స్టాక్ మార్కెట్‌పై సామాన్య ప్రజల ఆసక్తి పెరగక ముందు.. ఆర్థికంగా బలంగా ఉన్న అతి కొద్దిమంది మాత్రమే భారత మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారు.

ధీరూభాయ్ అంబానీ 1932లో గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలోని చోర్వాడ్ గ్రామంలో జన్మించినట్లు రిలయన్స్ గ్రూప్ వెబ్‌సైట్‌లోని ధీరూభాయ్ అంబానీ ప్రొఫైల్‌లో పేర్కొంది.

1949లో తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఉపాధి వెతుక్కుంటూ ఏడెన్ (ప్రస్తుతం యెమెన్) వెళ్లి, అక్కడొక కంపెనీలో డిస్పాచ్ క్లర్క్‌గా పనిచేశారు. ఆ తర్వాత, ఏడెన్ ఓడరేవులోని ఒక పెట్రోల్ బంకును నిర్వహించే బాధ్యతను చేపట్టారు.

1958లో భారత్‌లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే కలతో ఆయన స్వదేశానికి తిరిగి వచ్చి, సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించారు.

1962లో ఆయన నూలు వ్యాపారంలో అవకాశాలున్నట్లు గమనించారు. ఆ తర్వాత 1965లో ఆయన కంపెనీ పేరును రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్‌గా మార్చారు.

1966లో, ఆయన అహ్మదాబాద్ సమీపంలోని నరోడాలో భూమిని కొనుగోలు చేసి, అక్కడొక టెక్స్‌టైల్ మిల్లును ప్రారంభించారు. 1975లో, ప్రపంచ బ్యాంకు టెక్నికల్ టీమ్ నరోడా మిల్లును భారతదేశపు అత్యుత్తమ కాంపోజిట్ టెక్స్‌టైల్ మిల్లుగా ధృవీకరించింది.

ఆ తర్వాత 1977లో రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఐపీఓ వచ్చింది. ఆ తర్వాత జరిగింది చరిత్ర.

ఆ సమయంలో, చాలామంది స్టాక్ మార్కెట్‌ను ఒక జూదంగా భావించి దానికి దూరంగా ఉండేవారు. మూలధనాన్ని సమీకరించడానికి బ్యాంకు రుణం తీసుకోకుండా, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను (ఐపీఓను) ప్రారంభించాలని ధీరూభాయ్ అంబానీ తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైన చర్యగా పరిగణిస్తారు.

రిలయన్స్ టెక్స్‌టైల్స్ ఐపీఓ సమయంలో, మధ్యతరగతి పెట్టుబడిదారులను అందులో పెట్టుబడి పెట్టేలా ఒప్పించడంలో ధీరూభాయ్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ప్రజల భాగస్వామ్యంతో రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశాలను (ఏజీఎంలను) నిర్వహించడం ప్రారంభించారు. దీనికి వేలమంది షేర్‌హోల్డర్లు స్వయంగా హాజరయ్యేవారు.

1986లో ముంబయిలోని క్రాస్ మైదాన్‌లో రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగినప్పుడు, సుమారు 35,000 మంది షేర్‌హోల్డర్లు హాజరయ్యారని రిలయన్స్ ఇండస్ట్రీస్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.

ధీరూభాయ్ అంబానీ 2002 జులై 6న ముంబయిలో మరణించారు. అప్పటికి ఆయన వయసు 69 సంవత్సరాలు.

అంతకుముందు, రిలయన్స్ జామ్నాగర్‌లో 1999లో తన ఆయిల్ రిఫైనరీని తెరిచింది. అది భారత్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటి. ఇటీవల దీన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సందర్శించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత, 2008లో రిలయన్స్ పవర్, 2017లో రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ తమ ఐపీఓలను జారీ చేశాయి. అయితే, ఈ రెండు కంపెనీల యాజమాన్యం ముకేశ్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ వద్ద ఉంది.

సుమారు 49 సంవత్సరాల కిందట ధీరూభాయ్ నాయకత్వంలో స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన రిలయన్స్ గ్రూప్ గణనీయమైన మార్పులకు లోనైంది.

ఒకప్పుడు వస్త్ర పరిశ్రమగా ఉన్న రిలయన్స్.. ఇప్పుడు పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, రిటైల్, డిజిటల్ సర్వీసెస్, మీడియా వంటి అనేక రంగాలలో తన ఉనికిని చాటుకుంటోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)