ఆంధ్రప్రదేశ్: పొంచివున్న తుపాను ముప్పు, ఏయే జిల్లాల్లో అంటే..

ఫొటో సోర్స్, Soumyabrata Roy/NurPhoto via Getty Images
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచివున్నట్లు విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని హెచ్చరించింది.
ముఖ్యమైన హెచ్చరికలు, వివరాలు:
- అల్పపీడనం బలపడే తీరు: ఆగ్నేయ, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 25 నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.
- ఇది అక్టోబర్ 26 నాటికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మరే అవకాశం ఉందని, ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని అంచనా వేశారు.
- భారీ వర్షాలు: ఈ ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీలలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అతి తీవ్ర వర్షాలు కురిసే సూచనలున్నాయి.
- ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 120 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో (అప్పుడప్పుడు 185 కిలోమీటర్లు) తీవ్ర తుపాను గాలులు వీచే అవకాశం ఉంది.
- మత్స్యకారులకు హెచ్చరిక: సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
- ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.






