రెండు రోజులు ప్రయాణాలు వద్దు- తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అధికారుల విజ్ఞప్తి

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు మంగళ, బుధవారాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాల్లో కట్టి ఉంచుకోవాలన్నారు.
విశాఖకు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం రేపు, ఎల్లుండి తీవ్ర తుపానుగా మారుతుందని, సుమారు 125 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని జైన్ హెచ్చరించారు. అందుకే ప్రయాణాలు పెట్టుకొవద్దని సూచించారు.
సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, పోలవరం, విశాఖ, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.










