అర్నబ్: ఇలాంటి తుపానును ఏపీ ముందెన్నడూ చూడలేదా? 140 కి.మీ. వేగంతో గాలులు వీచే అతి తీవ్ర తుపాను ఎలా ఎదుర్కోవాలి

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుపానుగా బలపడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
'అర్నబ్' తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పీఎల్ఎన్ మూర్తి బీబీసీతో చెప్పారు.
ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 910 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా...మంగళవారానికి అతి తీవ్ర తుపానుగా బలపడుతుందని తెలిపారు.
బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
సోమ, మంగళ, బుధవారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని...జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
'అర్నాబ్' తుపాను ఎలాంటి ప్రభావం చూపుతుంది?
దీని ప్రభావం ఏ ఏ ప్రాంతాలపై ఉంటుంది?
గాలుల తీవ్రత ఎంత?
ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగంతో ‘బీబీసీ తెలుగు’ మాట్లాడింది.


ఏఏ జిల్లాలపై ప్రభావం?
వారు అందించిన వివరాల ప్రకారం...
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నాబ్' తుపానుగా బలపడటంతో...ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, గంటకు 140 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
28న 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేడు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
అర్నాబ్ తుఫాను ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడలరేవు సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది.
అక్కడ తీరం భారీగా కోతకు గురవుతుందని...స్థానిక ప్రజలు ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు, ఎల్లుండి...ఈ మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
అలాగే దీని ప్రభావం ఒడిశా రాష్ట్రంపై కూడా ఉంటుందని...ఇప్పటికే అక్కడ పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

రెడ్ అలర్ట్
తుపాను ప్రభావంతో ఈ నెల 28న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. 27వ తేదీన కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
రెడ్ అలర్ట్ అంటే అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులపై అధికారులు, ప్రజలు చర్యలు తీసుకోవాలనే హెచ్చరిక.
రెడ్ అలర్ట్ ను జారీ చేసిన జిల్లాల్లో కొన్నిచోట్ల 27, 28 తేదీలలో 20 నుంచి 30 సెంటీమీటర్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
గాలుల తీవ్రత...
ఈ నెల 27 ఉదయం నుంచి రాష్ట్ర తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నానికి 60 నుంచి 70, సాయంత్రానికి 90 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి పెరగవచ్చని వాతావరణశాఖ తెలిపింది.
28న ఉదయానికి గాలులు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
తుపాను బలపడుతున్న సమయంలో, అలాగే తీరం దాటే సమయంలో కాకినాడ, యానాం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో సాధారణ సముద్రమట్టానికి కంటే అదనంగా మరింత ఎత్తుకు నీరు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, యానాం సమీపంలో 1-1.5 మీటర్ల ఎత్తున సముద్రపు నీరు పైకి లేచి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.
చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడం, ఇళ్లు, పంటలు దెబ్బతినడం, రహదారులు, రైలు రాకపోకలకు అంతరాయం కలగవచ్చు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సోమవారం ఉదయం 10.30 గంటలకు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది.
ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీ, ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది.
తుపాను ప్రభావిత తీరప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది.

140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
140 కిలోమీటర్ల వేగంతో గాలులు అంటే చాలా తీవ్రమైన తుపాను పరిస్థితని ఏయూ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ బీబీసీతో అన్నారు. సాధారణంగా వీచే బలమైన గాలులతో దీన్ని పోల్చలేమని, చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
అర్నాబ్ తుపాను సమయంలో గాలుల వేగం గంటకు 115–125 కిలోమీటర్లు ఉండి, అప్పుడప్పుడు 140 కిలోమీటర్లకు చేరవచ్చని తెలిపింది. ఇది అంచనా మాత్రమేనని తుపాను దిశ, తీవ్రత బట్టి ఇది మారుతూ ఉంటుందని ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు.
"గంటకు 140 కిలోమీటర్ల గాలులు ప్రమాదకరం. ఈ స్థాయిలో గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పెద్ద కొమ్మలు విరిగిపోవచ్చు. బలహీనమైన చెట్లు కూలిపోవచ్చు. విద్యుత్ తీగలు తెగిపోవడం, సరఫరా నిలిచిపోవడం జరగవచ్చు. అలాగే రేకుల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు, బలహీనమైన పైకప్పులు దెబ్బతినవచ్చు. సైన్‌బోర్డులు, హోర్డింగులు కూలిపోవచ్చు. సముద్రంలో భారీ అలలు, ఉప్పెన ప్రమాదం కూడా ఉంటుంది. తీరానికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావచ్చు." అని వివరించారు.
"అయితే ఇది 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినప్పుడు జరిగే ప్రమాదాలు, దాని తీవ్రత ప్రభావం మాత్రమే. నష్టం ఎంత జరుగుతుందనేది గాలుల వేగంతో పాటు అవి ఎంతసేపు వీస్తాయి, ఇళ్ల నిర్మాణం, చెట్ల పరిస్థితి, వర్షపాతం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది." అని ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో ఇలాంటి గాలులు ఏపీలో వచ్చాయా?
ఈ స్థాయిలో గాలులు ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వచ్చాయని ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు. 2014లో హుద్ హుద్, 2018 తిత్లీ తుపాన్లు వచ్చినప్పుడు తీవ్రమైన గాలులువీచాయని తెలిపారు.
"ఇవి తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు సుమారు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. చెట్లు, భవనాలు, విద్యుత్ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది." అని గుర్తు చేశారు.
గాలి వేగాన్ని బట్టి తుపాన్లను వివిధ రకాలుగా వర్గీకరిస్తారు.
గంటకు 62-87 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే...తుపానును తుపాను అని, 88-117 కిలోమీటర్ల వేగంతో వీచే తుపానును తీవ్ర తుపాను అని, 118-165 కిలోమీటర్ల వేగంతో వీచే తుపానును అత్యంత తీవ్ర తుపాను అని, 166-220 కిలోమీటర్ల వేగంతో వీచే తుపానును అత్యంత తీవ్రమైన తుపాను అని పిలుస్తారు.
అర్నబ్ తుపాను విషయంలో ప్రస్తుత అంచనా ప్రకారం....తుపాను తీరం దాటే సమయంలో నిరంతరంగా గంటకు 115-125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా, గాలి వేగం ఏదైనా సమయంలో గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్లకు చేరవచ్చునని ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.

ఫొటో సోర్స్, IMD
ఏపీ అధికారుల అలర్ట్
'అర్నబ్' తుపాను నేపథ్యంలో ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం, విపత్తుల నిర్వహణశాఖ అప్రమత్తం చేసింది.
ఈదురుగాలులు ఉద్ధృతంగా వీచే ప్రమాదం ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు ఏపీ విపత్తుల నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
విజయవాడ కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
రహదారులు, వివిధ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగి పడితే వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్తు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో మండల కేంద్రాల్లో అత్యవసర బృందాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయం వల్ల తాగునీటి సమస్య తలెత్తకుండా తాగునీటి ప్లాంట్ల వద్ద జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్‌లను వికేంద్రీకరించి డివిజన్, మండల కేంద్రాల్లో ఉంచాలన్నారు.
అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని...ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, బీచ్లలోకి పర్యాటకులను అనుమతించవద్దన్నారు.

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు
బంగాళాఖాతంలో తుపాను పొంచి ఉన్న వేళ రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ, హోంశాఖ మంత్రి అనిత ఆదేశించారు.
రానున్న ఐదు రోజులు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇవాళ క్రమంగా వర్షాలు మొదలై...మంగళ, బుధ వారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఈ మేరకు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీగా అలలు ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వచ్చే వదంతులను వ్యాప్తి చేయవద్దని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజీఎస్ జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని మంత్రి అనిత కోరారు.
గర్బిణుల తరలింపు.
రిజర్వాయర్లలో నీటి మట్టాలను నిరంతరం పరిశీలించాలని, కొండవాలు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు.
తుపాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వంగలపూడి అనిత తెలిపారు.
104, 108 వాహనాలను సిద్ధంగా ఉంచడంతో పాటు వైద్య బృందాలు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.
ప్రజలకు తక్షణ సేవలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
డెలివరీ సమయం దగ్గరపడిన గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలన్నారు.
అర్నబ్ తుపాను ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చారు.
సహాయక చర్యల కోసం 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు.

ఇవీ తాజా హెచ్చరికలు
తుపాను నేపధ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
‘‘అత్యవసరం కాని ప్రయాణాలు, ముఖ్యంగా తుపాను తీవ్రంగా ఉండే సమయంలో ప్రయాణాలు వద్దు.
ఇంటి బయట ఉన్న వదులుగా ఉన్న వస్తువులు, రేకులు, కుండీలు భద్రపరచండి.
మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులు ఛార్జ్ చేసుకోండి. టార్చ్, తాగునీరు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోండి.
సముద్ర తీరానికి, చెట్లకు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండండి.
అధికారులు ఖాళీ చేయమని చెబితే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి.
సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవలు వెంటనే తీరానికి తిరిగి రావాలి’’ అని సూచించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























