మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
గుజరాత్: 'సింహం ప్రతిరోజూ మా గ్రామంలోకి వస్తోంది, మేం ఎలా బతకాలి'
- రచయిత, గోపాల్ కటేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
2026, అక్టోబర్ 22 ఉదయం.. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా కోడినార్ తాలూకాలోని వలాదర్ గ్రామం.
గోబర్‌భాయ్ గోహిల్ ఇంటి బయట ఉన్న మార్కెట్‌లో ఒక దూడ చనిపోయి ఉంది.
ఆ దూడ మెడపై గాయాలు ఉన్నాయి. శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది.
గోబర్ భాయ్ భార్య లఖుబెన్ భయపడుతూ అక్కడ ఏం జరిగిందో బీబీసీతో చెప్పారు.
"నేను గిన్నెలు కడుగుతున్నాను. అప్పుడు ఒక పెద్ద శబ్దం వినిపించింది. దాంతో నేను తలుపు తీసి బయటకు వచ్చాను. ఒక ఆడ సింహం దూడను పట్టుకోవడం చూశాను. నేను గట్టిగా 'హుడ్.. హుడ్' అని అరిచాను. దాంతో దూడను వదిలేసి ఆ సింహం అక్కడి నుంచి వెళ్ళిపోయింది" అని ఆమె చెప్పారు.
"మా ఊళ్లో మహేష్ భాయ్‌ని సింహం చంపి తినేసినప్పటి నుంచి నాకు కొంచెం భయంగానే ఉంది. క్రూర మృగాలు రోజూ గ్రామంలోకి వస్తుంటే భయం లేకుండా ఎలా ఉంటుంది?" అని అన్నారు.
అక్టోబర్ 21 రాత్రి 11 గంటలకు ఒక ఆడ సింహం దాని రెండు పిల్లలు తమ ఇంటి దగ్గరకు వచ్చి దూడ గొంతు పట్టుకున్నాయని వృత్తిరీత్యా రైతు అయిన గోబర్‌భాయ్ చెప్పారు.
"సాయంత్రం అది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి దూడను ఇక్కడే చంపేసింది. మా ఇంట్లో పనిచేసే ఆమె బయటకు వెళ్లినప్పుడు దాన్ని చూసి గట్టిగా అరిచింది. దాంతో నేను కూడా బయటకు పరుగెత్తాను. ఆ సింహం దూడను ఈడ్చుకెళ్తోంది. మేము గట్టిగా అరవడంతో అది దూడను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అప్పటికే దూడ చనిపోయింది" అని ఆయన చెప్పారు.
వలాదర్‌లో అక్టోబర్ 12 రాత్రి ఆడ సింహం దాడి చేసి 30 ఏళ్ల మహేష్ రాథోడ్ అనే వ్యక్తిని చంపేసింది.
ఐదుగురు పిల్లల తండ్రి మహేష్ రాథోడ్ 2 నెలల క్రితమే వలాదర్ వదిలి పోర్‌బందర్‌లోని చేపల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వెళ్ళారు.
కుటుంబంలో పెద్దన్నయ్య మరణించడంతో ఆయన అక్టోబర్ 12న వలాదర్ వచ్చారు.
మహేష్ రాథోడ్ ఇంటి వెనుక భాగంలో పొదలు, తుప్పలు ఉన్నాయి. ఆయన ఇంటి దగ్గర ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో సింహం దాడి చేసి చంపేసి సమీపంలోని తోటలోకి ఈడ్చుకెళ్లిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
అక్టోబర్ 14 తెల్లవారుజామున మహేష్ రాథోడ్ శరీర భాగాలను గుర్తించారు.
ఈ దాడికి పాల్పడి ఉంటుందని భావిస్తున్న సింహాన్ని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పట్టుకుని బోనులో బంధించారు.
అయితే ఆ ఘటన జరిగిన తర్వాత కూడా ప్రతి రాత్రి తమ గ్రామంలోని వీధుల్లో సింహాలు తిరుగుతూనే ఉన్నాయని వలదార్ గ్రామస్థులు చెబుతున్నారు.
గోబర్ భాయ్ ఇంటి దగ్గర దూడను వేటాడిన సింహం, దాని రెండు పిల్లలు అక్టోబర్ 21 రాత్రి వలాదర్ గ్రామం మధ్యలో నవరాత్రి గర్బా పందిరి సమీపంలో కూడా కనిపించాయని గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.
గ్రామస్థులతో మాట్లాడున్నప్పుడే సింహం గర్జన వినిపించింది.
సింహం దాడిలో మహేష్ రాథోడ్ మరణించిన తర్వాత బీబీసీ ప్రతినిధులు బిపిన్ టంకారియా, గోపాల్ కటేషియా అక్టోబర్ 21న వలాదర్ చేరుకున్నారు.
అక్టోబర్ 22 సాయంత్రం 7:45 గంటల సమయంలో బీబీసీ ప్రతినిధులు వలాదర్ చౌక్‌లో పరేష్‌భాయ్ కంజీభాయ్ కాయదా అనే రైతుతో మాట్లాడుతున్నారు.
"ప్రస్తుతం పోలీసులు రేయింబవళ్లు ఇక్కడ గస్తీ కాస్తున్నారు" అని ఆయన చెప్పారు.
"మా గ్రామంలో పండ్ల తోటల పెంపకం ఎక్కువ. ఊళ్లో 80 శాతం తోటలు, 20 శాతం చెరకు సాగు చేస్తారు. ఇప్పుడు మేము పొలాలకు నీళ్లు పెట్టడానికి వెళ్లాలి. పంటలకు ఇది కీలకమైన సమయం. ఇలాంటి నిబంధనలు ఉంటే మేము పొలాల్లోకి ఎలా వెళ్లగలం?" అని ఆయన ప్రశ్నించారు.
"క్రూరమృగాలు గ్రామంలోకి వస్తూనే ఉన్నాయి. మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలి? అటవీ సరిహద్దు మా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలోకి సింహం వస్తే, అందరూ ఆ సింహాన్ని చూడటానికే వెళ్తారు" అని పరేష్‌భాయ్ కంజీభాయ్ కాయదా చెప్పారు.
"అధికారులు సింహాలను గుర్తిస్తున్నామని చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు అలా చేస్తుంటే ఆ రికార్డులు ఉండాలి కదా?. (కుడిచేత్తో సైగ చేస్తూ) అది గర్జిస్తోందా? అది గర్జిస్తోందా? ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న తోటల్లో గర్జన వినబడుతోంది" అని అన్నారు.
బీబీసీ ప్రతినిధులు పరేష్‌భాయ్‌తో ఇంటర్వ్యూ రికార్డ్ చేస్తున్న సమయంలోనే చౌక్‌కు ఉత్తర దిశ నుంచి సింహం గర్జన వినిపించింది. దాంతో పరేష్‌భాయ్ మాట్లాడటం ఆపి ఆ గర్జనను వినమని మాకు సూచించారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఇలా చెప్పారు
"నిన్న రాత్రి 11 గంటలకు సింహం ఇక్కడికి వచ్చింది. మీరు గ్రామంలో ఎవరినైనా అడగవచ్చు. ఆ తర్వాత 11:30 గంటలకు ఇక్కడ ఒక పశువు చనిపోయింది"అని పరేష్ భాయ్ చెప్పారు.
"మేము ఇప్పుడు ఎలా బతకాలి? ఇక్కడంతా భయంగా ఉంది." అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాత్రి ఎప్పుడో ఒకప్పుడు సింహం కచ్చితంగా గ్రామ వీధుల్లోకి వస్తుందని చౌక్‌లో ఉన్న పరేష్‌భాయ్‌తో పాటు ఇతర గ్రామస్థులు బీబీసీ ప్రతినిధులతో చెప్పారు.
మేము రాత్రి 9:30 గంటలకు వలాదర్ నుంచి బయలుదేరాం.
అయితే, అక్టోబర్ 22, 23 మధ్య రాత్రి గ్రామ వీధుల్లో సింహాలు కనిపించలేదని అక్టోబర్ 23న గ్రామస్థులు బీబీసీ ప్రతినిధులకు చెప్పారు.
పశువుల యజమానులు ఏం చేస్తున్నారు?
వలాదర్ సుమారు రెండు వేల జనాభా ఉన్న చిన్న గ్రామం.
ఈ గ్రామానికి తూర్పు వైపున శింగోడా నది, పడమర వైపున సోమత్ నది ప్రవహిస్తాయి. గ్రామంలో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి.
పెద్ద ఎత్తున చెరకు సాగు చేస్తున్నారు.
గిర్ అడవుల చుట్టుపక్కల ఉన్న ఇలాంటి పంట పొలాలు సింహాలు, ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తికి సాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
వలాదర్ గ్రామంలో జంతువులకు మేత కోసం చాలా భూమి ఉంది.
అక్కడ ఉండే ఖక్రా అభాగా వంటి పొదలు సింహాలకు మంచి ఆవాసంగా మారుతున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇది కాకుండా వలాదర్‌లో రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉంది.
రైతులతో పాటు పశువుల కాపరులు కూడా వలాదర్‌లో నివసిస్తూ గొర్రెలు, మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు.
"నేను తొమ్మిదేళ్లుగా పశువులను మేపుతున్నాను. పశువులను మేపడం మొదలు పెట్టినప్పటి నుంచి క్రూర మృగాలను చూస్తూనే ఉన్నాను" అని 26 ఏళ్ల పశువుల కాపరి విపుల్ వాన్ష్ బీబీసీతో చెప్పారు.
"ప్రతీఏటా ఐదు లేదా ఏడు మేకల్ని క్రూర మృగాలు తినేస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలి. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏటా ఏడు మేకలు తక్కువవుతూనే ఉంటాయి. చిరుతపులులు ఇంటి నుంచే వాటిని పట్టుకెళ్తుంటాయి. బయట అయితే సింహాలు, వన్యమృగాలు దాడి చేస్తాయి" అని విపుల్ అన్నారు.
విపుల్ వాన్ష్ ఇంటి గోడ పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ పక్కనే ఉన్న ఒక కర్ర సహాయంతో చిరుతపులులు పదే పదే ఆ గోడపై నుంచి దూకి అతని ఇంటి లోపల ఉన్న మేకలను వేటాడాయి.
దాంతో ఈ రైతు ఏడాది క్రితం ఒక పాత చేపల వలను కొని, దాన్ని కర్రలతో గోడకు కట్టి, గోడ ఎత్తును మరో నాలుగు అడుగులు పెంచారు.
కానీ వారం క్రితం ఒక చిరుతపులి ఆ వలను కూడా దాటి దూకి, లోపల ఉన్న ఒక మేకను వేటాడిందని విపుల్ వాన్ష్ చెప్పారు.
బాలుభాయ్ రాథోడ్ అనే మరో పశువుల కాపరి రాత్రి వేళ తన మేకలను పాకలో ఉంచి తలుపులు మూసేస్తున్నారు.
"ఒక మేక విలువ ఒక ప్రాణం కంటే ఎక్కువ. నా మేకలలో ఒక్కొక్కటి పది నుండి పదిహేను వేల రూపాయల వరకు ఉంటుంది. కానీ సింహం లేదా చిరుతపులి దాన్ని చంపితే, అటవీ శాఖ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే పరిహారంగా ఇస్తుంది. ఐదు వేల రూపాయలకు మేక వస్తుందా? నేను ఒక్క మేకను కూడా వదిలేయాలనుకోను. ఒకటి ఉంటే నేను దాన్ని పట్టుకుని మేపుతాను. కానీ మేకలు ఎక్కువ ఉన్నప్పుడు అవి విడివిడిగా మేస్తాయి. జంతువులు వచ్చి వాటిని చంపి వెళ్ళిపోతుంటాయి" అని బాలు భాయ్ అన్నారు.
ఈ ప్రాంతంలో సింహాల భయాన్ని తగ్గించడానికి వలాదర్ పశువుల కాపరులు తమ గొర్రెలు, మేకలను మేపే సమయాన్ని రైతుల దినచర్యతో అనుసంధానించారని విపుల్ వాన్ష్ చెప్పారు
మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు?
సింహాలు, చిరుతల వల్ల మహిళలకు ప్రమాదం ఎక్కువగా ఉందని గీతాబెన్ మక్వానా అనే మహిళా రైతు చెప్పారు.
"సింహాలు, చిరుతపులుల భయం వల్ల మహిళలు మగవాళ్ల తోడు లేకుండా పొలాల్లో పని చేయడానికి రాలేని పరిస్థితి ఏర్పడింది" అని ఆమె అన్నారు.
గీతాబెన్, ఆమె భర్త భరత్‌భాయ్ మక్వానా ఐదు ఎకరాల భూమిలో చెరకు సాగు చేస్తూ, పశువులను కూడా పెంచుతున్నారు.
ఈ దంపతులు పొలంలో లేనప్పుడు సింహాలు లేదా చిరుతపులుల దాడుల నుంచి రక్షించడానికి వారి గేదెలను పొలంలో నిర్మించిన షెడ్ లోపల ఉంచుతారు.
"మేము తెల్లవారుజామునే పొలానికి రాలేము. కానీ డెయిరీకి పాలు పంపించడానికి ఆవులను, గేదెలను ఉదయమే సిద్ధం చేయాల్సి ఉంటుంది" అని గీతాబెన్ చెప్పారు.
"ఇలాంటి పరిస్థితుల్లో మేము పొలానికి వచ్చినప్పుడు, మొదట పొలంలో ఎక్కడైనా సింహం లేదా చిరుతపులి జాడలు ఉన్నాయా అని తనిఖీ చేస్తాము. ఆ తర్వాతే పశువులను మంద నుండి బయటకు వదులుతాము" అని ఆమె అన్నారు.
బీబీసీ ప్రతినిధులు అక్కడ ఉన్న రెండు రోజుల్లో కొందరు వ్యక్తులు నీళ్ల క్యాన్లు నింపుకుని మలమూత్ర విసర్జన కోసం గ్రామం వెలుపలికి వెళ్లడం చూశారు.
ఈ దృశ్యాలు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపించాయి.
"గ్రామంలో ప్రతిరోజూ సింహాల గర్జనలు వినిపిస్తూనే ఉంటాయి. సంతలో వాటి వెనుక ఆవులు, దూడలు పరిగెత్తడం కనిపిస్తూనే ఉంటుంది" అని గీతా బెన్ చెప్పారు.
"ప్రజలు రోజుకు వంద, రెండొందలు సంపాదిస్తుండటం, ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 12వేలు సాయం అందించడం మంచిదైంది. దీనివల్ల చాలా మంది తమ ఇళ్లలోనే మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. అవి లేకపోతే పరిస్థితి ఏంటో ఆలోచించండి" అని 63 ఏళ్ల కాదర్‌బక్ష్ మక్రానీ అన్నారు.
"సమస్య ఈ ఒక్క గ్రామంలోనే లేదు. ఇది సంధానిధర్, బోర్తలా, లిమ్‌ధ్రా వరకు వ్యాపించింది. నాలుగు-ఐదు రోజుల క్రితం పానికోఠాలో కూడా సింహం కనిపించింది. సింహాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కానీ దీనిపై ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు?" అని ఆయన ప్రశ్నించారు.
ఎంత కాలం నుంచి ఈ సమస్య ఉంది?
తమ ప్రాంతంలో దశాబ్దాలుగా సింహాలు కనిపిస్తున్నాయని, అయితే గత ఐదు నుంచి ఏడేళ్లలో అవి గ్రామ వీధుల్లో తిరగడం బాగా పెరిగిందని వలాదర్ గ్రామ నాయకుడు జిటూభాయ్ సోలంకి చెప్పారు.
"మా పరిస్థితి ఇలా ఉంది. ప్రతిరోజూ లెక్కగడితే ఈ సమస్య తీవ్రత అర్థమవుతుంది. 2024 సంవత్సరంలోనే 45 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి" అని ఆయన అన్నారు.
"పశువులకే కాకుండా మనుషులకు కూడా ముప్పు ఉంది. మేము చాలా జాగ్రత్తగా ఉండాలి, రాత్రి పూట బాత్‌రూమ్‌కు వెళ్లాలన్నా ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది" అని జిటూభాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
"రాష్ట్ర ప్రభుత్వం మహేష్ రాథోడ్ వారసులకు 10 లక్షల రూపాయల పరిహారం అందించింది. అతనిపై దాడి చేసిన సింహాన్ని బోనులో బంధించాం" అని గిర్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రశాంత్ తోమర్ బీబీసీతో చెప్పారు.
అయితే వలాదర్‌లో సింహాలు, చిరుతపులులు నివసించడానికి అనుకూలమైన అనేక ప్రాంతాలు ఉన్నాయని మరొక అధికారి తెలిపారు.
"ఈ గ్రామం గిర్ అడవుల సరిహద్దులో ఉండటం వల్ల, అక్కడ సింహాలు, చిరుతపులుల సంచారం నిరంతరం నమోదవుతూనే ఉంటుంది. అయితే వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా మా సిబ్బంది నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు" అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)