దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లు పడిపోవడం, ముడి చమురు ధర బ్యారెల్‌కు 117 డాలర్లకు చేరుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై ఒత్తిడి కొనసాగింది.
దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రెండు లక్షల రూపాయల కంటే దిగువకు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్‌లో బంగారం ఫ్యూచర్స్ ధర ఔన్సుకు సుమారు 4,030 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్సుకు సుమారు 54 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
దేశీయ మార్కెట్‌లో, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర సుమారు రూ.1, 42, 300 వద్ద, వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు సుమారు రూ.1, 96, 000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
వరుసగా రెండో వారం బంగారం ధరలు తగ్గాయి.

"చమురు ధరలు, వడ్డీ రేట్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై నెలకొన్న ఆందోళనలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి'' అని టీడీ సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ స్ట్రాటజిస్ట్ ర్యాన్ మెకే బ్లూమ్‌బర్గ్‌తో చెప్పారు. అంతేకాకుండా మార్కెట్‌లో పెట్టుబడుల ప్రవాహం కూడా ప్రతికూలంగా ఉందని అన్నారు.
ఈ వారం విలువైన లోహాల ధరలు నాలుగు శాతం మేర తగ్గే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. జూన్ ఆరంభం తర్వాత ఒక వారంలో ఇదే అతిపెద్ద పతనం అవుతుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బంగారం విక్రయిస్తున్నారని మెకే అంటున్నారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతలు ఇంధన ధరలను మరింత పెంచాయి. అదే సమయంలో పెట్టుబడిదారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కంపెనీల షేర్ల నుంచి బయటకువచ్చి అమెరికా బాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా అమెరికా ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడులు పెరిగాయి. ఇది బంగారం ధరలపై ఒత్తిడి పెంచింది. సాధారణంగా బాండ్లపై రాబడులు పెరిగితే బంగారం ధరలు బలహీనపడతాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
పడిపోతున్న వెండి ధరలు
బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ మార్కెట్‌లోని ఒక విభాగంలో మాత్రం ఈ ప్రభావం కనిపించడం లేదు. అది ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లోని బంగారం నిల్వలు.
బ్లూమ్‌బెర్గ్ పరిశీలిస్తున్న గోల్డ్ ఈటీఎఫ్‌లలో వరుసగా గత 14 వారాలుగా బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ధోరణి బంగారం ధరల తగ్గుదలకు పూర్తి విరుద్ధంగా ఉంది.
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కరెన్సీ కొనుగోలు శక్తి తగ్గడం వంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈటీఎఫ్‌ల ద్వారా బంగారాన్ని కొంటూనే ఉన్నారని సాక్సో బ్యాంక్ ఏ/ఎస్‌లో కమోడిటీ స్ట్రాటజీ హెడ్ ఓలే హాన్సెన్ తెలిపారు.
శుక్రవారం(అక్టోబర్ 23)నాటికి వెండి ధరలు 7.5 శాతం పడిపోయాయి. ఆగస్టులో నమోదైన కేజీ 2,48,800 రూపాయల గరిష్ట స్థాయి నుంచి వెండి 56 వేల రూపాయలు తగ్గింది.
కేజీ 4, 20,048 రూపాయల రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి వెండి ధర సగానికి పైగా పడిపోయింది.
2025లో వెండి ధరలు 170 శాతం పెరిగిన తర్వాత ఈ భారీ పతనం చోటుచేసుకుంది.
బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆగస్టులో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ. 1,64,773 దగ్గర ఉండగా ఇప్పుడు అది 23,000 రూపాయలు తగ్గింది.
చమురు ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలపై కూడా అంచనాలు బలపడుతున్నాయి.
అమెరికా ట్రెజరీ బాండ్లపై పెరుగుతున్న రాబడులు, బలపడుతున్న డాలర్, ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లు దాటడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మళ్లీ పెరగడం వంటివి బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని జాయ్ క్యాపిటల్ మార్కెట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ నయీమ్ అస్లాం తెలిపారు.
బాండ్లపై అధిక రాబడి, అమెరికా డాలర్ బలపడడం వల్ల బంగారం ధరలపై కూడా ఒత్తిడి కొనసాగుతోంది.
ఎందుకంటే బంగారం నుంచి క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం రాదు. అదే సమయంలో బాండ్లపై ఎక్కువ రాబడి లభిస్తే బంగారాన్ని కొని దాచుకోవాలనే ఆసక్తి పెట్టుబడిదారులకు తగ్గొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర ఎక్కువే
గత ఏడాదితో పోలిస్తే బంగారంపై పెట్టుబడిదారులకు మంచి రాబడి లభించిందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి కుమార్ జైన్ అంటున్నారు. దీంతో పెట్టుబడిదారుల్లో ఆశాభావం కొనసాగుతోందని చెప్పారు.
'' ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. ధన్‌తేరస్, దీపావళి దగ్గర పడుతున్నాయి. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం కొంటున్నారు. బంగారాన్ని రీసైకిల్ చేసి తిరిగి ఉపయోగించే ధోరణి కూడా పెరిగింది" అని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఆయన చెప్పారు.
గత ఏడాది దసరా సమయంలో 10 గ్రాముల బంగారం ధర 1,16,000 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం దసరా సమయానికి దాని ధర 1,49,000 చేరిందని ఆయన తెలిపారు.
ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారుల్లో బంగారంపై నమ్మకం పెరిగిందని కుమార్ జైన్ అన్నారు.
"పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తోంది. ఆభరణాలు తయారు చేయించుకోవడానికి ప్రజలు బంగారం కొంటున్నారు. డిమాండ్ పెరగడానికి ఇదే ఒక కారణం" అని ఆయన అన్నారు.
అయితే వెండి విషయంలో ప్రజలకు ఎదురైన అనుభవాలు అంత బాగాలేవన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భవిష్యత్తులో బంగారం, వెండిధరలు ఎలా ఉండొచ్చు?
కేంద్ర బ్యాంకులు బంగారం కొనడం, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో డిమాండ్ బలంగా ఉండడం వల్ల బంగారం ధరలు మరింత పతనమవకుండా కొంతవరకు అడ్డుకట్టపడుతోంది.
"బంగారం కొనుగోళ్లకున్న డిమాండ్, అధిక వడ్డీ రేట్ల వల్ల ఏర్పడుతున్న ఒత్తిడి మధ్య సమతుల్యం సాధించడానికి మార్కెట్ ప్రయత్నిస్తోందని ఎక్స్ఎస్.కమ్ మార్కెట్ విశ్లేషకురాలు లిన్ ట్రాన్ తెలిపారు. అమ్మకాల ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ ప్రస్తుతం ఉన్న కొనుగోళ్ల డిమాండ్ ధరలకు కొత్త దిశను చూపించేంత బలంగా లేదని ఆమె చెప్పారు.
పారిశ్రామిక వినియోగంలో వెండికి డిమాండ్ ఉండడంతో తయారీ రంగ కార్యకలాపాలు బలహీనపడినా దాని ధరలపై ప్రభావం పడుతుందని నయీం అస్లాం తెలిపారు. దీంతో వెండిపై అదనపు ఒత్తిడి ఏర్పడుతోందని చెప్పారు.
పారిశ్రామిక డిమాండ్ మెరుగుపడడం, వెండి సరఫరాలో కొనసాగుతున్న పరిమితులు ఒకవైపు, అమెరికా కఠిన ద్రవ్య విధానాల వల్ల ఏర్పడే ఒత్తిడి మరోవైపు ఉందని ఆయన వివరించారు.
ఈ రెండింటిలో ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే దానిపైనే వెండి ధరల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని జాయ్ క్యాపిటల్ అంచనా వేస్తోందని చెప్పారు.
బంగారం ధరలపై ద్రవ్యోల్బణం రెండు రకాల ప్రభావాలను చూపుతోందని ఫారెక్స్.కామ్ మార్కెట్ విశ్లేషకులు ఫవాద్ రజాక్‌జాదా ఒక నోట్‌లో తెలిపారు.
సిద్ధాంతపరంగా చూస్తే ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటే విలువను కాపాడుకునే పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరగాలని ఆయన అన్నారు.
''కానీ ద్రవ్యోల్బణం చాలాకాలం పాటు కొనసాగితే కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్యవిధానాలను కొనసాగించాల్సి రావొచ్చు. దీంతో వాస్తవ వడ్డీరేట్లు, నామమాత్రపు వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇది బంగారం ఆకర్షణను కొంతవరకు తగ్గిస్తుంది'' అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
చమురు ధరల ప్రభావం
చమురు ధరలు బంగారం, వెండి ధరలను పరోక్షంగా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధి వంటి అంశాల ద్వారా ఇది కనిపిస్తుంది.
చమురు ధరలు పెరిగితే విలువైన లోహాల ధరలు తప్పనిసరిగా తగ్గుతాయనే నియమం ఏదీ లేదు.
చమురు ధరలు పెరిగితే ఇంధనం, రవాణా, ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం చాలా కాలం పాటు అధికస్థాయిలో కొనసాగవచ్చని మార్కెట్ ఆందోళన చెందుతుంది.
కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తక్కువగా తగ్గించవచ్చని లేదా ఎక్కువ కాలం పాటు అధికస్థాయిలో కొనసాగించవచ్చని పెట్టుబడిదారులు భావిస్తారు. దీనివల్ల బాండ్ల రాబడులు పెరుగుతాయి. బంగారం నుంచి వడ్డీ ఆదాయం రాదు కాబట్టి బాండ్లతో పోలిస్తే బంగారంపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి తగ్గవచ్చు.
మరో పరిస్థితి కూడా ఉంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళనలు ఎక్కువైతే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారం వైపు మొగ్గు చూపొచ్చు.
అదే సమయంలో వడ్డీ రేట్ల పెరుగుదల ఒత్తిడి పరిమితంగా ఉంటే బంగారం ధరలు పెరిగే అవకాశముంటుంది.
వెండి ఒక విలువైన లోహం మాత్రమే కాదు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ముడి పదార్థం కూడా. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెళ్లు, ఇతర తయారీ రంగాల్లో వెండిని ఉపయోగిస్తారు.
2024లో ప్రపంచవ్యాప్తంగా వెండికి ఉన్న మొత్తం డిమాండ్‌లో పారిశ్రామిక అవసరాల వాటా సుమారు 56 శాతంగా ఉంది.
అందువల్ల చమురు ధరల పెరుగుదల ఉత్పత్తి వ్యయాలను పెంచి, తయారీ కార్యకలాపాలను బలహీనపరిస్తే వెండికి మరో సమస్య ఎదురవుతుంది. పారిశ్రామిక అవసరాల కోసం వెండికి ఉన్న డిమాండ్ తగ్గే అవకాశముంటుంది.
కఠిన ద్రవ్య విధానాలు అమల్లోకి రావొచ్చని, అదే సమయంలో ఆర్థికవృద్ధి మందగించవచ్చని మార్కెట్ భావించినప్పుడు వెండి ధరలు బంగారం ధరల కన్నా మరింత ఎక్కువగా పడిపోయే అవకాశముంది.
పారిశ్రామిక డిమాండ్ తగ్గడం అనేది ఊహిస్తున్న విషయం మాత్రమే.
చమురు ధరలు విలువైన లోహాల ధరలను నేరుగా నియంత్రించవు.
వాస్తవానికి చమురు ధరలు వేగంగా పెరగడం వల్ల వడ్డీ రేట్లపై అంచనాలు ఎలా మారుతున్నాయి, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసేసిన తర్వాత బాండ్ల నుంచి వచ్చే రాబడి ఎలా ఉంది, వెండి విషయంలో పారిశ్రామిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనే అంశాలను పరిశీలించడం ముఖ్యం.
(గమనిక: ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను ఆర్థిక నిపుణులను సంప్రదించి తీసుకోవాలి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























