ఆనందబజార్ పత్రిక కార్యాలయం వద్ద నిరసన, గోడకు కాషాయ రంగు

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కోల్‌కతాలోని ఆనందబజార్ పత్రిక కార్యాలయం గోడకు కొందరు కాషాయ రంగు వేశారు.

మంగళవారం (సెప్టెంబర్ 1న) మధ్యాహ్నం సమయంలో, కాషాయ రంగు తలపాగాలు ధరించిన కొందరు ఒక్కసారిగా "జై శ్రీరామ్" అని నినాదాలు చేస్తూ.. ఆనందబజార్ పత్రిక భవనం ముందుకు చేరుకున్నారు.

వారిలో ఒకరు కార్యాలయ భవనం ముందున్న గోడకు కాషాయం రంగును పూశారు.

ఆ సమయంలో.. నిరసనకారులు ఈ వార్తాపత్రికకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.

పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారని, కానీ వారిని ఏం చేయలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఆగస్టు 21న ఆనందబజార్ పత్రికలో ప్రచురితమైన ఒక శీర్షిక వల్ల ఈ సంఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆగస్టు 20న రైట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీ నిరసన ప్రదర్శన తర్వాత జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఆ తర్వాత రోజు ''కాషాయ గూండాయిజం'' అనే శీర్షికతో ఆనందబజార్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ శీర్షికకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఆగస్టు 28న మరో వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. '' కాషాయ గూండాయిజం అనే శీర్షికను వెంటనే ఉపసంహరించుకోవాలి. కాషాయ రంగును అపవిత్రం చేసేందుకు మేం అసలు అంగీకరించం'' అని అన్నారు.

ఆయన స్పష్టంగా ఆనందబజార్ పత్రికను ఉద్దేశించి మాట్లాడారు.

ఆ తర్వాత.. సోషల్ మీడియాలో ఈ వార్తా పత్రిక ఎడిటర్‌ను ఉద్దేశిస్తూ.. ఎన్నో అభ్యంతరకర పోస్టులు వచ్చాయి.

మరోవైపు హిందూ జాగరణ్ మంచ్ అనే సంస్థ బౌబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వార్తా పత్రిక సంపాదకుడిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.

''శ్యామ ప్రసాద్ ముఖర్జీ, వివేకానంద పుట్టిన గడ్డ పశ్చిమ బెంగాల్. ఇది కాషాయం నేల. ఈ నేలపై కాషాయం గురించి తప్పుగా వ్యాఖ్యానించే ఏ ప్రయత్నాన్ని మేం సహించం'' అని ఒక నిరసనకారుడు మంగళవారం ఆనంద బజార్ పత్రిక కార్యాలయం ఎదుట వ్యాఖ్యానించారు.

అయితే, ఈ నిరసనకారులకు బీజేపీతో సంబంధం ఉందా? లేదా? అన్నది ఇంకా తెలియదు. ఆనందబజార్ పత్రిక దీనిపై ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)