లైవ్ , అర్నబ్ ప్రభావంతో ఏపీలో ఏడుగురు మృతి: సీఎం చంద్రబాబు

అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

సారాంశం

  • అతి తీవ్ర తుఫాను 'అర్నబ్‌' బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
  • ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
  • స్పెయిన్ రైలు ప్రమాదంది జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు రైలు డ్రైవర్లకు, రైల్వే కంట్రోల్ సెంటర్‌కు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డులు స్పెయిన్ మీడియాలో వచ్చాయి.
  • స్పెయిన్‌ రైలు ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ రవాణా శాఖ కార్యాలయం ముందు ప్రజలు నిరసన తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. అర్నబ్ తుపాను: ఏపీలో ఏడుగురు మృతి చెందారన్న సీఎం చంద్రబాబు

    ఆంధ్రప్రదేశ్, అర్నబ్
    ఫొటో క్యాప్షన్, చంద్రబాబు

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

    ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగినప్పటికీ ఏడుగురు చనిపోయారని చంద్రబాబు చెప్పారు.

  2. స్పెయిన్ రైలు ప్రమాదానికి ముందు ఏం జరిగింది?

    స్పెయిన్, రైలు ప్రమాదం, యూరప్
    ఫొటో క్యాప్షన్, రైలు ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది.

    స్పెయిన్ రైలు ప్రమాదం ఆధునిక యూరప్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలోఒకటి. ఇది జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు రైలు డ్రైవర్లకు, రైల్వే కంట్రోల్ సెంటర్‌కు మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో రికార్డులు స్పెయిన్ మీడియాలో వచ్చాయి.

    సాంకేతిక సమస్యలు తలెత్తిన తర్వాత కంట్రోల్ సెంటర్ ఆపరేటర్ ఒక రైలు డ్రైవర్‌తో "మీ ప్రయాణాన్ని సాధారణ వేగంతో కొనసాగించండి" అని చెప్పడం ఓ ఆడియో రికార్డింగ్‌లో ఉంది.

    రైలు నియంత్రణ వ్యవస్థతో తమకు సంబంధాలు తెగిపోయాయని, తాము ఉర్దాలో ఆగిపోయామని 'ఇర్యో' రైలు డ్రైవర్ చెప్పినట్టు ఇంకో ఆడియో రికార్డులో ఉన్నట్టు బీబీసీకి సమాచారమందింది.

    ప్రమాదంలో మరణించినవారికి సంతాపంగా స్పెయిన్‌లో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు.

    మాడ్రిడ్ నుంచి సెవిల్లేకు ప్రయాణిస్తున్న ఒక రైలు బుధవారం(అక్టోబర్ 18)ఉదయం మరో రైలును ఢీకొట్టింది.

    ఈ ప్రమాదంలో 69 మంది మరణించారు. పదులసంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.

    ప్రమాదంలో చిక్కుకుపోయినవారికోసం అత్యవసర సహాయక బృందాలు రాత్రంతా బోగీలను కత్తిరిస్తూ గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చాలా మందిని ఇంకా గుర్తించలేదు.

    రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాలకు దగ్గరలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న ఇతర వ్యక్తులకు మానసిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు.

    సహాయక బృందాలు "అద్భుతంగా పనిచేశాయని ప్రశంసించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకోవడానికి స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు.

  3. సికింద్రాబాద్ : కొన్ని రైళ్లు రద్దు,కొన్ని దారిమళ్లింపు, కొన్ని రీషెడ్యూల్

    రైలు రవాణా, ప్రయాణం, తుపాను
    ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావంతో కొన్ని రైళ్లను దారిమళ్లించారు.
    రైలు రవాణా, ప్రయాణం, తుపాను
    ఫొటో క్యాప్షన్, తుపాను ప్రభావంతో షాలిమార్ నుంచి చర్లపల్లి, చర్లపల్లి నుంచి షాలిమార్‌కు వెళ్లే రైళ్లను రద్దుచేశారు.

    అర్నబ్ తుపాను ప్రభావంతో షాలిమర్ నుంచి చర్లపల్లికి నడిచే, చర్లపల్లి నుంచి షాలిమార్‌కు వెళ్లే రైలును రద్దుచేశారు.

    ఝాదుపూడి-ఇచ్ఛాపురం మధ్య బ్రిడ్జిపైనుంచి వరదనీళ్లు ప్రవహిస్తుండడంతో షాలిమర్ నుంచి చర్లపల్లి, షాలిమర్ నుంచి సికింద్రాబాద్ వైపు నడిచే రైళ్లను ఖుర్దా రోడ్- అంగుల్- సంబల్‌పూర్- టిట్లాగఢ్-రాయగడ-విజయనగరం మార్గం గుండా దారిమళ్లించారు.

    సికింద్రాబాద్-హౌరా, సికింద్రాబాద్-భువనేశ్వర్ న్యూ, భువనేశ్వర్ న్యూ- సీఎస్‌టీ ముంబై రైళ్లను రీషెడ్యూల్ చేశారు.

  4. తుపాన్లు ఎలా ఏర్పడతాయి, తుపాను, హరికేన్, టైఫూన్ మధ్య తేడా ఏమిటి?

    సముద్రంలోని వెచ్చని నీటి వల్ల దాని పైనున్న గాలి వేడెక్కి వేగంగా పైకి లేస్తుంది.ఆ గాలి పైకి వెళ్లి చల్లబడినప్పుడు, కింద నుంచి మరింత వెచ్చని గాలి పైకి వస్తుంది. దీంతో చల్లబడిన గాలి పక్కకు కదులుతుంది. దీనివల్ల సముద్ర ఉపరితలం దగ్గర గాలిపీడనం తగ్గుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడం వల్ల గాలి పీడనం మరింతగ్గి బలమైన గాలుల వీయడం మొదలవుతుంది.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  5. ప్రస్తుతం అర్నబ్ తుపాను ఎక్కడుంది, ఏమైంది?

    తుఫాన్, వర్షాలు, బంగాళాఖాతం, భారత్, ఆంధ్రప్రదేశ్
    ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం అర్నబ్ అల్పపీడనంగా కొనసాగుతోంది. సాయంత్రానికి మరింత బలహీనపడనుంది.

    అతి తీవ్ర తుఫాను ‘అర్నబ్‌’ బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

    గత ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది.

    ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, ఈ సాయంత్రానికి ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య ఒడిశా ప్రాంతాల్లో మరింత బలహీనపడనుంది.

    ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌‌లోని పలు జిల్లాల్లో, ఈశాన్య తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌‌లోని కొన్నిచోట్ల విస్తృతంగా వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల, దక్షిణ ఒడిశాలో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు (21 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు కొనసాగే అవకాశముంది.

  6. కోనసీమలో అర్నబ్ ఎఫెక్ట్: నేలకూలిన కొబ్బరి చెట్లు, వాలిపోయిన వరిపొలాలు

    కోనసీమ జిల్లాలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది. అనేక గ్రామాలపై తుఫాన్ ప్రభావం చూపింది. ప్రస్తుతం సహాయకకార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తుపాను తీవ్రతను చూపే కొన్ని ఫోటోలు చూడండి.

    తుఫాన్, వర్షం, విద్యుత్, పునరావాసం
    ఫొటో క్యాప్షన్, తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లా పాశర్లపూడిలో కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
    తుఫాన్, వర్షం, విద్యుత్, పునరావాసం
    ఫొటో క్యాప్షన్, కోనసీమ జిల్లా బలసుతిప్పలో తుఫాన్ తీవ్రతకు కొబ్బరిచెట్లు ఇలా ఊగిపోయాయి.
    తుఫాన్, వర్షం, విద్యుత్, పునరావాసం
    ఫొటో క్యాప్షన్, భారీ గాలుల కారణంగా ముందుగానే విద్యుత్ నిలిపివేశారు. కానీ అనేకచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన విద్యుత్ సిబ్బందితో సిద్ధంగా ఉండటంతో మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి.
    తుపాను వర్షం, విద్యుత్, పునరావాసం
    ఫొటో క్యాప్షన్, చెయ్యేరుగున్నేపల్లిలో ఇదీ పరిస్థితి. ఓ వీధిలో చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
  7. కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

    కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం
    ఫొటో క్యాప్షన్, కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

    కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన బోటు మంగళవారం బోల్తా పడింది.

    ఈ ఘటనలో గల్లంతైన మత్స్యకారులను రెస్క్యూ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు.

    తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లారని.. వారు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడడంతో వారంతా ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్‌కు చేరుకున్నారని అధికారులు చెప్పారు.

    దీనికి సంబంధించిన సమాచారం మత్స్యశాఖ, ఆర్టీజిఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలకు చేరింది.

    వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 10 బోట్ల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. చివరకు ఇవాళ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

  8. అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

    అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ
    ఫొటో క్యాప్షన్, అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

    దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.

    ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.

    దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుంది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను ఇప్పుడు అల్పపీడనంగా మారింది.

    ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల మీదుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలుతోంది.

    గురువారం ఉదయం 5.30 గంటలకు, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా వద్ద కేంద్రీకృతమై ఉంది.

    ఇది జగదల్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు పశ్చిమాన సుమారు 20 కిలోమీటర్లు, భవానీపట్నానికి (ఒడిశా) నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, టిట్లాగఢ్ (ఒడిశా)కు నైరుతి దిశలో 210 కిలోమీటర్లు, రాయ్‌పూర్‌కు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఇది ఉత్తరం వైపు కదులుతూ సాయంత్రానికి బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

  9. ‘ఆ గాలి శబ్దానికి భయమేసింది’

    వీడియో క్యాప్షన్, ‘తుపాను గాలుల శబ్దం విని భయమేసింది’

    తుపాను కారణంగా తీర ప్రాంతాల్లోని సుమారు 28వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

    అలాంటి వారిలో చెక్క చిన్ని ఒకరు. ఆమె ఏడు నెలల గర్భిణి.

    కోనసీమ జిల్లా కాట్రేనికోవ మండలం మాగసాని తిప్ప గ్రామానికి చెందిన చెక్క సతీష్, ఆయన భార్య చిన్నికి ఇద్దరు పిల్లలు. చిన్ని ఇప్పుడు మూడోసారి గర్భంతో ఉన్నారు.

    మంగళవారం పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. సముద్రజలాలు వెనక్కి పోటెత్తడంతో మాగసానితిప్ప గ్రామంలోకి నీళ్లు చేరడంతో అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది. బలుసుతిప్ప గ్రామంలో తలదాచుకున్న చిన్ని బీబీసీతో మాట్లాడారు.

    ''మా ఊరు మునిగిపోయిందని చెప్పారు. అక్కడికి వెళ్లేందుకు వీల్లేకుండా ఉంది. బలుసుతిప్ప గ్రామంలో పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు.

    ఏడు నెలల గర్భంతో కింద పడుకోలేక బలుసుతిప్పలోని మా బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నా'' అని చెప్పారు.

    ''గాలుల భీకర శబ్దానికి బాగా భయమేసింది. ఎప్పుడో 1996లో తుపాను వచ్చిందట. అప్పటికి నేను పుట్టలేదు. నేను పుట్టాక ఇదే అతిపెద్ద తుపాను.

    మొదటి బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా తుపాను వచ్చింది. మళ్లీ మూడోసారి గర్భంతో ఉన్నప్పుడు తుపాను వచ్చింది.'' అని చెప్పారు చిన్ని.

    మాగసానితిప్ప గ్రామానికి రాకపోకలు సాగించేందుకు రహదారి లేదా వంతెన సౌకర్యం లేదని చెప్పారు చిన్ని. గోదావరి నది పాయ ఉండటంతో పడవపైనే ప్రయాణించి బలుసుతిప్ప గ్రామానికి చేరుకున్నామని చెప్పారామె.

    తుపాను ప్రభావిత జిల్లాల్లో ‘బీబీసీ’ మరికొందరితోనూ మాట్లాడింది. వారేమన్నారో ఈ కథనంలో చదవండి.

  10. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    ఫొటో క్యాప్షన్, తుపాను కారణంగా అనేక చోట్ల వరి పంట నేలవాలింది.

    అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు.

    మధ్యాహ్నం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో పంటలు పరిశీలిస్తారు. అక్కడే రైతులతో మాట్లాడుతారు. అనంతరం తుపాను షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులతో మాట్లాడనున్నారు.

    అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా ఇళ్లు, పంటలు, దుకాణాలు,ఇతర ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం- సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 25కిలోల బియ్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

    చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతోపాటు కిలో చొప్పున ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామని ప్రకటించారు. షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన వారికి రూ.1,000చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

    పంట నష్టాన్ని మినహాయించి,ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. సుమారు 30వేల మంది క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందితో టెలి కాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం సమన్వయం చేసుకున్నామని తెలిపారు.

    కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    ఫొటో క్యాప్షన్, కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  11. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలంలో ఎమ్మెల్సీ స్థానం గెలుచుకున్న కాంగ్రెస్

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలంలో ఎమ్మెల్సీ గెలుచుకున్న కాంగ్రెస్
    ఫొటో క్యాప్షన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలంలో ఎమ్మెల్సీ గెలుచుకున్న కాంగ్రెస్

    కర్నాటక సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసిన వేళ మహారాష్ట్రలోని ఒక స్థానం గెలవడం చర్చనీయాంశంగా మారుతోంది.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలంలో జరిగిన ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.

    నాగపూర్ డివిజన్ గ్రాడ్యుయేట్ నియోజవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి విజయం సాధించినట్టు ఏఎన్ఐ పేర్కొంది

    మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అభిజిత్‌కు 67, 231 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి, బీజేపీ నేత 63, 960 ఓట్లు వచ్చాయి.

    దీంతో కాంగ్రెస్ అభ్యర్థి 3,271 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    “బీజేపీ బలాన్ని బలగాన్ని మోహరించింది. ఆ పార్టీ నేతలంతా నాగపూర్‌లో తిష్ట వేశారు. ఎన్ని చేసినప్పటికీ ఓటర్లు మాకు మద్దతు ఇచ్చారు. మా నేతలంతా ఒక్కటిగా నిలబడి మహా వికాశ్ అఘాడీ బలాన్ని నిరూపించారు” అని అభిజిత్ అభిప్రాయపడ్డారు.

    "చాలా సంస్థలు మాకు మద్దతుగా నిలిచాయి. నా ప్రచార సామగ్రిలో కూడా నాకు 48 సంస్థలు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నాను. ఈ విజయం ఆ సంస్థల కార్యకర్తలకు, నాయకులకు చెందుతుంది"

    మంగళవారం వరకు వచ్చిన ఫలితాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్నాటక, మహారాష్ట్రలో జరిగిన 28 స్థానాల ఎమ్మెల్సీల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది.

    దీనిపై ప్రధానమంత్రి కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల జరిగాయి. బ్యాలెట్ పేపర్లతోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్నవి ఎన్ని” అని ప్రశ్నించారు.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్టును షేర్ చేశారు. రాత్రికి దాన్ని తీసేశారు.

  12. కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం

    కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్స దృశ్యాలు
    ఫొటో క్యాప్షన్, కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్స దృశ్యాలు

    కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది.

    నేలకొరిగిన కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.

    డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో పలుచోట్ల భారీ గాలులతో కూడిన వర్షాలు కురిశాయి.

    మంగళవారం రాత్రి బాసర్లపూడిలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.

    యానాం నుంచి అమలాపురం వెళ్లే మార్గంలో కొబ్బరిచెట్లు నేలకొరిగాయి.

    పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు సరఫరా పునరుద్ధరించే పనులు చేపట్టారు.

  13. పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ- మంత్రి గొట్టిపాటి రవి ప్రకటన

    పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
    ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ

    అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టాలను తక్షణమే అంచనా వేసి, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రిగొట్టిపాటి రవి ప్రకటించారు.

    తుపాను సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, దెబ్బతిన్న 3,700 విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపట్టి, విద్యుత్ అంతరాయం ఏర్పడిన సుమారు 400 గ్రామాలకు గురువారం సాయంత్రంలోగా సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.

    తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటంతోపాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేసినట్టు తెలిపారు.

  14. అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

    అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

    అర్నబ్ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా ఉంది. అందుకే అక్కడక్కడ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

    ఒడిశా రాష్ట్రంలో రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఏఎన్ఐతో మాట్లాడుతూ... గత 24 గంటల వ్యవధిలో రాయగడలో 40 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

    ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువని పేర్కొన్నారు.

    ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని, అయినప్పటికీ, అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.

    రాయగడలో ఇంకా కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

  15. తెలంగాణలోనూ వర్షాలు

    తెలంగాణ, అర్నబ్, ఆంధ్రప్రదేశ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం

    తెలంగాణలో వాతావరణం పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌లోనివాతావరణ శాఖ తెలిపింది.

    భద్రాద్రి గూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

    ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.

  16. ‘తుపాను బలహీన పడినా ఇంకా ప్రమాదం ఉంది.. ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చు’

    ఆంధ్రప్రదేశ్, అర్నబ్, వాతావరణం
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారులు అప్రమత్తం

    తుపాను బలహీనపడినా దాని ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

    శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    కురిసిన భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    పొంగిపోర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.

    సహాయ చర్యల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.

  17. అర్నబ్: తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలో జోరు వానలు

    కొనసాగుతున్న అర్నబ్ తుపాను ప్రభావం
    ఫొటో క్యాప్షన్, కొనసాగుతున్న అర్నబ్ తుపాను ప్రభావం

    ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.

    ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను పూర్తిగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది.

    గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర అల్పపీడనంగా మారింది.

    ఇది అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

    ఇది ఇవాళ ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

  18. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి