జితేంద్ర మిశ్రా: 'ఆపరేషన్ సింధూర్'‌ ఆఫీసర్‌‌కు అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్‌ సీఈఓ పదవి

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

అయోధ్యలోని రామ మందిరంలో కానుకల దొంగతనం ఉదంతం తర్వాత, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటిసారిగా ఒక సీఈఓ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)ను నియమించింది.

ఈ పదవికి ట్రస్ట్ మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ఎంపిక చేసింది. వెస్ట్రన్ ఎయిర్ కమాం‌డ్‌కు కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేసిన మిశ్రా ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ చేశారు.

రామ్ మందిర్ ట్రస్ట్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ విలేఖరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

గతేడాది మే నెలలో పహల్గాం తీవ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య సైనిక ఘర్షణ చెలరేగినప్పుడు జితేంద్ర మిశ్రా వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు అధిపతిగా పని చేస్తున్నారు.

అలాగే ఈ ట్రస్ట్ తన బోర్డులోకి అయోధ్యకు చెందిన మదన్ మోహన్ పాండే, దిల్లీకి చెందిన మహేశ్ భగచంద్కా, షికోహాబాద్‌కు చెందిన నిర్మలా యాదవ్ అనే ముగ్గురు కొత్త సభ్యులను కూడా చేర్చుకుంది.

ఆలయ కానుకల దొంగతనం నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ జూన్ 27న తన పదవికి రాజీనామా చేశారు.

జూలై 6న ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించారు. వారి స్థానంలో కృష్ణ మోహన్‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

బుధవారం జరిగిన సమావేశంలో ట్రస్ట్ తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించిన కృష్ణ మోహన్.. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి అయిన స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు, మహేశ్ భగచంద్కాకు కోశాధికారి బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు.

జితేంద్ర మిశ్రా ఎవరు?

ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా 2025 జనవరి 1న భారత వైమానిక దళంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు పీఐబీ వెల్లడించింది.

ఎయిర్ మార్షల్ మిశ్రా 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్‌గా భారత వైమానిక దళంలో చేరారు.

పుణె‌లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్, అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో శిక్షణ పొందారు.

ఆయన ఫైటర్ కాంబాట్ లీడర్, ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్. ఈ హోదాలో ఆయనకు 3,000 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది.

38 ఏళ్లకు పైగా సాగిన తన కెరీర్‌లో, ఎయిర్ మార్షల్ మిశ్రా అనేక ముఖ్యమైన కమాండ్, స్టాఫ్ పదవులను నిర్వహించారు.

ఎయిర్ మార్షల్ మిశ్రాకు 'అతి విశిష్ట్ సేవా మెడల్', 'విశిష్ట్ సేవా మెడల్' లభించాయి.

'ఆపరేషన్ సింధూర్'లో ఆయన పోషించిన పాత్రకు గాను, 2025లో ఆయనకు సర్వోత్తమ్ యుద్ధ్ సేవా పతకాన్ని ప్రదానం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)