దారా సింగ్: గ్రాహం స్టెయిన్స్, ఆయన పిల్లలను చంపిన వ్యక్తికి స్వేచ్ఛ లభిస్తుందా?

    • రచయిత, గీతా పాండే
    • హోదా, సోషల్ ఎఫైర్స్ ఎడిటర్, దిల్లీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో హింసాత్మక మరణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అవి కొంతమంది పాఠకులకు ఆందోళన కలిగించవచ్చు.

భారత్‌లో క్రైస్తవులపై జరిగిన అత్యంత దిగ్భ్రాంతికర హింసాత్మక ఘటనలలో ఒకటి పాతికేళ్ల తరువాత మరోసారి వార్తలలోకి వచ్చింది. ఈ ఘటనను ప్రపంచం తీవ్రంగా ఖండించింది.

ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మిషనరీ గ్రాహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తి, తనను జైలు నుంచి విడుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం నిర్ణయం తీసుకోనుంది.

దారాసింగ్‌ అసలు పేరు రవీంద్రకుమార్ పాల్. 2000లో అరెస్టయినప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఒడిశాలోని ఓ గ్రామంలో ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ సేవకుడితోపాటు, ఆయన ఆరేళ్లు, పదేళ్ల వయసున్న కుమారులిద్దరినీ సజీవ దహనం చేసిన కేసులో దారాసింగ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

కుష్టు వ్యాధిగ్రస్తులకు స్టెయిన్స్ 30ఏళ్ల పాటు సేవ చేశారు. అయితే వెనుకబడిన కులాలు, గిరిజన వర్గాలకు చెందిన పేద హిందువులను స్టెయిన్స్ బలవంతంగా క్రైస్తవంలోకి మారుస్తున్నారని సింగ్, హిందూ అతివాద సంస్థలకు చెందినవారు ఆయనపై ఆరోపించారు.

ఈ నేరం జరిగిన తీరు భారత్‌లోని మైనారిటీ క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయింది. ఇప్పుడు సింగ్ విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్తలు ఆ దారుణ ఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి.

స్టెయిన్స్‌ ఒడిశా మయూర్‌భంజ్ జిల్లాలోని బరిపదలో నివసించేవారు. అక్కడ ఆయన స్థానిక గిరిజన సమాజం కోసం పనిచేసేవారు.

1999 జనవరి 22న హత్యకు గురయిన రాత్రి స్టెయిన్స్ ఆయన కుమారులు పొరుగున ఉన్న కియోంజర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన మనోహర్‌పూర్‌లో జరిగిన క్రైస్తవ సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్లు జీపులో నిద్రిస్తుండగా సింగ్ నాయకత్వంలోని 60నుంచి 70మంది గుంపు ఆ వాహనాన్ని చుట్టుముట్టింది. వాహనానికి నిప్పంటించి అందులోంచి వాళ్లు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

‘మా మతం ప్రమాదంలో ఉంది’

ఆ తర్వాత సింగ్ పరారయ్యారు. ఆయన్ను పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 8లక్షల బహుమతి ఇస్తామని పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేశారు. కొంతమంది గ్రామస్థులు, గిరిజనులు దారాసింగ్‌కు సాయం చేసినట్టు ఏనుగులుతో ఆడుకునే, పులులుతో స్వారీ చేసే ఆధునిక టార్జాన్‌గా ఆయన్ను కీర్తించినట్టు వార్తలొచ్చాయి. ఏడాది తర్వాత అడవిలో దారాసింగ్ రహస్య స్థావరంపై రాత్రిపూట పోలీసులు దాడి చేసి ఆయన్ను అరెస్టు చేశారు.

జైలులో ఉన్న దారాసింగ్‌ను కొన్ని నెలల తర్వాత ఇండియా టుడే మ్యాగజైన్‌కు చెందిన రూబెన్ బెనర్జీ సంచలనాత్మక ఇంటర్వ్యూ చేశారు. స్టెయిన్స్, ఆయన పిల్లలను తానే హత్య చేశానన్న ఆరోపణలను దారాసింగ్ ఖండించారు. అయితే గ్రాహమ్ స్టెయిన్స్ తనకు నచ్చేవారు కాదని, అలాగే మిషనరీలకు వ్యతిరేకంగా ఉద్యమానికి తాను నాయకత్వం వహించానని చెప్పారు.

''మిషనరీలు మా మతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. మోసం, ప్రలోభాల ద్వారా హిందువులను మతం మారుస్తున్నారు. మా మతం ప్రమాదంలో ఉంది. నిజమైన హిందువుగా వారిని వ్యతిరేకించడం నా బాధ్యత. ఆ ప్రాంతంలో బహుశా నేనే అత్యంత ప్రముఖ వ్యక్తిని కావడంతో పోలీసులు ఈ హత్యల్లో నన్ను ఇరికించారు'' అని ఆయన చెప్పారు.

జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ...

హిందువుల ప్రయోజనం కోసం తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని దారా సింగ్ చెప్పారు. అయితే తనకు ఎప్పటికీ శిక్ష పడదని ఆయన భావించారు.

ఆయన అంచనా తప్పింది. 2003లో ట్రయల్ కోర్టు దారాసింగ్‌కు మరణశిక్ష విధించింది. మరో 12మందికి జీవితఖైదు విధించింది. రెండేళ్ల తర్వాత హైకోర్టు మరణశిక్షను జీవితఖైదుగా మార్చింది. దారాసింగ్ సహచరుడు మహేంద్ర హెమ్రామ్‌కు విధించిన జీవిత ఖైదును హైకోర్టు కొనసాగించింది. మిగిలిన 11మందిపై నేరాన్ని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని చెబుతూ వారిని విడుదల చేసింది.

దారా సింగ్‌కు విధించిన జీవిత ఖైదును 2011 జనవరిలో సుప్రీంకోర్టు సమర్థించింది. ఆయనకు మళ్లీ మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని తిరస్కరించింది.

దారా సింగ్ స్టెయిన్స్, ఆయన పిల్లలను హత్యచేసిన 1999లోనే మైనార్టీలపై పాల్పడిన మరో రెండు దారుణ కేసులకు సంబంధించి కూడా ఆయన 2007లో దోషిగా తేలారు.

ఒక కేసులో ఒక చర్చికి నిప్పంటించిన గుంపుకు నాయకత్వం వహించడం, మంటల్లో ఉన్న భవనం నంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన కాథలిక్ పూజారి అరుల్ దాస్‌ను బాణంతో హత్య చేయడం వంటి నేరాల్లో ఆయనకు జీవిత ఖైదు విధించారు. మరో కేసులో షేక్ రహ్మాన్ అనే దుస్తుల వ్యాపారిని కొట్టి సజీవంగా దహనం చేసినందుకు కూడా ఆయనకు జీవిత ఖైదు విధించారు.

ఆవులను రవాణా చేస్తున్న ముస్లిం వ్యాపారుల లారీని అడ్డగించి, ఆవులను తీసుకెళ్లకుండా వాటిని విడిచిపెట్టిన ఘటనల్లో దారాసింగ్ పాత్ర ఉందని పోలీసులు పది కేసులు నమోదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఇంటర్వ్యూలో స్పందించిన సింగ్ వ్యక్తిగతంగా తాను ఇందులో పాల్గొనలేదని, తన మద్దతుదారులు చేసి ఉండొచ్చన్నారు. అక్రమంగా ఆవులు రవాణా చేయడం, ఆవులను వధించడాన్ని వ్యతిరేకించే ఉద్యమంలో తాను చురుగ్గా పాల్గొన్నట్టు ఆయన అంగీకరించారు. అలాంటివాటిని ఎలాగైనా ఆపాల్సిందేనన్నారు.

ఈ దాడుల వెనక హిందూ సంస్థ బజరంగదళ్ ఉందని చర్చి నాయకులు ఆరోపించారు. తాను బజరంగ్ దళ్ సభ్యుడిని కాదని దారాసింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డీపీ వాధ్వా నేతృత్వంలోని విచారణ కమిషన్ దారాసింగ్ ఒంటరిగానే ఈ ఘటనకు పాల్పడ్డారని తేల్చింది.

‘ఆవేశమే ఆ పని చేయించింది’

గ్రాహమ్ స్టెయిన్స్ భార్య గ్లాడిస్ 2004 జులై వరకు తన కుమార్తె ఎస్తర్‌తో కలిసి భారత్‌లోనే ఉన్నారు. దారాసింగ్‌ను తాను క్షమించానని ఆమె చెప్పారు. క్షమించడం వల్ల మనసు గాయాల నుంచి కోలుకునే మార్గం తెరుచుకుంటుందని ఆమె అన్నారు.

శిక్ష తగ్గించి విడుదల చేయాలని కోరుతూ దారాసింగ్ 2024 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను 25ఏళ్లకు పైగా జైలులో గడిపినందున విడుదలకు అర్హుడినని ఆయన అందులో పేర్కొన్నారు. జైలులో తన ప్రవర్తన మంచిగానే ఉందని, తాను చేసిన పనులకు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నాని చెప్పారు.

యుక్త వయసులో ఆవేశంతో ఈ నేరానికి పాల్పడినట్టు 62ఏళ్ల దారాసింగ్ పిటిషన్‌లో చెప్పారు.

'’నా తప్పులనుఅంగీకరిస్తున్నా. వాటిపై తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నా. యువకునిగా ఉన్నప్పుడు ఆవేశం, భారత్‌లో తీవ్ర హింసాత్మక గత చరిత్రపై కలిగిన ఉద్వేగపూరిత ప్రతిస్పందనల ప్రభావంతో నా పై నేను నియంత్రణ కోల్పోయా. బాధితులపై నాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి, నా చర్యలనే కాకుండా వాటి వెనక ఉన్న ఉద్దేశాన్ని కూడా కోర్టు పరిశీలించాలి'' అని పిటిషన్‌లో కోరారు.

ఆయన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఏ నిర్ణయం తీసుకోబోతున్నదో ప్రభుత్వం ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు తెలియజేయలేదు.

దారాసింగ్ పిటిషన్‌ను పరిశీలిస్తున్న సెంటెన్స్ రివ్యూ బోర్డ్(ఎస్ఆర్‌బీ) మరికొన్ని డాక్యుమెంట్ల కోసం ఎదురుచూస్తోందని, విచారణ వాయిదా వేయాలని ఆగస్టు 19న జరిగిన విచారణలో అధికారులు కోరారు.

రాష్ట్రప్రభుత్వం పదే పదే విచారణను వాయిదా వేయాలని కోరడంపై మనోజ్ మిశ్రా, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది. సెప్టెంబరు 2లోగా నిర్ణయం తీసుకోకపోతే తాము తీసుకుంటామని న్యాయమూర్తులన్నారు. ''మీరు ఏ నిర్ణయం తీసుకోవాలంటే అది తీసుకోండి. కానీ మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటాం'' అని చెప్పారు.

‘‘జైలు నుంచి బయటకు వస్తే..తర్వాత ఏమవుతుంది?’’

రాష్ట్రప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు దారాసింగ్ శిక్ష తగ్గిస్తే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు భారత్‌లోని సుమారు మూడు కోట్ల మంది క్రైస్తవుల్లో కొంత ఆందోళనకు కారణమయ్యాయి. దీనికి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొంతవరకు కారణం.

పిల్లలను హత్య చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, పశ్చాత్తాపపడబోనని 2000లో ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దారాసింగ్ అన్నారు. ''హిందువులు చనిపోయినప్పుడు ఇతరులు ఏడవరు. మరి ఇతరులు చనిపోయినప్పుడు మనం ఎందుకు ఏడవాలి? ఏం జరిగిందో అది సరైనదే. ఇక ముందు ఏం జరిగినా అది కూడా సరైనదే'' అని ఆయన అన్నారు.

జైలు నుంచి విడుదలయితే తాను ఇంతకుముందు ఏం చేసేవాడినో అదే చేస్తానని గో వధను, మతమార్పిడిలను వ్యతిరేకిస్తానని చెప్పారు.

''ప్రభుత్వం వాటిని ఆపాలి. వాటిని ఆపకపోతే మరింతమంది చనిపోయే అవకాశం ఉంది. ఏదైనా జరగొచ్చు'' అని ఆయన అన్నారు.

యూనియన్ ఆఫ్ క్యాథలిక్ న్యూస్(యూసీఎన్)వెబ్‌సైట్‌లో మానవ హక్కుల కార్యకర్త, క్రైస్తవ రాజకీయ కార్యకర్త జాన్ దయాళ్ ఈ విషయంపై రాశారు. దశాబ్దాలపాటు జైలులో ఉన్నవారి శిక్షను తగ్గించి విడుదల చేయడం అసాధారణమైన విషయం కాదని ఆయన అన్నారు. ''శిక్ష అనేది వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి, చివరకు ఆయన తిరిగి సమాజంలో జీవించే అవకాశం కల్పించడానికి ఉండాలనే సూత్రం మానవీయమైనది'' అని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో ఒడిశాలోని మతపరమైన మైనారిటీలలో ఉన్న ఆందోళనను తేలికగా తీసుకోలేమని దయాళ్ అన్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి క్రైస్తవ వ్యతిరేక హింసకు సంబంధించిన చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. 2008లో జరిగిన కంధమాల్ అల్లర్లను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. ఆ అల్లర్లలో పదులసంఖ్యలో ప్రజలు మరణించారు. వేలాదిమంది ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది.

''స్టెయిన్స్ ను, ఆయన పిల్లలను హత్యచేయడం సాధారణం కాదు. అవి అందరికీ కనిపించేలా, ప్రజల్లో భయాన్ని కలిగించే ఉద్దేశంతో చేసిన బహిరంగ, భయానక చర్య. ఫాదర్ అరుల్ దాస్, షేక్ రహమాన్ హత్యలు కూడా అదే సందేశాన్ని మరింత స్పష్టంగా తెలియజేశాయి''

''దారాసింగ్ ఎప్పటికైనా జైలు నుంచి బయటకు వస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న కాదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుంది. ఆ ప్రక్రియలో ఎలా వ్యవహరిస్తుంది. మైనార్టీ వర్గాలకు ఎలా భరోసా కల్పిస్తుంది అన్నది చూడాల్సి ఉంది'' అని దయాళ్ పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)