నేపాల్ వరదలు: చుట్టూ అంతా కొట్టుకుపోతున్నా కదలని ఈ ఇల్లు, అందులోని మనుషులు ఏమయ్యారు?

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, X

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

నేపాల్‌ను ఇటీవల అతలాకుతలం చేసిన భారీ వరదకు సంబంధించిన భయానక చిత్రాలు, వీడియో దృశ్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు నేపాల్, టిబెట్ సరిహద్దులో వరదలు సృష్టించిన విధ్వంస తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.

వరద నీరు, దాని వెంట కొట్టుకొస్తున్న శిథిలాలు ఒక్కో ప్రాంతాన్ని ఎలా ముంచెత్తుతున్నాయో ఈ వీడియోల్లో కనిపిస్తోంది. కాంక్రీట్ ఇళ్లు సైతం వరద ప్రవాహానికి గడ్డిపరకల్లా కొట్టుకుపోతున్నాయి.

అయితే, భయానకంగా ఉన్న ఈ వీడియోల మధ్య ఒక వీడియో మాత్రం వైరల్‌గా మారింది. బీబీసీ వెరిఫై ప్రకారం, ఈ వీడియో త్రిశూలీ నదికి ఆనుకుని ఉన్న ప్రాంతానికి చెందినది.

ఈ ఇంటికి సంబంధించిన వీడియోను బీబీసీ వెరిఫై షేర్ చేస్తూ, ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఈ ఇంట్లో చిక్కుకుపోయారని తెలిపింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటి పైకప్పుపై ఉన్న ఓ వ్యక్తి సహాయం కోసం ఎరుపు రంగు కండువాను ఊపుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. వరద ఉధృతి తగ్గిన తర్వాత ప్రజలు అక్కడికి చేరుకుని వారికి సహాయం చేశారు.

ఈ వ్యక్తులు ఎవరు అన్నది బీబీసీ వెరిఫై వెల్లడించలేదు. అయితే, ఆ కుటుంబం ఎలాగోలా ప్రాణాలతో బయటపడగలిగిందని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోలో కనీసం ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక మహిళ, మరొకరు చిన్నారి. ఆ చిన్నారి బాలిక అయి ఉండవచ్చని తెలుస్తోంది. ఇంటి రెండో అంతస్తులో బాల్కనీని లాంటి ప్రదేశంలో ఈ వ్యక్తులు చిక్కుకుపోయినట్లు కనిపిస్తున్నారు.

వారి చుట్టూ బురదతో కూడిన వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దానితోపాటు పెద్ద రాళ్లు, శిథిలాలు, ఆస్బెస్టాస్ షీట్లు కొట్టుకొస్తున్నాయి.

ఇప్పటికీ నిలిచి ఉన్న ఆ ఇంటిని ఈ వస్తువులు నిరంతరం ఢీకొంటూ కనిపించాయి.

ఇదిలా ఉండగా, ఆ ఇంట్లోని నివాసితులు నిస్సహాయంగా బాల్కనీలో నిలబడి ఉన్నారు. ఓ మహిళ ఇంటి పైకప్పుపైకి చేరుకుని సహాయం కోసం ఎరుపు రంగు కండువాను ఊపుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో ప్రజలు ఏమంటున్నారు?

అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఎరిక్ చెన్ ఈ దృశ్యాలను షేర్ చేస్తూ "ఇటీవల నేను చూసిన అత్యంత నిస్సహాయ దృశ్యం ఇదే. చుట్టుపక్కల ఉన్న ప్రతిదానినీ కొట్టుకుపోయేంత ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ, ఓ ఇల్లు మాత్రం ఇంకా నిలిచి ఉంది" అని రాశారు.

"భారీగా ఎగసిపడుతున్న బురద, మంచు, రాళ్లు, నీటి ప్రవాహం ఈ నేపాల్, టిబెట్ లోయ గుండా దూసుకెళ్తుండగా, ప్రజలు బాల్కనీలు, పైకప్పులను పట్టుకుని వేలాడుతున్నారు. వాళ్లంతా ఒక కుటుంబం. తర్వాత వచ్చే అల తమకు మిగిలిన చివరి ఆశ్రయాన్ని కూడా దానితో తీసుకుపోతుందా అని భయంతో ఉక్కరి బిక్కిరి అవుతున్నారు. వారు ప్రాణాలతో బయటపడాలి. మరో అల వచ్చి తాకేలోపు సహాయకులు వారిని చేరుకోవాలి."

"ఈ దృశ్యాలను బాధాకరమైనవిగా మార్చింది ప్రకృతి శక్తి మాత్రమే కాదు. నేపాల్ వైపు నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఈ వరద టిబెట్ వైపున ఉన్న ల్హెండే, భోటేకోషి నది నుంచి ప్రారంభమైంది. అక్కడ ఒక హిమానీనదం విరిగి, నదిలోకి శిథిలాలను తోసుకువచ్చింది. దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమకు చైనా అధికారులు సకాలంలో ఎలాంటి అధికారిక హెచ్చరిక ఇవ్వలేదని చెబుతున్నారు. చైనా ప్రభుత్వం కంటే ముందే స్థానికులు ప్రమాదం గురించి హెచ్చరించారు. త్రిశూలీ నదిలో నీటి మట్టం సుమారు 30 నిమిషాల్లో తొమ్మిది మీటర్లు పెరిగింది. సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి, బాల్కనీలో చిక్కుకుపోయి ప్రపంచం తమ కళ్లముందే కనుమరుగవడాన్ని చూడటానికి మధ్య తేడా ఈ అరగంటే."

"సకాలంలో హెచ్చరికలు ఇవ్వడంలో ఎలాంటి వైఫల్యం జరగలేదని చైనా ఆ తర్వాత ఖండించింది. మంచు, రాళ్లతో కూడిన హిమపాతం ఎంత ఆకస్మికంగా సంభవించిందంటే, నదీ ప్రవాహాన్ని కొలిచే పరికరాలు కూడా దాన్ని గుర్తించలేకపోయాయని తెలిపింది. అయితే, ఇదే నదిలో 2025లో సంభవించిన వరదల తర్వాత చర్చించిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, ఈ వరద సంభవించే సమయానికి ఒప్పందంగా ఎందుకు అమలు కాలేదో వివరించాల్సి ఉంటుంది కదా?" అని ఆయన అన్నారు

"వందలమంది ప్రాణాలు కోల్పోయారు. విదేశీ యాత్రికులు, ట్రెక్కర్లతో సహా వెయ్యి మందికి పైగా ఇంకా ఆచూకీ తెలియడం లేదు. కూలిపోకుండా మిగిలిన ఆ ఇల్లు అద్భుతం ఏమీ కాదు. అది ప్రాణానికి, నదికి మధ్య మిగిలిన పలుచని సరిహద్దు. ఆ కుటుంబం ఇప్పటికీ అందులో సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని ఎరిక్ అన్నారు

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 600 దాటింది

నేపాల్‌లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 675కు పెరిగిందని నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ పేర్కొంది.

ఇదిలా ఉండగా, చైనా ప్రభుత్వ ఆధీనంలోని మీడియా ప్రకారం, టిబెట్‌లో అధికారికంగా నమోదైన మృతుల సంఖ్య 16కు పెరిగింది. మరో 546 మంది ఆచూకీ లేదు.

నేపాల్‌లో వరదలు సంభవించిన నేపథ్యంలో అంతర్జాతీయ సహాయ సంస్థలు, అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

వరదల అనంతరం నేపాల్‌లో ఇంకా సుమారు 2,400 మంది ఆచూకీ లేదని సమాచారం.

యూరోపియన్ యూనియన్, కెనడా, అమెరికా సహా అనేక దేశాలు నేపాల్‌కు సహాయ సామగ్రి లేదా ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించాయి.

ఐక్యరాజ్యసమితి ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, 10 వేలకు పైగా కుటుంబాలకు అత్యవసరంగా ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అవసరమవుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)