ఒకటిన్నర కోట్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను సజీవ దహనం చేయాలనుకున్నది ఎవరు? కాలిన గాయాలతో రెండు నెలలుగా చికిత్స పొందుతూ మృతి

ఫొటో సోర్స్, Instagram Page
- రచయిత, నవజ్యోత్ కౌర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
పంజాబ్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ చండీగఢ్ పీజీఐలో చికిత్స పొందుతూ ఈ నెల 26న మరణించారు. ఆమె మొహాలీలోని ఖరడ్ ప్రాంతంలో నివసించేవారు.
మంజీత్‌ను కొందరు కిడ్నాప్ చేసి సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారని చండీగఢ్ పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత ఆమె దాదాపు రెండు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఈ కేసులో చండీగఢ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తీవ్రమైన కాలిన గాయాలతో మంజీత్ కౌర్ పీజీఐలో చేరినట్టు పోలీసులు చెప్పారు. అంతకుముందు ఆమె మొహాలీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
మంజీత్ కౌర్‌ను మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్చినప్పుడు తీవ్రంగా కాలిన గాయాల గుర్తులు ఆమె శరీరంపై ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్టు ఖరడ్ సదర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గుర్ప్రీత్ సింగ్ చెప్పారు.


ఫొటో సోర్స్, manjeet__sukh_1313/Insta
తెలిసిన మహిళను కలవడానికి వెళ్తే...
ఖరడ్ పోలీసులు మ్యాక్స్ ఆస్పత్రిలో మంజీత్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
"మంజీత్ తనకు తెలిసిన ఒక మహిళను కలవడానికి చండీగఢ్‌లోని సెక్టార్ 34కు వెళ్లారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేసి, ఆ తర్వాత ఒక కారులో మోరిండాకు తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డారు'' అని గుర్ప్రీత్ సింగ్ చెప్పారు.
ఆ తర్వాత మంజీత్‌కు తెలిసిన ఒక వ్యక్తి ఆమెను మోరిండాలోని ఒక స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి ఆమెను మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.
తర్వాత ఆమెను జులై 9న చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు.
"కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా, ఖరడ్ పోలీసులు ఒక డీడీఆర్ (డైలీ డైరీ రిపోర్ట్) నమోదు చేసి, చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్ అధికారులకు కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు" అని గురుప్రీత్ సింగ్ చెప్పారు.
మంజీత్ తల్లి ఫిర్యాదు మేరకు సెక్టార్ 34 పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు చండీగఢ్ సౌత్ డీఎస్పీ గుర్జీత్ కౌర్ తెలిపారు.

ఫొటో సోర్స్, ANI/manjeet__sukh_1313/Insta
మంజీత్ కౌర్ ఎవరు?
మంజీత్ కౌర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సహా తన ఖాతాలలో అనేక వీడియోలను అప్లోడ్ చేసేవారు.
ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్. మేకప్, పాటలకు సంబంధించిన వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేసేవారు.
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు కోటీ 46 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మంజీత్ కౌర్ హరియాణాకు చెందినవారు. కానీ ఆమె ఖరడ్‌లో అద్దె ఇంట్లో నివసించేవారు.
మంజీత్ కౌర్‌కు ఇంకా పెళ్లి కాలేదని, కొంతమందితో ఆమెకు వివాదాలున్నాయని గుర్ప్రీత్ సింగ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























