నేపాల్ వరదలు: ‘‘సొరంగంలో తరుముకొస్తున్న వరద నుంచి బయటపడటానికి 20 నిమిషాలు పరిగెత్తా’’

    • రచయిత, అశోక్ దహల్, కమల్ పారియర్
    • హోదా, బీబీసీ నేపాల్, నువాకోట్, సెంట్రల్ నేపాల్ నుంచి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

గత వారం భారీ ఆకస్మిక వరదల కారణంగా త్రిశూలి నది నీరు ఒక్కసారిగా తమ సొరంగంలోకి దూసుకు వచ్చినప్పుడు.. తాము ఎదుర్కొన్న విపత్కర క్షణాల గురించి నేపాలీ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన కార్మికులు బీబీసీకి వివరించారు.

సుమారు 30 మందితో కూడిన బృందం సొరంగంలో కాంక్రీట్ కోటింగ్ పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురుగాలులతో ఇదంతా ప్రారంభమైందని పెమ్బాథున్ తమాంగ్ గుర్తు చేసుకున్నారు.

బలమైన ఈదురుగాలులకు అక్కడి సామాగ్రి ఎగిరిపోయింది. బరువైన యంత్రాలు బోల్తా పడ్డాయి. ఆ ప్రాంతానికి కొంచెం దూరంలోని ఇళ్లు అప్పటికే కొట్టుకుపోయాయి.

''సొరంగం బయటి గేటు వైపు పరిగెత్తా'' అని తమాంగ్ చెప్పారు. ''కానీ, వెనుకాలే వరద నీరు వేగంగా పారుతూ నా వైపు వస్తుంటే, నీటిలో చిక్కుకోకుండా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లా'' అని తెలిపారు.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న తమాంగ్ కుటుంబ సభ్యులు కొందరు ప్రాణాలు కోల్పోయారు.

గత వారం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్‌లో మృతుల సంఖ్య 1,000 దాటింది. సుమారు 4,000 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

గల్లంతైన వారిలో చాలామంది (బహుశా వందల మంది) నది వెంబడి ఉన్న జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించిన భారీ సొరంగ వ్యవస్థలో పనిచేసే తమాంగ్ వంటి కార్మికులే.

భారీ సహాయక చర్యల్లో భాగంగా ఇంజనీర్లు ఈ సొరంగాల్లోకి ప్రాణవాయువును పంపిస్తున్నారు.

''మేం సొరంగాల్లో గాలింపు, సహాయక చర్యలపై దృష్టి సారిస్తున్నాం. మా పని కొనసాగుతోంది'' అని నేపాలీ ఆర్మీకి చెందిన అధికార ప్రతినిధి రాజా రామ బస్నెట్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

మంగళవారం 119 మందిని కాపాడినట్లు సైన్యం తెలిపింది.

''సరిగ్గా ఆలోచించలేకపోయా''

ఎత్తయిన ప్రదేశం వైపునుంచి తమ వైపు దూసుకొస్తున్న వరద నుంచి తప్పించుకోవడానికి సుమారు 20 నిమిషాలసేపు పరిగెత్తానని తమాంగ్ చెప్పారు.

''ఆ షాక్‌తో దాదాపు స్పృహ తప్పిపడిపోయాను. స్పష్టంగా ఆలోచించలేకపోయా'' అని తెలిపారు.

తమాంగ్ సహోద్యోగి ఇటా కేలే మాట్లాడుతూ... తాము వేగంగా పరిగెత్తుతున్న సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు తమను కింద పడవేశాయని చెప్పారు.

నేపాల్ విద్యుత్ ఉత్పత్తిలో 99 శాతానికి పైగా జలవిద్యుత్ నుంచే వస్తుంది. అప్పర్ త్రిశూలి 3బీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించే ఒక కీలకమైన ఉత్పత్తి కేంద్రంలో తమాంగ్, కేలే పని చేస్తున్నారు.

వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ ప్లాంట్.. నేపాల్ నేషనల్ గ్రిడ్‌కు అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం కోసం ఎగువన ఉన్న జలవిద్యుత్ కేంద్రం నుంచి వచ్చే నీటిని పునర్వినియోగించుకునేలా రూపుదిద్దుకుంది.

అక్కడ పలువురు సిబ్బంది పనిచేస్తున్నారు. పెద్ద సొరంగం కోటింగ్ మెషిన్ వద్ద పనిచేస్తున్న బృందమే అందరికన్నా చివరిగా వెళ్ళిందని తమాంగ్ చెప్పారు. కానీ, వెళ్లిన వెంటనే కఠోర సత్యం బయటపడటం మొదలైంది.

''నా ఇల్లు ఉండాల్సిన ప్రాంతం వైపు చూస్తే అక్కడ ఏమీ మిగిలి లేదు. అప్పుడే అంతా అయిపోయిందని అర్థమైంది'' అని తమాంగ్ చెప్పారు.

తన తల్లి, అన్న, వదిన, వారి ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారని తమాంగ్ చెప్పారు. వరద వచ్చినప్పుడు వారు నది ఒడ్డున ఉన్న తమ ఇంట్లోనే ఉన్నారు.

ఆయన భార్య, కుమారుడు, మేనల్లుడు మాత్రమే బతికారు.

''బతికున్న వారికే బాధ''

''ఇప్పుడు జీవితం అర్థరహితంగా అనిపిస్తోంది. బతికి ఉండటమే దుర్భరంగా మారింది. ఎక్కడ తినాలి, ఎక్కడికెళ్లాలో అర్థం కావడం లేదు'' అని తమాంగ్ చెప్పారు.

తన కుటుంబంలో ఎనిమిది మందిని కోల్పోయిన కేలే, తానెందుకు బతికున్నానో అర్థం కావడం లేదన్నారు. ఈ విపత్తులో ఆయన తల్లి, పెద్ద కుమార్తె మరణించగా. కేలే ముగ్గురు కుమారులు, భార్య మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

ముఖ్యంగా ఈ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లు మూతపడితే తమ భవిత ఏమిటనే విషయంపై తమాంగ్ ఆందోళన చెందుతున్నారు.

"పరిస్థితి ఇలాగే కొనసాగితే, మేం ఆకలితో అలమటించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మేం బతకలేమేమో అనిపిస్తుంది" అని తమాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

తమాంగ్, మరికొందరు శాంతి బజార్‌ గ్రామంలో రెండురోజులపాటు తలదాచుకున్నారు. ఆ తర్వాత ఆర్మీ వచ్చి వారిని కాపాడింది. తనతో కలిపి 50 నుంచి 60 మంది కార్మికులు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడి ఉంటామని తమాంగ్ అంచనావేశారు.

ప్రమాదం జరగడానికి ముందు ఈ గ్లేసియర్ చుట్టుపక్కల ప్రాంతం బలహీనపడిందని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయి. మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలుంటే, చాలామంది ప్రాణాలు కాపాడి ఉండవచ్చని కొత్త నివేదిక సూచిస్తోంది.

ఏషియన్ మౌంటైన్ అకాడమిక్ అలయెన్స్‌, స్టిమ్సన్ సెంటర్, చైనాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటైన్ హజార్డ్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిపుణుల ప్రకారం.. ఈ హిమనీనదం ఉపరితలం వేగంగా కదలడం, కరిగిన నీరు గోధుమ రంగులోకి మారడం, చుట్టుపక్కల రాళ్లు పగుళ్లకు గురి కావడం ఉపగ్రహ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోంది.

మంచు చరియలు విరిగి పడటానికి దారితీసే అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని సూచించే సంకేతాలు ఇవి.

మంచు చరియలు ఎంత వేగంగా విరిగిపడ్డాయంటే.. సమీపంలో ఉన్నవారిని సాధారణ హెచ్చరికలు కూడా కాపాడలేకపోయాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

కానీ, వరద నీరు చేరుకోవడానికి 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టిన నది దిగువ ప్రాంతాలలో సమగ్రమైన హెచ్చరిక వ్యవస్థ అందుబాటులో ఉంటే గణనీయమైన సంఖ్యలో ప్రాణాలను కాపాడి ఉండవచ్చని వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం చైనా, భారత్, నేపాల్‌కు చెందిన నిపుణులు భారీ యంత్రాలను ఉపయోగిస్తూ.. జలవిద్యుత్ ప్రాజెక్టుల శిథిలాలను తొలగిస్తున్నారు.

వివిధ జలవిద్యుత్ ప్లాంట్ల వద్ద చిక్కుకుపోయిన కార్మికుల వద్దకు చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

''లోపల కొందరు ఇంకా బతికే ఉన్నారు. వారిని త్వరగా రక్షిస్తే చాలా సంతోషంగా ఉంటుంది'' అని తమాంగ్ చెప్పారు. ''అక్కడ చిక్కుకుపోయిన చాలామంది నాకు తెలుసు'' అని అన్నారు.

అదనపు సమాచారం – జస్టిన్ రౌలెట్, క్లైమెట్ ఎడిటర్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)