బ్లూటూత్: ఈ పేరు వెనకున్న1,000 ఏళ్ల చరిత్ర ఏంటి?

    • రచయిత, లిండ్సే గాలోవే
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

జెల్లింగ్‌లో ఉన్న రెండు పురాతన శిలాఫలకాలు డెన్మార్క్‌ను తీర్చిదిద్దిన వైకింగ్ రాజు కథ గురించి చెబుతాయి. అలాగే బ్లూటూత్‌ అనే పేరు ఎలా వచ్చిందో కూడా వివరిస్తున్నాయి.

మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా హెడ్‌ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి ఉంటే, బ్లూటూత్ అనే పదం తెలిసే ఉంటుంది.

అయితే ఈ టెక్నాలజీ ఆధునికమైనదైనా, దాని పేరు వెనుక ఉన్న కథ మాత్రం 1,000 ఏళ్ల పురాతనమైంది.

బ్లూటూత్ పదం వెనకున్న కథ డెన్మార్క్‌ను పాలించిన ఒక వైకింగ్ రాజుతో ముడిపడి ఉంది.

ఆయన పాలననాటి గుర్తులు ఇప్పటికీ కోపెన్‌హాగెన్‌కు సుమారు 250 కిలోమీటర్ల పశ్చిమాన ఉన్న చిన్న డానిష్ పట్టణం జెల్లింగ్‌‌లో కనిపిస్తుంది.

ఆ రాజు పేరు హరాల్డ్ గోర్మ్సన్.

ఆయన 10వ శతాబ్దంలో డెన్మార్క్‌ను పాలించారు. ఆయనకు ‘బ్లూటూత్’ అనే మారుపేరు ఉండేది. పాత నార్స్ భాషలో దీన్ని బ్లాటన్ అని అనేవారు.

ఆయన మరణించిన సుమారు 150 ఏళ్ల తర్వాత, ఈ మారుపేరును తొలిసారిగా లిఖిత పూర్వకంగా నమోదు చేశారు. ఆయన నోట్లో ఉన్న నీలం రంగులో కనిపించే లేదా పుచ్చిపోయిన పన్ను కారణంగా ఆయన్ను ఈ పేరుతో పిలిచి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

"డెన్మార్క్ ప్రజలను క్రైస్తవులుగా మార్చాడు"

హరాల్డ్ సాధించిన కీలక విజయాల్లో ఒకటి డెన్మార్క్‌ను క్రైస్తవ మతంలోకి మార్చడం. ఇది సుమారు క్రీ.శ. 965 ప్రాంతంలో జరిగినట్లు భావిస్తున్నారు.

జెల్లింగ్‌లో ఉన్న రెండు శిలాఫలకాల్లో పెద్దదాన్ని హరాల్డ్ స్వయంగా ఏర్పాటు చేయించారు. దానిపై "డెన్మార్క్, నార్వే మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని, డేన్లను క్రైస్తవులుగా మార్చాడు" అని రాయించారు.

అదే రాతిపై స్కాండినేవియాలో యేసు క్రీస్తును చిత్రించిన అత్యంత ప్రాచీన చిత్రాల్లో ఒకటి ఉంది.

అప్పటి వరకు ఉత్తర యూరప్‌లోని చాలా ప్రాంతాలు చిన్న చిన్న భూభాగాలుగా విడిపోయి, వాటిని స్థానిక తెగ నాయకులు (చీఫ్‌లు) పాలించేవారు.

క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ద్వారా హరాల్డ్ తన అధికారాన్ని కేంద్రీకరించుకోవడంతో పాటు, క్రైస్తవ యూరప్‌తో డెన్మార్క్ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, డెన్మార్క్ రాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి అవకాశం లభించింది.

"200 ఏళ్ల వైకింగ్ యుగం(ఉత్తర యూరప్‌లోని వైకింగ్ ప్రజలు సముద్ర ప్రయాణాలు, వాణిజ్యం, దండయాత్రలు, అన్వేషణలు, కొత్త ప్రాంతాల్లో స్థిరపడటంతో ప్రసిద్ధి చెందిన చారిత్రక కాలం) తర్వాత డెన్మార్క్‌ను ఒక దేశంగా నిర్మించే ప్రక్రియ అది. ఆ సమయంలో ఉత్తర ప్రాంతాల ప్రజలు రాజకీయ వ్యవస్థల విషయంలో చాలా విషయాలు వేగంగా నేర్చుకోవాల్సి వచ్చింది. యూరప్‌లో అమలులో ఉన్న వివిధ రాజకీయ విధానాలను వారు బాగా అర్థం చేసుకున్నారు. క్రైస్తవ మతం తమకు ఎలా ఉపయోగపడగలదో, అలాగే ఒక రాజ్యంలో అధికారాన్ని ఎలా కేంద్రీకరించవచ్చో కూడా వారు నేర్చుకున్నారు" అని కాంగెర్నెస్ జెల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ అండ్ మ్యూజియం క్యూరేటర్ ఆడమ్ బాక్ అన్నారు.

జెల్లింగ్ ప్రాముఖ్యత ఏంటి?

హరాల్డ్ కథ జెల్లింగ్ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలతో ముడిపడి ఉంది.

హరాల్డ్ తండ్రి గోర్మ్, ఆయన భార్య థైరా జ్ఞాపకార్థం పట్టణంలోని రెండు శిలాఫలకాలలో చిన్నది, పాతదైన రాయిని ఏర్పాటు చేయించారు. ఈ రాతిపై డెన్మార్క్‌‌లోనే "డెన్మార్క్" అనే పేరును తొలిసారిగా రాత రూపంలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.

"మేం దీన్ని డెన్మార్క్ బర్త్ సర్టిఫికెట్ అని పిలుస్తాం" అని సమీపంలోని వైలే పట్టణానికి చెందిన నివాసి ఆన్ హావ్‌గార్డ్ మికెల్సెన్ అన్నారు.

కాబట్టి జెల్లింగ్‌ను డెన్మార్క్ జన్మస్థలంగా భావించవచ్చు.

నేడు జెల్లింగ్‌లో కేవలం 4,000 జనాభాయే నివసిస్తున్నప్పటికీ, హరాల్డ్ బ్లూటూత్ కాలంలో ఇది అధికార కేంద్రంగా ఉండేది.

మొదట్లో ఇది అన్యమత వైకింగ్‌ల సమాధి స్థలం. అయితే హరాల్డ్ పాలనలో జెల్లింగ్‌లో అన్యమత సంప్రదాయాలు, క్రైస్తవ సంప్రదాయాలు రెండూ కలిసి కనిపించే ప్రదేశంగా మారింది.

పాత వైకింగ్ కాలం గుర్తులు జెల్లింగ్‌లో ఇప్పటికీ ఉన్నాయి.

ఒకప్పుడు అక్కడ ఉన్న బలమైన చెక్క కంచెను ఏర్పాటుచేశారు. అక్కడ ఓడ ఆకారపు నిర్మాణ గుర్తులు కూడా ఉన్నాయి. ఇది బహుశా రాణి 'థైరా' జ్ఞాపకార్థం అయ్యుండొచ్చు.

అక్కడ ఉన్న రెండు సమాధులు, చర్చి ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి.

‘‘జెల్లింగ్ కథ కేవలం ధైర్యవంతులైన వైకింగ్ యోధులు, థోర్, ఓడిన్ గురించి కాదు. ఇది ముఖ్యంగా రాజకీయాలు, మార్పు, పాత సంప్రదాయాల నుంచి కొత్త సంప్రదాయాలకు మారడం గురించి’’ అని క్యూరేటర్ ఆడమ్ బాక్ చెప్పారు.

1994లో జెల్లింగ్‌లోని సమాధులు, శిలాఫలకాలు, చర్చి డెన్మార్క్‌లోని తొలి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి.

దగ్గరలోని కాంజెనర్స్ జెల్లింగ్ విజిటర్ సెంటర్‌లో వైకింగ్‌ల పాత నమ్మకాల నుంచి క్రైస్తవ మతానికి జరిగిన మార్పును ఇంటరాక్టివ్ ప్రదర్శనల ద్వారా చూపిస్తారు.

అక్కడ ఉన్న రెండు శిలలను డెన్మార్క్ బాప్తిస్మల్ స్టోన్, డెన్మార్క్ బర్త్ సర్టిఫికెట్ అని అంటుంటారు. వాటిని సంరక్షించడానికి ప్రస్తుతం చుట్టూ అద్దాన్ని ఏర్పాటు చేశారు.

‘బ్లూటూత్’ పేరు ఎలా?

దాదాపు 1,000 ఏళ్ల తర్వాత, వివిధ ప్రాంతాలను ఏకం చేసిన రాజుగా హరాల్డ్‌కు ఉన్న పేరు ఊహించని విధంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది.

1990ల చివర్లో తోషిబా, ఐబీఎం, నోకియా, ఇంటెల్, ఎరిక్సన్‌వంటి కంపెనీలకు చెందిన ఇంజినీర్లు వేర్వేరు కంపెనీలు తయారు చేసిన పరికరాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా చేసే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న సమయమది.

ఆ టెక్నాలజీకి ఒక తాత్కాలిక కోడ్ పేరు అవసరమైంది.

అమెరికాకు చెందిన ఇంటెల్ ఇంజినీర్ జిమ్ కార్డాచ్, స్వీడన్‌కు చెందిన ఇంజినీర్లతో కలిసి ఈ కొత్త టెక్నాలజీపై పనిచేస్తున్నారు. ఒకసారి వారు వైకింగ్‌ల గురించి మాట్లాడుకున్నారు.

దాంతో ఆసక్తి కలిగిన కార్డాచ్.. వైకింగ్‌ల చరిత్ర గురించి ఒక పుస్తకాన్ని చదివారు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు కాంగెర్నెస్ జెల్లింగ్‌లో ప్రదర్శనకు ఉంచారు.

అందులో డెన్మార్క్, నార్వేలను ఏకం చేసిన రాజు హరాల్డ్ బ్లూటూత్ గురించి తెలుసుకున్న ఆయనకు ఆ పేరు మీద చాలా ఆసక్తి కలిగింది.

హరాల్డ్ రెండు దేశాలను ఏకం చేసినట్లే, కొత్త టెక్నాలజీ వివిధ కంపెనీలకు చెందిన పరికరాలను ఒకదానితో ఒకటి కలుపుతుందని కార్డాచ్ భావించారు.

అందుకే ‘బ్లూటూత్’ అనే పేరు ఈ కొత్త టెక్నాలజీకి తాత్కాలిక కోడ్ పేరుగా వచ్చింది.

ఆ పేరును ‘బ్లూటూత్’ అధికారికంగా ప్రకటించకముందే బయటకు లీక్ అయింది. ఆ తర్వాత అదే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

క్యూరేటర్ ఆడమ్ బాక్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

"ఆ పబ్లిక్ రిలేషన్స్ టీమ్‌కు 'బ్లూటూత్' అనే పేరు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వారికి అది పళ్ల పరిశుభ్రత సరిగా లేకపోవడం, పుచ్చిపోయిన పళ్లతో సంబంధం ఉన్న పేరుగా అనిపించింది.

వారు కూడా కొన్ని పేర్లు సూచించారు. కానీ ఆ పేర్లు చాలా బోరింగ్‌గా ఉన్నాయి.

‘బ్లూటూత్’ అనే పేరు చాలా ప్రత్యేకంగా ఉండటంతోనే చివరికి అది అందరి దృష్టిని ఆకర్షించింది.

బ్లూటూత్‌కు ఉన్న ప్రత్యేకమైన లోగో కూడా ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయేలా చేసింది.

ఈ లోగోలో హరాల్డ్ బ్లూటూత్ పేరులోని హెచ్, బీ అక్షరాలకు సంబంధించిన నార్స్ రూన్ గుర్తులను కలిపారు.

2023లో బ్లూటూత్ సాంకేతికతకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిమ్ కార్డాచ్, ఇతర వ్యవస్థాపకులు కాంగెర్నెస్ జెల్లింగ్‌కు వెళ్లారు.

హరాల్డ్ అనుమతి తీసుకోకుండానే ఆయన పేరును ఉపయోగించినందుకు సరదాగా క్షమాపణ చెప్పారు. మ్యూజియం కూడా ఆ క్షమాపణను అంగీకరించి, మరో 1,000 ఏళ్ల పాటు ‘బ్లూటూత్’ పేరును ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

"హరాల్డ్‌కు తన గొప్పతనాన్ని చూపించుకోవడం చాలా ఇష్టం. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రతిరోజూ ఆయన పేరు పలుకుతున్నారని తెలిస్తే, ఆయన చాలా సంతోషించేవాడని అనుకుంటున్నా" అని ఆడమ్ బాక్ సరదాగా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)