జియో: చౌక ఇంటర్నెట్ కాలం ముగియనుందా? మొబైల్ రీచార్జ్‌ ధరలు పెరుగుతాయా

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ముంబయి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

మెటా, గూగుల్ వంటి కంపెనీలు పెట్టుబడిగా పెట్టిన దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం (అక్టోబర్ 28న) స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన ఒక్కో షేరు రూ. 1,358 చొప్పున లిస్ట్ అయ్యింది.

భారత స్టాక్ మార్కెట్ తీవ్రమైన కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ.. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకూ అనూహ్య స్పందన వచ్చింది. రూ.30,400 కోట్ల నిధుల సేకరణతో.. ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద పెట్టుబడిదారులు, దేశంలోని ఆర్థిక సంస్థలు, సాధారణ పెట్టుబడిదారులు ఈ ఐపీఓలో పెద్ద సంఖ్యలో పెట్టుబడుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్ 21న ఈ కంపెనీ ఐపీఓ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే.. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎక్కువ షేర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి.

2016లో టెలికాం రంగంలోకి ప్రవేశించిన జియో

ఆసియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందిన జియో, భారత్‌లో అత్యంత ముఖ్యమైన సంస్థలలో ఒకటి. సుమారు 50 కోట్ల మంది యూజర్లు జియో చౌకైన మొబైల్ ఇంటర్నెట్ సేవను ఉపయోగిస్తున్నారు.

అయితే, జియో వేగవంతమైన విస్తరణ అనేక వివాదాల కారణంగా కూడా వార్తల్లో నిలిచింది.

భారత్‌లో అప్పటికే అత్యంత పోటీ ఉన్న టెలికాం రంగంలోకి 2016లో ప్రవేశించింది జియో. ఆ సమయంలో.. ఆ సంస్థ చాలా తక్కువ ధరలకే మొబైల్ సేవలను అందించింది. దీనివల్ల లక్షల మంది భారతీయులు ఇంటర్నెట్ వాడటం మొదలుపెట్టారు.

అయితే, జియో ప్రవేశం టెలికాం రంగంలో పెద్ద పెను మార్పును తీసుకువచ్చింది. ఒకప్పుడు ఈ రంగంలో 17 కంపెనీలు ఉండగా, వాటి సంఖ్య ఇప్పుడు కేవలం మూడు ప్రధాన కంపెనీలకు తగ్గిపోయింది.

జియో వద్ద భారీగా డబ్బు ఉన్నందున, ఆ సంస్థ చాలా తక్కువ ధరలకే సేవలను అందిస్తూ ధరల యుద్ధాన్ని ప్రారంభించిందని, దీనివల్ల ఇతర కంపెనీలు వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చిందని విమర్శకులు ఆరోపించారు.

ఇటీవల ముకేశ్ అంబానీని ఎలన్ మస్క్ విమర్శించారు. అంబానీయే 'భారత్‌కు అసలైన బాస్' అని ఆయన అన్నారు .

భారత్‌లో స్టార్‌లింక్ సేవలను ప్రారంభించకుండా జియో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని ఎలన్ మస్క్ ఆరోపించారు. అయితే, రిలయన్స్ ఈ ఆరోపణలను ఖండించింది.

అంతేకాకుండా, మస్క్ కంపెనీ నుంచి వచ్చే పోటీని తాము స్వాగతిస్తున్నామని రిలయన్స్ స్పష్టం చేసింది.

గత దశాబ్దంలో జియో అనేక ఆరోపణలు, విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ, జియో చౌకైన ఇంటర్నెట్ సేవలు భారత్‌లో డిజిటల్ విప్లవానికి పెద్ద ఊపునిచ్చాయి. దీనివల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భారీగా విస్తరించింది.

అలాగే, ఆన్‌లైన్ చెల్లింపులు, ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సేవలు సామాన్యులకు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఆసియాలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.

‘భారత్ డిజిటల్ ఇంజిన్'

జియో లాంచ్ అయిన కేవలం 3 సంవత్సరాల తర్వాత, కస్టమర్లు ఇంటర్నెట్ వాడటం 50 రెట్లు పెరిగింది. ఇంటర్నెట్ ధరలు గణనీయంగా తగ్గాయి.

సరసమైన ధరలలో సర్వీసులను అందించాలనే జియో దూకుడు వ్యూహం కారణంగా 2026 నాటికి సుమారు 55.3 కోట్ల మంది మొబైల్ సబ్‌స్క్రయిబర్లు దానిలోకి చేరారు. ఇది ఇతర రంగాలలో కూడా ఈ కంపెనీ ఆధిపత్యాన్ని పెంచింది.

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ మార్కెట్‌లో జియోకు 50 శాతం వాటా ఉండగా, కేబుల్ లేదా ఫైబర్ ద్వారా అందించే బ్రాడ్‌బ్యాండ్ సేవల మార్కెట్‌లో 40 శాతానికి పైగా వాటా ఉంది.

భారత్‌లోని మొత్తం మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో 60 శాతం జియో నెట్‌వర్క్‌దేనని బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ తెలిపింది. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 5జీ సబ్‌స్క్రయిబర్లు కూడా జియోకే ఉన్నారు. అందుకే ఈ కంపెనీని 'భారత్ డిజిటల్ ఇంజిన్'గా కూడా పిలుస్తున్నారు.

అయితే, స్టాక్ మార్కెట్‌లో జియో లిస్ట్ అయిన తర్వాత.. కంపెనీ ధరల విధానంలో భారీ మార్పులు వస్తాయని నిపుణులు చెప్పారు.

ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే.. కంపెనీ ప్రమోటర్లు తమ వాటాను సుమారు 3 శాతం మేర తగ్గించుకోబోతున్నారు.

ఈ తగ్గింపుతో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న అత్యంత చౌకైన మొబైల్ ఇంటర్నెట్ సేవల శకం ముగిసే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు.

"తక్కువ ధరల టారిఫ్‌లతో తన మార్కెట్ వాటాను పెంచుకుంటున్న జియో శకం ముగింపు దశకు వస్తోంది" అని కామయకాయ వెల్త్ మేనేజ్‌మెంట్ సహ వ్యవస్థాపకురాలు నిత్యా షా అన్నారు.

''స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత.. జియో చిన్న పెట్టుబడిదారులకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీనివల్ల, ఇంటర్నెట్ ధరలను తక్కువగా ఉంచాలనే కంపెనీ కోరిక లేదా ఉత్సాహం తగ్గుతుండొచ్చు'' అని చెప్పారు.

మొబైల్ సేవల ధరలు పెంచే అవకాశం

చౌకైన ప్లాన్‌లను అందించడం ద్వారా సబ్‌స్క్రయిబర్ల సంఖ్యను పెంచుకోవడంపై మాత్రమే జియో భవిష్యత్ వృద్ధి ఆధారపడదని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఒక రిపోర్టులో తెలిపింది.

బదులుగా, 'ప్రతి కస్టమర్ నుంచి మరింత ఆదాయాన్ని సంపాదించడం'పై కంపెనీ దృష్టి సారిస్తుందని పేర్కొంది.

''దీనిని సాధించడానికి, జియో వినియోగదారులను 5జీ సేవల వైపు నడిపించడం, ఎప్పటికప్పుడు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచడం, ఫైబర్ ఇంటర్నెట్ ఇంకా చేరని గృహాలకు వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది'' అని తెలిపింది.

జియో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడంతో, ఇతర టెలికాం కంపెనీలకు కూడా మొబైల్ సేవల ధరలను పెంచే అవకాశం లభించవచ్చు. ఎందుకంటే, జియో మనకంటే తక్కువ ధరలకే తన సర్వీసులను అందించి వినియోగదారులను ఆకర్షిస్తుందనే భయం ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది.

''దీని నుంచి వొడాఫోన్-ఐడియా ఎక్కువగా లబ్ది పొందే అవకాశం ఉంది'' అని నిత్యా షా అన్నారు. "ఆర్థికంగా అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు టెలికాం రంగంలోని మార్పుల వల్ల బాగా ప్రయోజనం పొందగలదు" అని ఆయన చెప్పారు.

కొన్నేళ్ల క్రితం, టెలికాం రంగంలోని అన్ని కంపెనీలు మొబైల్ సేవల ధరలను పెంచాయి. ఇప్పుడు, ధరలు మళ్లీ పెరిగితే, అది భారతీయ వినియోగదారులపై ప్రభావం చూపవచ్చు.

ధరలు పెరిగితే వినియోగదారులు మరోసారి తమ కంపెనీని మార్చుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. ముఖ్యంగా, తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలను ఉపయోగించాలనుకునే వినియోగదారులు, అత్యంత చౌకైన ప్లాన్ ఉన్న కంపెనీకి మారవచ్చని అన్నారు.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుగా భారత్‌

మొబైల్ సర్వీస్ బిల్లులు పెరిగే అవకాశం ఉండటంతో, భారత్‌లో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జియో ఐపీఓ పెట్టుబడిదారులకు ఒక అవకాశాన్ని అందిస్తోంది.

ఎంటర్‌టైన్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, గేమింగ్, ఆర్థిక సేవలు వంటి రంగాలలో కూడా జియో తన డిజిటల్ సేవలను విస్తరిస్తోంది. అందువల్ల, ఈ సేవలకు పెరుగుతున్న వినియోగం నుంచి భవిష్యత్తులో కంపెనీ మరింత ఆదాయాన్ని ఆర్జిస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు.

తక్కువ ఇంటర్నెట్ ధరలు, పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ల వాడకం కారణంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుగా భారత్‌ అవతరించింది.

2024లో ప్రతి జియో కస్టమర్ నెలవారీ ఇంటర్నెట్ వినియోగం 28.7 జీబీగా ఉండగా, అది 2026 నాటికి 42.3 జీబీకి పెరిగింది. అంటే, రెండేళ్లలో ఇంటర్నెట్ వినియోగంలో ఏకంగా 52 శాతం పెరుగుదల నమోదైంది.

ప్రజల వద్ద డిస్పోజబుల్ ఇన్‌కమ్ (ఆదాయపు పన్నులు, ఇతర తప్పనిసరి ప్రభుత్వ చార్జీలు చెల్లించిన తర్వాత ప్రజల వద్దనుండే మొత్తం డబ్బు) పెరగడంతో, 2030 నాటికి ఒక్కో వినియోగదారుడి నెలవారీ ఇంటర్నెట్ వినియోగం 65 జీబీకి చేరుకునే అవకాశం ఉందని కొందరు అంచనావేస్తున్నారు.

ఇవన్నీ దీర్ఘకాలంలో ప్రతి కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడానికి జియోకు సహాయపడతాయి.

"చైనా, అమెరికాతో పోలిస్తే భారత్‌లో డిజిటల్ సేవల వినియోగం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. అందువల్ల, భారత్‌లో ఈ సేవల వినియోగం పెరిగి, భారీ వ్యాపార అవకాశాన్ని సృష్టించే అవకాశం ఉంది" అని ఎంకే గ్లోబల్ తెలిపింది.

స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కావడంతో జియో కార్యకలాపాలకు మరింత పారదర్శకత వస్తుందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. అలాగే, కంపెనీ 'మార్కెట్ విలువ'పై పెట్టుబడిదారులకు స్పష్టమైన అవగాహన లభిస్తుందని చెప్పింది.

జియో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగంగా ఉంది. రిలయన్స్ ఆయిల్ రిఫైనింగ్ నుంచి రిటైల్ వరకు అనేక వ్యాపారాలలో నిమగ్నమై ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థలో జియో పోషిస్తున్న కీలక పాత్ర, దాని పెరుగుతున్న వ్యాపారం పట్ల పెట్టుబడిదారులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే, ఈ ఐపీఓకు సంబంధించి మరో ప్రత్యేక విషయం ఏమిటంటే.. 20 ఏళ్లకు పైగా కాలంలో రిలయన్స్ గ్రూప్ షేర్లను విక్రయించడం ఇదే మొదటిసారి.

రిలయన్స్ 1958లో సుగంధ ద్రవ్యాలు, పాలిస్టర్ నూలుతో ఒక చిన్న వ్యాపారంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ సంస్థ వస్త్ర పరిశ్రమ, పెట్రోకెమికల్స్, చమురు శుద్ధి, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ సేవలు వంటి రంగాలకు విస్తరించింది.

దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మంచి రిటర్నులను అందించే కంపెనీగా రిలయన్స్‌కు పేరుంది. అందుకే, చిన్న సాధారణ పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.

రిలయన్స్ సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ. 1980, 90ల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులను పాపులరైజ్ చేయడంలో ధీరూభాయ్ అంబానీ కీలక పాత్ర పోషించారు. కేవలం కొద్దిమంది వ్యాపారవేత్తలు, సంపన్న కుటుంబాలకు చేతుల్లోనే కాకుండా.. ప్రజలకు స్టాక్ మార్కెట్‌ పెట్టుబడులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తొలినాళ్లలో, రిలయన్స్ తన వార్షిక సర్వసభ్య సమావేశాలను గ్రాండ్ ఈవెంట్లుగా నిర్వహించేది. ఈ సమావేశాలలో కంపెనీకి సంబంధించిన ముఖ్య ప్రకటనలు, డివిడెండ్లు, ప్రజలు కంపెనీ షేర్లను కొనుగోలు చేయడాన్ని వేడుకగా జరుపుకోవడం వంటివి ఉండేవి.

దీనివల్ల, రిలయన్స్‌లో చాలా మంది చిన్న పెట్టుబడిదారులు ఇనెస్ట్ చేశారు. కాలక్రమేణా, కంపెనీపై ఈ పెట్టుబడిదారుల నమ్మకం మరింత బలపడింది. వారిలో చాలామంది రిలయన్స్‌తో ఒక భావోద్వేగ బంధాన్ని కూడా ఏర్పరచుకున్నారు.

గత ఏడాది కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 20 శాతం పడ్డాయి. అయినప్పటికీ, దాని దీర్ఘకాలిక పనితీరు వల్ల పెట్టుబడిదారులకు కంపెనీపై ఇంకా నమ్మకం ఉంది.

"గత 30 ఏళ్లుగా ఈ కంపెనీ ప్రతి ఏటా సగటున 30 శాతం రిటర్నులను ఇచ్చింది" అని ముంబయిలోని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌కు చెందిన క్రాంతి బతిని బీబీసీకి తెలిపారు.

అందువల్ల, జియో ఐపీఓ కూడా అదే విధమైన రాబడులను అందిస్తుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)