దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

బస్తర్, దసరా వేడుకలు
ఫొటో క్యాప్షన్, బస్తర్‌లో 76 రోజుల పాటు సాగే దసరా వేడుకలు
    • రచయిత, అలోక్ పుతుల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

దసరా సందర్భంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో రావణ దహనాలు జరుగుతుంటే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో మాత్రం చెక్క రథం కదులుతూ కనిపిస్తుంది. అక్కడ రామ్‌లీలా లేదు, రావణ వధ లేదు. విల్లు-బాణాలు కనిపించవు.

బస్తర్‌లో దసరా అంటే శ్రీరాముడి గురించి కాదు. ఇది తమ ఆరాధ్య దైవమైన దంతేశ్వరీ దేవీ విజయగాథకు ప్రతీకగా జరుపుకుంటారు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా 76 రోజులపాటు చేసుకునే పండగ ఇది.

ఈ పండగలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి సామాజిక వర్గానికి దసరాలో ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. ఒక గ్రామానికి చెందిన వారు రథం తయారు చేస్తారు, మరో పల్లెవాసులు తాడును అల్లుతారు. రథాన్ని లాగేవారు ఇంకొక ఊరుకు చెందినవారై ఉంటారు. 9 రోజుల పాటు గుంతలో కూర్చొని వేడుక సజావుగా సాగాలని ప్రార్థించే జోగీలు మరో గ్రామవాసులు.

రథానికి కావాల్సిన చెక్క, తాడు తయారు చేసే కళాకారులు కూడా వేర్వేరు గ్రామాలకు చెందినవారై ఉంటారు. అయితే విజయ రథాన్ని లాగే హక్కు మాత్రం కిలేపాల్ పరణాకు చెందిన మాడియా గిరిజనులకే ఉంటుంది.

"బస్తర్‌లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఈ దసరా వేడుకలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకత. ఎవరు ఏం చేయాలనేది ముందే నిర్ణయిస్తారు. ఈ దసరా సంబరాలు చూసేందుకు వచ్చే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. బొమ్మలను దహనం చేసే సంస్కృతి ఇక్కడ లేదు" అని బస్తర్ ఎంపీ, బస్తర్ దసరా కమిటీ అధ్యక్షుడు మహేశ్ క్యశ్యప్ చెప్పారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

'600 ఏళ్ల నాటి సంప్రదాయం'

చాళుక్య వంశానికి చెందిన పురుషోత్తమ్ దేవ్ 600 ఏళ్ల నాటి క్రితం కాలినడకన పూరీ జగన్నాథ్ వరకు యాత్ర చేపట్టారని బస్తర్ ప్రజల విశ్వాసం. ఆయనకు తోడుగా మురియా, భత్రా, గోండ్, ధాకడ్, మహారా వంటి తెగల నాయకులు కూడా నడిచారని చెప్పుకుంటారు.

అలా వెళ్లిన ఆయనకు పూరీ రాజు 16 చక్రాల రథాన్ని బహుకరించారని ఇక్కడి వారు చెబుతుంటారు. రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ రథ చక్రాలను రాజు పంచేశారని విశ్వసిస్తున్నారు. నాలుగు చక్రాలను జగన్నాథ స్వామికి, 12 చక్రాలను దంతేశ్వరి దేవికి కేటాయించారని అంటున్నారు. అప్పటి నుంచి దసరా రోజున దేవికి సంబంధించిన గొడుగును రథంలో ఉంచి ఊరేగిస్తున్నారని వివరిస్తున్నారు.

హరేలీ అమావాస్య రోజున ఒక పెద్ద చెక్క దుంగను అడవి నుంచి సేకరించి జగదల్‌పూర్‌లోని దంతేశ్వరి ఆలయం ముందు ఉంచుతారు. దీన్ని 'థుర్లు ఖోట్లా' అంటారు. రథాన్ని తయారు చేసిన పనిముట్లతోపాటు దీనికి కూడా పూజలు చేస్తారు. ఈ 'పాత్ జాతర్' అనేది దసరా వేడుకల్లో మొదటి అడుగు.

బస్తర్, దసరా వేడుకలు,
ఫొటో క్యాప్షన్, బస్తర్ దసరా వేడుకల్లో ప్రతి సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది.

కలెక్టర్ కావాలని ఆ బాలిక కోరిక

దీని తర్వాత రథం తయారీ మొదలవుతుంది. జారుమార్గావ్, బెదౌమార్గావ్ గ్రామాలకు చెందిన కళాకారులు ఉలి, గొడ్డలి వంటి సాంప్రదాయ పనిముట్లు ఉపయోగించి, సుమారు పది రోజుల్లో 40 అడుగుల ఎత్తైన రథాన్ని నిర్మిస్తారు. ఇందులో యంత్రాల ప్రమేయం అస్సలు ఉండదు. రథంలోని వివిధ భాగాలకు అవసరమైన కలపను సేకరించే బాధ్యతను తరతరాలుగా వేర్వేరు గ్రామాలు నిర్వహిస్తున్నాయి. రథాన్ని లాగడానికి ఉపయోగించే తాళ్లను చెట్ల బెరడుతో తయారు చేస్తారు. వీటిని పోతనార్ ప్రాంతానికి చెందిన గ్రామస్తులు తీసుకువస్తారు.

బస్తర్ దసరాలో అత్యంత ఆసక్తికరమైన ఘటన పితృమోక్ష అమావాస్య రోజున సాయంత్రం జరుగుతుందని చెబుతున్నారు. బంగారం చౌక్‌లోని కాచింగుడిలో పాంకా కులానికి చెందిన బాలికపై కాచిన్‌దేవి ఆవహిస్తుందని ఇక్కడి విశ్వాసం. ఆ బాలిక ఊయలపై కూర్చొని దసరా వేడుకలు చేసేందుకు అనుమతి ఇస్తుందని అంటారు.

పండుగను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిన 'కాచిన్ దేవి', మిర్గాన్, చందర్, టిక్రా వంటి గిరిజన తెగల కుల దేవత.

ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల పిహూ, గత ఐదేళ్లుగా కాచిన్ దేవి ప్రతినిధిగా ఉంటోంది. ఆ బాలిక బాగా చదివి పెద్దయ్యాక కలెక్టర్ కావాలని కోరుకుంటోంది.

"కాచిన్ దేవిగా మారిన తర్వాత నేను పిహూ కాదనిపిస్తుంది. ఒక దేవతలాగానే ప్రజలకు దర్శనమిస్తాను. నన్ను చూడటానికి చాలా మంది వస్తుంటారు. ఇతర ప్రాంతాలకు చెందిన దేవుళ్లను, దేవతలను నా వద్దకు తీసుకొస్తుంటారు" అని పిహూ చెబుతోంది.

బస్తర్‌ దసరా వేడుకల్లో ప్రతిరోజూ సంప్రదాయ కార్యక్రమాలు చూసేందుకు భారీ సంఖ్యలో గిరిజనులు వస్తూ ఉంటారు.

బస్తర్, దసరా వేడుకలు,
ఫొటో క్యాప్షన్, బస్తర్ దసరాలో ఉత్కంఠభరితమైన దృశ్యం పిత్రిమోక్ష అమావాస్య సాయంత్రం కనిపిస్తుంది.

ఆశ్వయుజ శుక్ల ద్వితీయ నుంచి సప్తమి వరకు, పూలతో అలంకరించిన రథాన్ని ప్రతిరోజూ గ్రామస్థులంతా లాగుతూ ఊరేగిస్తారు. రథంపై కొలువై ఉన్న దంతేశ్వరి దేవికి పోలీసులు గార్డ్ ఆఫ్ హానర్ సమర్పిస్తారు. దృష్టి దోషం తగలకుండా దిష్టి తీసి, రథంపై మహిళలు పూలను చల్లుతారు.

అష్టమి అర్ధరాత్రి వేళ "నిశా యాత్ర" అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో, దంతేశ్వరి ఆలయం నుంచి అమ్మవారి పల్లకీ బయలుదేరి, ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరిగే 'నిశా యాత్ర' ఆలయానికి చేరుకుంటుంది.

ఇక్కడ బలి ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ పూజా ద్రవ్యాలను సాంప్రదాయబద్ధంగా రాజపురోహితుల కుటుంబం వారు సిద్ధం చేస్తారు.

విజయదశమి రోజున, ఎనిమిది చక్రాల 'విజయ రథం' ఊరేగింపు ముగిసిన తర్వాత, ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి వేళ ఆ రథాన్ని కుంభదాకోట్ అడవిలో దాచిపెడతారు. ఈ ఆచారాన్ని 'భీతర్ రైనీ' అని పిలుస్తారు.

ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి వివిధ ప్రాంతాల నుంచి 3,000కు పైగా దేవతామూర్తులను కుంభదాకోట్‌కు తీసుకువస్తారు. మరుసటి రోజు, రాజవంశ ప్రతినిధులు ప్రజలతో కలిసి కొత్త ధాన్యాలను సమర్పించి 'నవఖాని' వేడుకను జరుపుకుంటారు. ఆ తర్వాత రథం తిరిగి తీసుకొస్తారు.

బస్తర్, దసరా వేడుకలు,
ఫొటో క్యాప్షన్, ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజు నుంచి సప్తమి తిథి వరకు, ప్రతిరోజూ పూలతో అలంకరించిన రథాన్ని ఊరేగిస్తారు.

సమస్యలు పరిష్కరించే మురియా దర్బార్

దసరా పండుగ ముగింపులో 'మురియా దర్బార్' జరుగుతుంది. పురాతన పత్రాల ప్రకారం, ఈ మురియా దర్బార్ 1876 మార్చి 8న ప్రారంభమైంది. సంస్థానాల కాలంలో, గిరిజనుల సాంప్రదాయ పరిపాలనా వ్యవస్థకు చెందిన మంఝీ, ముఖియా, చల్కీ, నాయక్ వంటి ప్రతినిధులు, తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను నేరుగా రాజు ముందు ఉంచేవారని చెబుతున్నారు.

ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాజుకు బదులుగా ప్రజాప్రతినిధులు, పరిపాలనా అధికారులు ఒకరికొకరు ఎదురుగా కూర్చుంటారు.

మురియా దర్బార్ ముగిసిన తర్వాత, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దేవతలకు గౌరవపూర్వక వీడ్కోలు పలుకుతారు. దంతేవాడ నుంచి తీసుకువచ్చిన మావల్లి మాత పల్లకీ, దంతేశ్వరి దేవి గొడుగులు గార్డ్ ఆఫ్ హానర్ మధ్య ఊరేగింపుగా తిరిగి వెళ్తాయి.

ఇలా 76 రోజులు సాగే దసరా ముగుస్తుంది. రథం తిరిగి వెళ్తుంది, దేవత తన నివాసానికి చేరుకుంటుంది, దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ గ్రామాలకు బయలుదేరుతారు. వచ్చే ఏడాది మళ్లీ వేలాది చేతులు మళ్ళీ ఏకమవుతాయి. అప్పటికి పిహు పై తరగతికి వెళ్ళవచ్చు, కానీ ఆమె మళ్ళీ 'కాచిన్ దేవి'గా మారినప్పుడు, బహుశా అప్పుడు కూడా "నేను ఇక పిహుని కాను" అని ఆమె మళ్ళీ అంటుందేమో!

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)