ఇరాన్: అలీ ఖమేనీ వీలునామా అమెరికా దాడిలో ధ్వంసమైపోయిందా? ఇంతకీ అందులో ఏం రాశారు

ఫొటో సోర్స్, Iranian Leader's Press Office - Handout/Anadolu Agency/Getty Images
- రచయిత, హుస్సేన్ బస్తానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్ సుప్రీం లీడర్‌గా పనిచేసిన అలీ ఖమేనీ మరణించి ఏడు నెలలు గడిచినా, ఆయన రాజకీయ వీలునామా ఏంటన్నది ఇంకా బయటికి రాలేదు.
ఈ సమయంలో.. 1963 ఏప్రిల్‌లో రాసిన ఆయన పాత వ్యక్తిగత వీలునామాల్లో ఒకే ఒక్కటి విడుదలైంది.
అలీ ఖమేనీ వీలునామాను విడుదల ఆలస్యం చేయడమే కాకుండా.. ఆయన వారసుడి స్వరాన్ని కానీ, చిత్రాన్ని కానీ ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు.
ఈ రెండు కేసుల్లోనూ.. ప్రభుత్వ అత్యున్నత స్థాయిల్లో సమాచారం రహస్యంగానే ఉంది.

'వీలునామా ధ్వంసం అయి ఉండొచ్చు'
పలు సందర్భాల్లో ఈ వీలునామాకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వ వర్గాలు ప్రయత్నించాయి. కానీ, వారి సమాధానాలు విషయాన్ని స్పష్టం చేయకపోగా మరింత సంక్లిష్టం చేశాయి.
వీలునామాకు సంబంధించి అధికారిక వర్గాల నుంచి వచ్చిన ఒక సమాచారం ఏంటంటే.. సుప్రీం నేత నివాసంపై జరిగిన బాంబు దాడిలో ఆ డాక్యుమెంట్ ధ్వంసమై ఉండవచ్చు.
ఉదాహరణకు.. సుప్రీం లీడర్‌కు అనుబంధంగా ఉన్న ఒక సంస్థ పర్యవేక్షణలో ప్రచురితమయ్యే వార్తా పత్రిక 'ఎత్తెలాత్' కథనం ప్రకారం.. వీలునామా శిథిలాల కింద సమాధి అయి ఉండొచ్చని తెలిసింది.
ఇదే సమయంలో తెహ్రాన్ మేయర్ అలీరెజా జకానీ మాట్లాడుతూ.. అలీ ఖమేనీ రాతపూర్వక పత్రాలు, ఆయన వ్యక్తిగత గ్రంథాలయం ధ్వంసమయ్యాయని చెప్పారు.
దీనిలో, వీలునామా కూడా ధ్వంసమై ఉండవచ్చని తెలుస్తోంది.
ఒకవేళ వీరు చెబుతున్నవి నిజమని భావిస్తే.. దేశ సుప్రీం నేత తన రాజకీయ వీలునామా లాంటి ముఖ్యమైన పత్రాన్ని ఆయన వ్యక్తిగత లైబ్రరీ వంటి దానిలో ఎక్కడో ఒక దగ్గర పెట్టి ఉంటారని అనుకోవచ్చు.
కానీ, అలా జరగడం కష్టం.
గతంలో రూహోల్లా ఖుమేనీ రాజకీయ వీలునామాకు సంబంధించిన రెండు వేర్వేరు కాపీలను సీలు వేసి భద్రపరిచారు. ఒకటి ఆస్తానా-ఎ-ఖుద్స్ వద్ద, మరొకటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ (నిపుణుల సభ) వద్ద పెట్టారు.

ఫొటో సోర్స్, ATTA KENARE / AFP via Getty Images
ఖుమేనీ రాజకీయ సంకల్పం నెరవేరిందా?
అలీ ఖమేనీ వీలునామాపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. కానీ, అంతమాత్రాన ఆ వీలునామా వెల్లడి అవుతుందని, ఇరాన్లో అధికారంలో పెద్ద మార్పులు వస్తాయని అర్థం కాదు.
వీలునామా నిజమైన ప్రభావం, అందులో రాసిన విషయాలను అధికారంలో ఉన్నవారు ఎలా వ్యాఖ్యానిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రూహోల్లా ఖుమేనీ 1989 జూన్‌లో మరణించారు. ఆ తర్వాత వెంటనే.. ప్రభుత్వ అధికారులు ఆయనకు నివాళులర్పించారు.
కానీ, అదే సమయంలో.. ఖుమేనీ వీలునామాలోని అత్యంత స్పష్టమైన కొన్ని సూచనలను పట్టించుకోలేదు.
ఖుమేనీ రాసిన సుదీర్ఘమైన వీలునామాలో ఇరాన్, ప్రపంచ పరిస్థితులకు సంబంధించిన అనేక విషయాలు, ప్రాచీన చరిత్ర, మతపరమైన అంశాలు ఉన్నాయి.
దీంతో పాటు, ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన కొన్ని స్పష్టమైన సూచనలు కూడా ఉన్నాయి.
అత్యంత ముఖ్యమైన సూచనల్లో ఒకటి.. సైన్యం, పోలీసులు, రివల్యూషనరీ గార్డ్స్, బసిజ్, ఇతర సాయుధ సంస్థలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
కానీ, ఆయన వారసుల కాలంలో దీనికి భిన్నంగా జరిగింది. రివల్యూషనరీ గార్డ్స్, ముఖ్యంగా బసిజ్లు ఇరాన్లో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాజకీయ సంస్థలుగా మారాయి.
ఈ సంస్థలు ఇరాన్ రాజకీయ, ఎన్నికల పోటీలలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి.
వీలునామాలో ఇంకేం చెప్పారు?
తన మరణానంతరం తన పేరు మీద చెప్పే విషయాలను ఎలా పరిగణించాలనే దానిపై రూహొల్లా ఖుమేనీ తన వీలునామాలో ఒక ముఖ్యమైన సూచన చేశారు.
నిజానికి, దీన్ని ఆయన వీలునామాలోని అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణించవచ్చు.
"నా పేరు మీద చెప్పే ఏ విషయాన్ని అయినా.. అది నా స్వరంలో ఉన్నా, నా చేతిరాతతో, సంతకంతో ఉన్నా, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులచే ధ్రువీకరించకపోతే దాన్ని ప్రామాణికంగా పరిగణించవద్దు. అయితే, నేను ఇస్లామిక్ రిపబ్లిక్ టెలివిజన్‌లో ఏదైనా చెప్పినట్లయితే, దాన్ని ప్రామాణికంగా పరిగణించవచ్చు" అని రూహొల్లా ఖుమేనీ రాశారు.
అయినప్పటికీ.. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌లో ఆయన వీలునామా చదివిన కొన్ని గంటల తర్వాతనే అక్బర్ హషేమీ రఫ్సాంజానీ ఒక వాదనను ముందుకు తెచ్చారు.
అలీ ఖమేనీ తన వారసుడిగా మంచి ఎంపిక అని తనకు, అహ్మద్ ఖుమేనీకి మాజీ సుప్రీం నేత ప్రైవేట్‌గా చెప్పారని తెలిపారు.
ఈ వివాదాస్పదమైన ప్రకటన ఆధారంగానే కొత్త సర్వోన్నత నేతను ఎన్నుకున్నట్లు ఈ మీటింగ్ గురించి ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన వివరణాత్మక నివేదికలు, అక్కడ వ్యతిరేక రాజకీయ వర్గాల వ్యక్తుల ప్రకటనలు సూచించాయి.
రుహోల్లా ఖుమేనీ వీలునామాలో రాసిన విషయాలనే పట్టించుకోకపోతే, ఇక దాన్ని చదివి వినిపించడంలో అర్థం ఏమిటనే ప్రశ్నను ఆ సమావేశంలో ఉన్న ఎవరూ అడగలేదు.

ఫొటో సోర్స్, Iranian Leader Press Office/Anadolu via Getty Images
లెనిన్ నుంచి మావో వరకు..
తమ జీవితాంతం అధికారంలో ఉండే నాయకులకు, ప్రభుత్వానికి సంబంధించి వారి వీలునామా అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి.
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. అలాంటి నాయకులు కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఆ తర్వాత పదవిని విడిచిపెట్టే అధ్యక్షుల కన్నా భిన్నంగా ఉంటారు.
ఈ నేతలు బతికున్నంత కాలం.. సున్నితమైన విషయాల్లో వారు నిర్ణయాలు తీసుకోవడాన్ని కొనసాగిస్తారు.
అందుకే, ఈ నాయకుల వీలునామాను ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలా లేదా వచ్చే తరాల కోసం రహస్యంగా ఉంచాలా అనే దానిపై అధికార పార్టీలోని ప్రతిపక్ష వర్గాలు నిర్ణయం తీసుకోవడం అత్యంత కీలకంగా మారుతుంది.
ఈ వర్గాలకు దీనితో ముడిపడి ఉన్న తమ సొంత ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి.
దీనికి సంబంధించిన ప్రసిద్ధ చారిత్రక ఉదాహరణ 1917 రష్యన్ విప్లవ నాయకుడు వ్లాదిమిర్ లెనిన్ వీలునామా.
వాస్తవానికి, ఇది సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్‌కు రాసిన లేఖ.
ఇది పార్టీలోని అగ్రనేతల లోపాలను విమర్శించడమే కాకుండా, జోసెఫ్ స్టాలిన్ చేతుల్లో అధికారం కేంద్రీకృతం కావడం పట్ల స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది.
లెనిన్ మరణం తర్వాత, ఈ లేఖను పార్టీకి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల సమక్షంలో మాత్రమే చదివి వినిపించారు.
స్టాలిన్ తన పార్టీ సహచరుల సహాయంతో, ఈ విషయం బహిర్గతం కాకుండా అడ్డుకున్నారు.
అయితే, 1926లో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక ఈ వీలునామాకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టింది.
కానీ, సోవియట్ యూనియన్‌లో, లెనిన్ మరణించిన 32 ఏళ్ల తర్వాత, అంటే 1956లో ఇది ప్రజల కోసం బయటికి ప్రచురించారు.
చైనాలో కూడా, 1976లో మావో మరణం తర్వాత, ఆయన ఆదేశాలు పరోక్షంగా అధికార అంశంతో ముడిపడిపోయాయి.
చైనా విప్లవ నేత మావో ఎలాంటి రాజకీయ వీలునామాను రాయలేదు.
ఆయన మరణానికి 20 ఏళ్ల ముందు.. కమ్యూనిస్ట్ పార్టీలోని ఇతర శక్తిమంతమైన పలువురు నేతలతో పాటు ఒక డాక్యుమెంట్‌పై సంతకం పెట్టారు.
పార్టీ నాయకుల మృతదేహాలను దహనం చేయాలని, వారి జ్ఞాపకార్థం ఎటువంటి సమాధులు నిర్మించకూడదని ఈ పత్రంలో పేర్కొన్నారు.
ఒకవేళ ఇది బయటికి వస్తే, ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారా?
కమ్యూనిస్టు పాలనకు ముందు ఉన్న మతపరమైన అంత్యక్రియల సంప్రదాయాలను, అలాగే మరణించిన వారిని అతిగా ఆరాధించే పద్ధతులను నిరసించడమే దీని ఉద్దేశమని భావిస్తారు.
అయితే, మావో వారసుడైన హువా గువోఫెంగ్, ఆయన సహచరులు దీన్ని బహిర్గతం చేయలేదు.
పార్టీలో తన ప్రత్యర్థుల ముందు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి, తన పాలనను సమర్థించుకోగల అంశాలు ఆయనకు అవసరమయ్యాయి.
ఆయన మావో కోసం ఒక భారీ సమాధిని నిర్మించి, ఆయన మృతదేహాన్ని మమ్మీలా భద్రపరిచారు. ఇది పూర్వపు చైనీస్ చక్రవర్తుల సంప్రదాయాలకు భిన్నమైన పద్ధతి.
నాలుగు సంవత్సరాల తర్వాత, చైనా తదుపరి నాయకుడైన డెంగ్ జియావోపింగ్ ఒక ఇంటర్వ్యూలో మావో జెడాంగ్ ఇచ్చిన సూచనల గురించి, ఆయన మరణం తర్వాత తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ అనివార్యతల గురించి మాట్లాడారు.
అయితే, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో ప్రస్తుత పరిస్థితి, 1976 నాటి చైనా లేదా 1924 నాటి సోవియట్ యూనియన్‌లోని పరిస్థితుల కంటే అనేక కోణాలలో భిన్నమైంది.
అలీ ఖమేనీ వీలునామా ఎప్పుడు బయటపడుతుందో అంచనా వేయడం సాధ్యం కాదు.
ఒకవేళ భవిష్యత్తులో ఈ పేరుతో ఏదైనా పత్రం బయటపడినా, అది అసలైనదేనని అందరూ అంగీకరిస్తారనే గ్యారెంటీ లేదు.
అయితే, ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ, అలీ ఖమేనీ తన రాజకీయ వీలునామాకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్‌ను సిద్ధం చేయలేదని నమ్మడం చాలా కష్టం.
అలీ ఖమేనీ నివాసంపై జరిగిన బాంబు దాడిలో వీలునామా ధ్వంసమైపోవడం వల్లే అది ఇప్పటివరకు బయటపడలేదనేది మరింత నమ్మశక్యం కాని విషయం.
మొత్తం మీద, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న ఇలాంటి ఇతర సంఘటనల మాదిరిగానే ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అంటే, కొత్త సర్వోన్నత నాయకుడు లేదా ఆయన బృందం, ఏదో ఒక కారణంతో మాజీ నాయకుడి వీలునామాను ప్రస్తుతానికి బహిర్గతం చేయకపోవడమే తమకు ప్రయోజనకరమని భావించి ఉండవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































