నేపాల్: వరద వస్తుందని తెలిసి 900మంది విద్యార్థుల్ని స్కూల్ నుంచి ఖాళీ చేయించిన హెడ్ మాస్టర్

రాజేంద్ర దవాడి, స్కూల్ హెడ్ మాస్టర్, నేపాల్ వరదలు, త్రిశూలీ బజార్
ఫొటో క్యాప్షన్, రాజేంద్ర దవాడి, స్కూల్ హెడ్ మాస్టర్
    • రచయిత, అశోక్ దహల్, కమల్ పరియార్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

వరద ముంచెత్తడానికి 10 నిముషాల ముందు 900 మంది విద్యార్థులను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడిన తీరును హెడ్ మాస్టర్ రాజేంద్ర దవాడీ బీబీసీకి వివరించారు.

నువాకోట్‌లోని త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్‌లో రాజేంద్ర దవాడి హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 09:10 గంటలకు తనకు విపత్తు గురించి హెచ్చరిస్తూ నాలుగు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన బీబీసీకి చెప్పారు. ఈ భయంకరమైన వరదల్లో ఇప్పటి వరకు 794 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,500 మంది ఆచూకీ దొరక్కుండా పోయారు.

వరద గురించిన కాల్స్ రాగానే రాజేంద్ర దవాడీ తక్షణమే పాఠశాలను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. పిల్లలను ఎత్తైన ప్రాంతాలకు పరిగెత్తమని చెప్పారు.

విద్యార్థులతో నిండి ఉన్న బస్సులను వెనక్కి తిప్పి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"ఆ సమయంలో త్వరగా నిర్ణయం తీసుకోకున్నా, ఒకవేళ 10 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులతో సహా మేమెవరమూ ఈ రోజు మీతో మాట్లాడటానికి బతికి ఉండేవాళ్లం కాదు" అని ఆయన అన్నారు.

నిమిషాల వ్యవధిలో నలుగురు వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికలు రాబోయే ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి ఆయనకు సాయపడ్డాయి.

"ఒక విద్యార్థి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి 'పెద్ద వరద వస్తోంది. నా కూతురిని తీసుకెళ్లడానికి వచ్చాను. నేను మా అమ్మాయిని తీసుకుపోతాను' అని నాతో చెప్పారు" అని రాజేంద్ర దవాడి గుర్తు చేసుకున్నారు.

"తల్లిదండ్రులు బలమైన కారణం లేకుండా అంతలా కంగారుపడరు. కాబట్టి విద్యార్థులను ఖాళీ చేయించడానికి ఒక్క సెకను కూడా వేస్ట్ చేయకూడదని అనుకున్నాను. ఒకవేళ వరద రాకపోయినా విద్యార్థులు ఒక రోజు క్లాసులు నష్టపోతారు. అంతే కదా అనుకున్నా" అని ఆయన చెప్పారు.

"ఇంతమంది ప్రాణాలను కాపాడినందుకు నాకు చాలా గర్వంగా ఉంది" అని రాజేంద్ర దవాడి అన్నారు.

వరద తర్వాత త్రిభువన్‌లోని త్రిశూలి స్కూల్‌ భవనం బురద, శిథిలాల కింద పూడిపోయింది.

నదికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న హాస్టల్ భవనాన్ని వేగంగా వచ్చిన వరద నీరు క్షణాల్లో ముంచేసిందని దవాడి చెప్పారు.

మొదట్లో చాలామంది విద్యార్థులకు పరిస్థితి తీవ్రత అర్థం కాలేదు.

రాజేంద్ర దవాడి, స్కూల్ హెడ్ మాస్టర్, నేపాల్ వరదలు, త్రిశూలీ బజార్

ఫొటో సోర్స్, Rajendra dawadi

వరద స్కూలు భవనాన్ని తాకడానికి కొద్ది క్షణాల ముందే తాను తన స్నేహితులు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు 16 ఏళ్ల విద్యార్థిని యునిషా అమాత్య చెప్పారు.

"నేను, నా స్నేహితులు కేవలం 10 సెకన్ల తేడాతో ప్రాణాలతో బయటపడ్డాం" అని ఆమె బీబీసీతో అన్నారు.

"వరద రావడానికి ముందు మేం క్లాసులో చదువుకుంటున్నాం. ఉపాధ్యాయులంతా ఒకే చోట గుమిగూడారు. మొదట వారికి ఏం జరిగిందో తెలియలేదు. ఐదు నిమిషాల తర్వాత టీచర్లు వచ్చి మాకు వరద గురించి చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపొమ్మన్నారు" అని యునిషా చెప్పారు.

ఈ విపత్తు గురించి విన్న తర్వాత ఒక విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడని చాలా మంది మొదట ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేసి మ్యాథ్స్ క్లాసులో ఉన్న తమ సహచరుల కోసం ఎదురుచూశారని ఆమె బీబీసీతో అన్నారు.

యునిషా, ఆమె స్నేహితులు పాఠశాల వెనుక ఉన్న ఒక చిన్న దారి గుండా కొండపైకి పరిగెత్తారు.

"నేను వేగంగా నడవలేకపోయాను. పైకి ఎక్కడానికి నా స్నేహితులు సాయం చేశారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రయత్నించాం. స్కూల్ వెనుక వైపున్న ఇరుకైన నిచ్చెన ద్వారా తప్పించుకున్నాం. నా కళ్ల ముందే త్రిశూలి బజార్ మార్కెట్ వరదలో కొట్టుకుపోయింది" అని ఆమె ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు.

"నా షూస్‌కి గ్రిప్ లేకపోతే నేను కింద పడిపోయేదాన్ని. తప్పించుకునే క్రమంలో విద్యార్థులు, మిగతా జనం సురక్షిత ప్రాంతానికి చేరుకోవడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ వెళ్లారు. వేరే దారిలో వెళ్లాలని చూసిన ప్రజలు వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలిసింది" అని యునిషా అన్నారు.

రాజేంద్ర దవాడి, స్కూల్ హెడ్ మాస్టర్, నేపాల్ వరదలు, త్రిశూలీ బజార్
ఫొటో క్యాప్షన్, యునిషా క్షేమం గురించి ఆమె కుటుంబం ఆందోళన చెందింది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు మొదట కొండపైకి కొన్ని వందల మీటర్ల దూరం వెళ్లి ఆ తర్వాత పొరుగు గ్రామానికి చేరుకున్నారు.

రోడ్లు తెగిపోయి రవాణా ఆగిపోవడంతో రెస్క్యూ టీమ్‌లు వచ్చే వరకు చాలామంది రెండు రాత్రులు అక్కడే చిక్కుకుపోయారు.

నదికి అవతలి వైపు నివసించే ప్రిన్సిపాల్, యునిషాలను ఎట్టకేలకు హెలికాప్టర్ ద్వారా వారి గ్రామానికి చేర్చారు.

మరోవైపు తమ పిల్లలను ఏమయ్యారో తెలియని తల్లిదండ్రులు, పిల్లల బంధువులు ఆందోళన చెందారు. తన కూతురికి, భర్తకు పదే పదే ఫోన్ చేయడానికి ప్రయత్నించానని కానీ ఇద్దరి ఫోన్లు కలవలేదని యునిషా తల్లి సబినా కుమారి శ్రేష్ఠ చెప్పారు.

ఆమె భర్త యువరాజ్ అమాత్య వెంటనే పాఠశాల వైపు పరుగులు తీశారు.

"వరద వార్త తెలియగానే నా కూతురికి ఫోన్ చేశాను. కానీ కాల్ కలవలేదు. దాంతో నాకు చాలా భయం వేసింది" అని ఆయన చెప్పారు.

"కొన్ని నిమిషాల్లోనే నేను నా కూతురు చదువుకునే స్కూల్ వైపు వెళ్లాను. అప్పటికే త్రిశూలి బజార్ మొత్తం వరదలో కొట్టుకుపోయింది. నా కూతురు ఇకలేదు అనుకున్నా. నా స్కూటర్ ఆపేశా. అక్కడ వరద ఉధృతి ఉన్నప్పటికీ నా కూతురిని చూడకుండా వెనక్కి వెళ్లలేకపోయా" అని యునిషా తండ్రి ఆ రోజు తన పరిస్థితిని వివరించారు.

దాదాపు గంటసేపు ఆమె బతికే ఉందో లేదో తెలియక ఆయన నిరంతరం ఫోన్ చేస్తూనే ఉన్నారు.

"చివరకు, నా కూతురు నా కాల్ లిఫ్ట్ చేసింది. నేను తట్టుకోలేక ఏడ్చేశాను. నాతో ఉన్న ఇద్దరు బంధువులు కూడా ఏడుస్తూ నన్ను కౌగిలించుకున్నారు" అని ఆయన చెప్పారు.

ఆ క్షణాన్ని గుర్తుచేసుకున్నప్పుడు యునిషా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

" మా నాన్న నుండి కాల్ వచ్చింది. ఆయన ఏడుస్తున్నారు. ఆ సమయంలో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయా" అని ఆమె చెప్పారు.

ఆమె కోసం కుటుంబం ఇంటి దగ్గర ఆత్రుతతో ఎదురు చూసింది.

"నా చిన్న కూతురు కూడా నిద్రపోలేదు. కానీ మూడు రోజుల తర్వాత (శుక్రవారం) తనని చూడటం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నా" అని ఆమె తల్లి అన్నారు.

రాజేంద్ర దవాడి, స్కూల్ హెడ్ మాస్టర్, నేపాల్ వరదలు, త్రిశూలీ బజార్
ఫొటో క్యాప్షన్, స్కూలు వరదల్లో మునిగిపోవడంతో తన భవిష్యత్ గురించి యునిషా ఆందోళన వ్యక్తం చేశారు.

యునిషా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు.

"ఇప్పుడు నాకు నా పైచదువుల గురించి ఆందోళనగా ఉంది. నేను స్కూల్ మారాల్సి వస్తే, నా పాత స్నేహితులను కోల్పోతాను. కొత్త వాళ్లతో పరిచయం కష్టంగా ఉంటుంది" అని ఆమె చెప్పారు.

సైరన్‌లు, ఎవాక్యూయేషన్ అలర్ట్‌లతో కూడిన మెరుగైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉండి ఉంటే ప్రజలు ఇంకా త్వరగా స్పందించి ఉండేవారని హెడ్‌మాస్టర్ దవాడి అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ, తక్షణమే స్పందించాలన్న తన నిర్ణయం పెద్ద విపత్తును నివారించిందని ఆయన భావిస్తున్నారు.

‘‘ఆ పీరియడ్ ముగిసే వరకు ఆగాలని నేను అనుకుని ఉంటే అక్కడ ఏమీ మిగిలి ఉండేది కాదు’’ అని దవాడీ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)