వైఎస్ జగన్ రూటు మారుతోందా? 'ఏపీలో మేమే కాక్రోచ్'.. 'సీఈసీ నియామకానికి మద్దతివ్వడంపై రిగ్రెట్ అవుతున్నాం' వ్యాఖ్యల మర్మమేమిటి?

ఫొటో సోర్స్, PMO Facebook
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంలోని ఎన్డీయే కూటమి నిర్ణయాలను మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల బహిరంగంగా విమర్శించడం చర్చనీయంగా మారింది.
వాస్తవానికి వైఎస్ జగన్ ఎప్పుడూ ఎన్డీయే కూటమిలో లేనప్పటికీ గత పుష్కరకాలంగా అంటే 2014 నుంచి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరోక్షంగా.. కొన్ని బిల్లుల విషయంలో ప్రత్యక్షంగా మద్దతిస్తూ వస్తున్నారు.
అయితే, జాతీయ రాజకీయాల్లో ఇప్పటివరకు అనుసరించిన వ్యూహానికి, ఇటీవలి కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు మధ్య స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

‘ఏపీలో మేమూ ఓ కాక్రోచ్’ అనే మాటతో..
ఓటర్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్, సర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, భారత ఎన్నికల సంఘం సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించిందని ఆరోపిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈవో) జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఈ నెలలో (అక్టోబర్‌లో) దిల్లీలో ఆందోళనలు జరిగాయి.
ఈ నిరసనల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించారనే ఆరోపణలతో సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ సందర్భంలోనే వైఎస్ జగన్ నేరుగా సీజేపీ ఆందోళనకు మద్దతుగా.. వారి అరెస్టులను ఖండించారు. ఈ మేరకు అక్టోబర్ 14న ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
''వ్యవస్థలో ఒక లోపం ఉంది, దానిని సరిదిద్దాలి. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు దేనినీ పరిష్కరించవు. అవి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. నేను వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను'' అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ సంఘీభావంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు వై.ఎస్.జగన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీయే పాలనను, నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న కాక్రోచ్ పార్టీకి నేరుగా మద్దతివ్వడంతో ఒక్కసారిగా జగన్ వైఖరి చర్చకు వచ్చింది.
ఇక వైఎస్ జగన్.. అంతకుముందు జూన్ నెలలోనే ''ఆంధ్ర రాష్ట్రంలో మేం కూడా ఓ కాక్రోచ్'' అని వ్యాఖ్యానించారు.
అయితే, అప్పట్లో ఏపీలో నిరుద్యోగుల సమస్యలు, డీఎస్సీ వివాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, ఆ వ్యాఖ్యలు చేశారు.
అలా రాష్ట్రంలో టీడీపీ కూటమిని వ్యతిరేకిస్తూ ఏపీలో మేమూ ఓ కాక్రోచ్ అంటూ.. మొదలుపెట్టిన వైఎస్ జగన్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఎన్నికల కమిషనర్ల సభ్యుల నియామక ప్రక్రియలో మార్పు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యను తప్పు పట్టారు.

ఫొటో సోర్స్, YSR Congress Party Social Media
అప్పట్లో సీఈసీ నియామకంలో కేంద్రానికి మద్దతిచ్చి తప్పు చేశామంటూ ..
తాజాగా అక్టోబర్ 18న వైఎస్ జగన్.. మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు ప్రస్తావన తీసుకొచ్చి మరోసారి కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు.
2023లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుకు పార్లమెంట్లో వైసీపీ మద్దతు ఇచ్చింది. అలా మద్దతిచ్చి తప్పు చేశామని జగన్ వ్యాఖ్యానించారు.
‘‘స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గానీ.. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గానీ.. అధికార పార్టీలు నామినేట్ చేసే పరిస్థితి రాకూడదు. అంతకు ముందు కేంద్రంలో ఇలా అధికార పార్టీలే నామినేట్ చేసే ప్రక్రియకు మేం మద్దతిచ్చాం.. కానీ, ఈరోజు రిగ్రెట్ అవుతున్నాం.. ఆ మద్దతిచ్చి తప్పు చేశామని రిగ్రెట్ అవుతున్నాం.. ఎందుకంటే ఎగ్జామినర్‌ను స్టూడెంట్ నియమించకూడదు. సీఈసీ నియామకంలో ప్రతిపక్ష నేత, సీజేఐ, ప్రధానమంత్రి.. ఈ ముగ్గురూ.. ఓటు హక్కును వినియోగించాలి. అప్పుడు సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ న్యూట్రల్‌గా ఉంటారు. న్యూట్రల్ బాడీ కింద కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి ఏమిటి.. ప్రధానమంత్రి, ఆయన నామినేట్ చేసే ఓ కేంద్ర మంత్రి, ప్రతిపక్షనేత, ఈ ముగ్గురిలో ఇద్దరి ఓట్లు ఒక వైపే పడతాయి కాబట్టి సీఈసీల నియామకం ప్రభుత్వమే చేపట్టినట్టు అవుతోంది, ఇది విధానలోపం.. కానీ, ఈ తప్పు చేసిన తర్వాతే మేము గమనించాం. అందుకే ఈ వ్యవస్థలో మార్పులు రావాలని మేం గట్టిగా అడగలగుతున్నాం.. '' అని వైఎస్ జగన్ ఆ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
ఇలా కొద్దిరోజుల వ్యవధిలోనే వైఎస్ జగన్ కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాట్లాడటం యాధృచ్ఛికం కాదని, ఆయన వ్యూహాత్మక ధోరణితోనే ఎన్డీయేకి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకునే ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు డానీ వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బిల్లు విషయంలోనే మొదలు
వాస్తవానికి ఈ తాజా పరిణామాల కంటే ముందుగానే దాదాపు రెండేళ్ల కిందటే 2024 ఆగస్టులోనే కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో తొలిసారిగా వైఎస్ జగన్ కేంద్రంలోని ఎన్డీయే నిర్ణయాన్ని వ్యతిరేకించారని డానీ గుర్తు చేశారు.
ఇప్పుడు జగన్ నేరుగా మాధ్యమాల్లో మాట్లాడుతుండగా.. వక్ఫ్ బిల్లు విషయంలో ఆపార్టీ నేతలు 2025 ఏప్రిల్‌లో ఉభయసభల్లోనూ ఎన్డీయేకి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని 13, 14, 25, 26 వ ఆర్టికల్స్‌కు వ్యతిరేకంగా ఉందని, ఇది మత స్వేచ్ఛకు, సమానత్వానికి భంగం కలిగిస్తుందని వైసీపీ వాదించింది.
అదేవిధంగా ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

ఫొటో సోర్స్, APCMO/FB
గత 12 ఏళ్లలో ఎన్నో బిల్లులకు నేరుగా వైసీపీ మద్దతు
అంతకు ముందు ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసినా తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసింది మాత్రం 2014 నుంచి.. ఆ ఎన్నికల్లో తెలంగాణలోని ఒక సీటుతో సహా పది ఎంపీ సీట్లను గెలుచుకున్న వైసీపీ అప్పటి నుంచే ఎన్డీయేకి పాలకపక్షాలతో పాటు మద్దతిస్తూ వస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ), ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ఎన్నో బిల్లులకు మద్దతిస్తూ వస్తోంది. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ 22 ఎంపీ సీట్లు గెలుచుకుంది.
2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల కాలంలో కూడా ఎన్డీయే ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతిస్తూ వచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న వైసీపీ ఆ తర్వాత కూడా అవసరమైన సందర్భాల్లో అధికార టీడీపీ, జనసేనలతో పాటు ఎన్డీయేకి మద్దతిచ్చింది.
గత ఏడాది జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ లోక్‌సభ స్పీకర్ పదవి విషయంలోనూ ఎన్డీయేకే వైసీపీ మద్దతిచ్చింది. రాష్ట్రంలో రాజకీయంగా తమకు ప్రత్యర్థి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మాదిరి ఎన్డీయే కూటమిలో భాగం కానప్పటికీ వైఎస్ జగన్ బీజేపీతో సఖ్యతనే కొనసాగిస్తూ వచ్చారని డానీ గుర్తు చేశారు.
‘జగన్ ఆ సాహసం చేయలేరు’
వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో బీజేపీని ప్రస్తుతం విభేదించినట్టు కనిపించవచ్చు కానీ మోదీని నేరుగా కాదనే సాహసం అప్పుడే చేయలేరని మరో సీనియర్ పాత్రికేయులు విశ్లేషకులు గాలి నాగరాజ అభిప్రాయపడ్డారు.
జెన్ జెడ్ల ప్రాబల్యం కనిపిస్తున్న మాట వాస్తవమే.. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమిని బలంగా ఢీకొనే వ్యతిరేక శక్తులు కనపడనంత కాలం జగన్.. ఎన్డీయేని కాదనలేరని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Danny Facebook
వైఎస్ జగన్ అడుగుల్లో మార్పు కనిపిస్తోంది
ఎన్డీయే కూటమి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు డానీ అభిప్రాయపడ్డారు.
ఇన్నాళ్లూ రాష్ట్రంలోని ప్రత్యర్ధి పార్టీలతో పోటీ పడి మరీ ఎన్డీయేకి మద్దతిచ్చిన జగన్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, ఎన్డీయే కూటమి పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, ముఖ్యంగా జెన్ జెడ్ల స్పందన చూసి.. క్రమంగా బీజేపీకి దూరంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు.
అయితే అప్పుడే ఇండియా కూటమికి దగ్గరవుతారనే వాదనలు సరికాదని, ఇండియా కూటమికి తాను తీవ్ర వ్యతిరేకిని కాను అనే వాదనను ఆయన తన తాజా చర్యల ద్వారా సంకేతం ఇస్తున్నారని డానీ వ్యాఖ్యానించారు.
ప్రధానంగా రాష్ట్రంలో వైఎస్ జగన్‌కి బలమైన ఓటు బ్యాంకుగా భావించే ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్లు ఇప్పుడు ఎన్డీయే కూటమికి బాగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
అందుకే జగన్ కూడా తాను ఎన్డీయేకి పూర్తి సమర్థకుడిని కాను అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావించే, ఈ విధంగా వ్యవహరిస్తున్నారని డానీ అభిప్రాయపడ్డారు.
అక్రమాస్తుల కేసు విచారణ వేగం నేపథ్యం కూడా..
అదేవిధంగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విషయంలో తాజాగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు కూడా జగన్ వైఖరిలో మార్పునకు కారణం కావొచ్చని డానీ అభిప్రాయపడ్డారు.
ఆ కేసులను త్వరగా తేల్చేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం, దాదాపుగా పదేళ్లుగా ప్రాథమిక డిస్చార్జ్ పిటిషన్ల దశలోనే నిలిచిపోయిన చార్జిషీట్లపై ఇక రోజూ వారీ విచారణ చేపట్టాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు నిర్ణయించడం తదితర పరిణామాలు కూడా జగన్ ఆలోచనల్లో మార్పునకు కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Margani Bharat
‘అంశాల వారీగానే మద్దతిచ్చామే కానీ.. ’
గతంలో మద్దతిచ్చిన అంశాలపై కానీ, ప్రస్తుతం విభేదిస్తున్న విషయాలపై కానీ తాము ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ప్రజాభిప్రాయానికి మద్దతు అంశాలనే పరిగణనలోకి తీసుకుంటామని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ బీబీసీతో అన్నారు.
‘‘మేం ఎప్పుడూ ఎన్డీయే కూటమికి అంశాల వారీగానే మద్దతునిచ్చామే కానీ, ఆ పార్టీలతో ఎప్పుడూ జోడీ కట్టలేదు. ఎన్డీయే కూటమి 2024లో అధికారంలోకి రాగానే పెట్టిన వక్ఫ్ బిల్లును మా పార్టీ ఉభయ సభల్లో వ్యతిరేకించింది. దాన్ని బట్టే అర్ధం చేసుకోవాలి మా స్టాండ్ .. అంతే కానీ ఎవరికో భయపడి కానీ రహస్య అజెండాలు అమలు చేయడం కానీ జగన్ రాజకీయ చరిత్రలోనే లేదు’’ అని భరత్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Putha Siva Sankar Reddy
‘కేసుల విషయంలో కానే కాదు..’
కేసుల విషయంలో ఈడీ నిర్ణయాల వల్ల తమ అధినేత జగన్ వైఖరిలో మార్పు వచ్చిందనేది పూర్తిగా సత్యదూరమైన వాదన అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. అప్పట్లో కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీనే లెక్క చేయని జగన్ ఇప్పుడు ఆ కేసులకు భయపడి రాజకీయాలు చేస్తారనుకోవడం భ్రమే అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Kilaru Dileep
‘జగన్ ఎప్పుడూ మా పక్షం కాదు’
వైఎస్ జగన్ ఎప్పుడూ మా పక్షం కాదు ఎన్డీయే కూటమిలోనూ ఏ నాడూ భాగస్వామి కాదు.. తెర వెనుక కాదు.. తెరమీద కూడా సభ్యుడు కాదు అని బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కిలారు దిలీప్‌లు ‘బీబీసీ’తో చెప్పారు.
జాతీయ స్థాయిలో బీజేపీ అన్ని విభాగాల జాయింట్ కోఆర్డినేటర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కిలారు దిలీప్ బీబీసీతో మాట్లాడుతూ... ‘‘ప్రధానిగా మోదీ అన్ని రాజకీయ పక్షాలనూ ఒకేరకంగా చూస్తారు.. ఆ మాదిరిగానే వైసీపీ నేత జగన్‌ను చూస్తారే కానీ ప్రత్యేకించి ఆయన పట్ల సానుకూల ధోరణి కానీ, ఉద్దేశపూర్వక వ్యతిరేక ధోరణి కానీ ప్రదర్శించరు’’ అన్నారు.
‘‘వైఎస్ జగన్‌పై ఉన్న కేసుల విషయంలో సీబీఐ పూర్తిగా చట్టప్రకారం, సుప్రీం ఆదేశాల మేరకే వేగవంతం చేస్తోందే కానీ, అందులో రాజకీయ జోక్యం ఏముంటుంది?’’ అని వారు ప్రశ్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































