గుజరాత్: భరూచ్‌లోని '700 ఏళ్ల' నాటి జామా మసీదు ఒకప్పుడు జైన దేవాలయమా?

ఫొటో సోర్స్, Rupesh Sonwane
- రచయిత, అజిత్ గఢ్వీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
గుజరాత్‌లోని భరూచ్‌లో చారిత్రక జామా మసీదు వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.
సుమారు 700 ఏళ్ల నాటిదిగా భావిస్తున్న ఈ మసీదు ప్రదేశం జైన తీర్థయాత్ర కేంద్రమని పేర్కొంటూ గుజరాత్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
మహారాష్ట్రకు చెందిన ఒక వర్గం ఈ ప్రదేశం తమదేనని చాలా కాలంగా వాదిస్తోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి జైన సమాజం కూడా చేరింది.
దీనిపై విచారణ చేయాలని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ)ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా స్పందన కోరింది.
దీన్ని జైన దేవాలయంగా ప్రకటించాలని ఐదుగురు వ్యక్తులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

మసీదు బేస్మెంట్లో దేవుళ్ల విగ్రహాలు దొరికాయని వాదన
ఈ ప్రదేశాన్ని పూర్వకాలంలో 'అశ్వబోధ తీర్థ, శకునిక విహార' అని పిలిచేవారని వారు వాదిస్తున్నారు. ఇక్కడ తమ తీర్థంకరుడైన మల్లినాథుని విగ్రహం ఉందని వారు చెబుతున్నారు.
భరూచ్‌లోని జామా మసీదు (దీన్ని జుమీ మసీదు, జుమా మసీదు అని కూడా పిలుస్తుంటారు.) కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రదేశం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.
మార్చి నెలలో కొందరు వ్యక్తులు ఈ మసీదులోకి బలవంతంగా వెళ్లేందుకు యత్నించారు. కొందరు మహిళలు మసీదు లోపల కొబ్బరికాయలు, ఇతర వస్తువులను ఉంచి పూజలు చేయబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తర్వాత జూన్‌లో మసీదు బేస్మెంట్కు సంబంధించినదిగా చెప్పే వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. మసీదు బేస్మెంట్లో దేవదేవుళ్ల విగ్రహాలు బయటపడ్డాయని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, SAJID PATEL
పిటిషనర్లు ఏం డిమాండ్ చేస్తున్నారు?
ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరిన వేళ ఈ చారిత్రక కట్టడం గురించి వివిధ పక్షాలు ఏం వాదిస్తున్నాయి? అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం ఏం చెబుతోంది?
వివాదాస్పదంగా మారిన ప్రాంతానికి బీబీసీ వెళ్లేసరికి అక్కడ ఒక వాచ్మెన్, పురావస్తు శాఖ నియమించిన అధికారి కనిపించారు.
ఈ మసీదు వద్ద రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు జరుగుతున్నాయి. వివాదం మొదలైన తర్వాత ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరి పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు.
భరూచ్‌లోని జామా మసీదును 14వ శతాబ్దంలో నిర్మించారని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మసీదు ప్రాంగణంలో 19 తీర్థంకరుడైన మల్లినాథుని విగ్రహం ఉందని జైనులు వాదిస్తున్నారు. దీనిని పరిరక్షించి, పూజలు చేసుకునే హక్కు కల్పించాలని పిటిషనర్లు కోరుతున్నారు.
దిల్లీకి చెందిన హరిశంకర్ జైన్, రాహుల్ దీవాన్ సహా మరో ముగ్గురు ఈ పిటిషన్లు వేశారు.
ఈ మసీదును 14వ శతాబ్దంలో ఘియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించారని జైనులు వాదిస్తున్నారు.
ఆ మసీదులో దేవాలయాలను తలపించే శిల్పాలతోపాటు, ఏనుగులు, గుర్రాల బొమ్మలు, నాట్యం చేస్తున్న మహిళల విగ్రహాలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు.
వివిధ పక్షాలు ఏం వాదిస్తున్నాయి?
జామా మసీదును సంరక్షిత కట్టడంగా 1909లో భారత పురావస్తు శాఖ ప్రకటించిందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడాల జాబితాలో కూడా ఉంది.
దీన్ని 1958 నాటి, ప్రాచీన కట్టడాలు, పురావస్తు స్థలాల చట్టం కింద నిర్వహిస్తున్నారు. కాబట్టి దీని ప్రస్తుత స్థితిని మార్చడం సాధ్యం కాదు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ఆలయాలను తిరిగి పొందేందుకు తాను న్యాయపోరాటం చేస్తున్నానని జామా మసీదు వివాదంలో భాగమైన ఒక పిటిషనర్ హరిశంకర్ జైన్ బీబీసీ గుజరాతీకి చెప్పారు.
"ఒకప్పుడు దేవాలయాలను కూల్చివేసి వాటి స్థానంలో మసీదులను నిర్మించారు. భరూచ్‌లోని ఈ కట్టడం నిజానికి ఒక జైన దేవాలయ ప్రాంతం" అని ఆయన చెబుతున్నారు.
"మేం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మసీదుకు సంబంధించిన ఫోటోలను జత చేశాం. ఈ ఫోటోల్లో దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయి" అని అన్నారు.
"మసీదులో ఒక బేస్మెంట్ ఉంది అందులో చాలా విగ్రహాలు ఇంకా ఉన్నాయి" అని హరిశంకర్ జైన్ వాదిస్తున్నారు.
అయితే ఈ భవనం చరిత్ర గురించి జామా మసీద్ ట్రస్టీ ఇమ్రాన్ పటేల్ భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.
ఈ మసీదును అప్పటికే 'జామియా మసీదు ' అని పిలిచేవారని ఆయన బీబీసీతో చెప్పారు.
"భరూచ్ ఒక ఓడరేవుగా ప్రసిద్ధి చెందిన కాలంలో, బయటి ప్రాంతాల నుంచి ముస్లిం వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. అప్పటి పాలకులు వారికి మసీదు నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించారు" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Rupesh Sonwane
"ఆ సమయంలో మసీదు నిర్మాణానికి అవసరమైన స్థానిక శిల్పులు అందుబాటులో లేకపోవడంతో, మసీదు నిర్మాణం చాలా నెమ్మదిగా సాగింది" అని ఇమ్రాన్ పటేల్ పేర్కొన్నారు.
"ఆ సమయంలో, మార్కెట్ ప్రాంతంలో ఆలయానికి సంబంధించిన శిథిలాలు కూడా లభించాయి. అందుకే, జైన ఆలయానికి చెందిన ఆ శిథిలాలను ఉపయోగించుకోవడానికి అప్పటి పాలకుడు అనుమతి ఇచ్చారు. కానీ, ఇక్కడ ఏ ఆలయాన్ని కూల్చివేయలేదు." అని ఆయన తెలిపారు.
ప్రస్తుత వివాదంపై ఇమ్రాన్ పటేల్ మాట్లాడుతూ, "ఇదంతా బయటి వ్యక్తుల ప్రోద్బలంతో జరుగుతోంది. కొందరు వ్యక్తులు భరూచ్‌లోని శాంతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు" అని అన్నారు.
"ఈ వివాదంలో మమ్మల్ని ఇంకా చేర్చలేదు" అని తెలియజేశారు.
ఈ మసీదు బేస్మెంట్లో విగ్రహాలు దొరికాయన్న వాదనపై కూడా ఆయన స్పందించారు.
"ప్రస్తుతం భవనం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి నుంచి ఒక్క రాయిని కూడా తొలగించే అవకాశం లేదు" అని ఆయన చెప్పుకొచ్చారు.
"గతంలో ఎప్పుడో ఒక స్తంభాన్ని మార్చినప్పుడు, దానిపై వారి దేవుని ప్రతిరూపం ఉండవచ్చు. అది వేరే విషయం. కానీ, దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చే ప్రయత్నం జరిగింది" అని కూడా అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రకు చెందిన ఓ వర్గం ఏం వాదిస్తోందంటే?
జామా మసీదు వివాదం జైనులు, ముస్లిం వర్గాలకే పరిమితం కాలేదు.
చక్రధర స్వామి స్థాపించిన మహానుభావ పంథా కూడా ఈ వివాదంలో భాగమైంది.
ఈ మసీదు ఉన్న ప్రదేశం తమ వ్యవస్థాపకుడైన స్వామి చక్రధరుని జన్మస్థలమని మహానుభావ సంప్రదాయానికి చెందిన వారు పేర్కొంటున్నారు.
ఈ సంప్రదాయానికి చెందిన వర్గం మహారాష్ట్రలో ఎక్కువగా కనిపిస్తుంది.
మా గురువు స్వామి చక్రధర్ ఇక్కడ జన్మించారని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన 'మహానుభావ దేవస్థాన ట్రస్ట్' కార్యదర్శి సుదర్శన్ నాగరాజ్ కపాటే ఒక సందర్భంలో పేర్కొన్నారు.
అంతేకాకుండా, "ఇది 12వ శతాబ్దం నుంచి మా ఆరాధనా స్థలంగా ఉంది. దీనిని కూల్చివేసి, ఇక్కడ ఒక మసీదు నిర్మించారు" అని ఆయన తెలిపారు.
"చక్రధర స్వామి భరూచ్ రాజవంశానికి చెందిన విశాల్దేవుని కుమారుడు. ఆయన అసలు పేరు హరిపాలదేవ్" అని గతంలో బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ నాగరాజ్ కపాటే చెప్పారు.
"ఆయన మరణించినప్పుడు, ద్వారకకు చెందిన గొప్ప సాధువు చాంగ్దేవ్ రౌల్ ఆత్మ ఆయన శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత, ఆయన మహారాష్ట్రలో 'మహానుభావ' సంప్రదాయాన్ని స్థాపించారు. ఇదే స్వామి చక్రధరుని జన్మస్థలం." అని చెప్పుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Rupesh Sonwane
హరిపాలదేవ్ జైన సంప్రదాయాన్ని అనుసరించే కుటుంబంలో జన్మించారని కపాటే చెబుతున్నారు. అందుకే, ఈ ప్రదేశాన్ని 'సమాలి విహార్ జైన దేవాలయం' అని కూడా పిలుస్తారని ఆయన పేర్కొన్నారు
అయితే, ఈ వ్యాఖ్యలకు ఎటువంటి పురావస్తు ఆధారాలు లేవు.
భరూచ్ జిల్లా కలెక్టర్ వెబ్సైట్ ప్రకారం, జామా మసీదును 14వ శతాబ్దంలో నిర్మించారు.
బీబీసీ గుజరాతీ విభాగం సుదర్శన్ నాగరాజ్ కపాటేను స్పందన కోసం మళ్లీ సంప్రదించింది. మొదట ఆయన స్పందించేందుకు అంగీకరించలేదు.
తాను భరూచ్‌లోని శంకరాచార్య మఠానికి చెందిన ముక్తానంద స్వామి వద్ద ఉంటున్నానని, ఆయన మార్గదర్శకత్వంలోనే పనిచేస్తున్నానని ఆ తర్వాత కొద్దిసేపటికే పేర్కొన్నారు. ఈ విషయంలో ముక్తానంద స్వామి చెప్పేదానికి అంగీకరిస్తానని వివరించారు.
ఈ ఉద్యమాన్ని తాను గత నాలుగేళ్లుగా నడుపుతున్నానని కపాటే వెల్లడించారు.

ఫొటో సోర్స్, Rupesh Sonwane
ముక్తానంద స్వామి ఏమంటున్నారు?
ఈ వివాదంలో వినిపించే పేర్లలో ముక్తానంద స్వామి పేరు కూడా ఉంది. భరూచ్‌లో నర్మదా నది ఒడ్డున ఉండే ఒక ఆశ్రమంలో ఆయన ఉంటున్నారు.
సన్యాసి కాక ముందు ఆయన పేరు భవేశ్ పటేల్.
ఆయన 2007లో అజ్మీర్ దర్గా బాంబు దాడి కేసులో నిందితుడు. ఆయనకు 2017లో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే 2018లో ఆయనకు రాజస్థాన్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఆ సమయంలో ఆయన కాషాయం ధరించి తన పేరును ముక్తానంద స్వామిగా మార్చుకున్నారు.
అజ్మీర్ దర్గా బాంబు పేలుడులో ముగ్గురు చనిపోగా, 15 మంది గాయపడ్డారు.
"భరూచ్‌లో జామా మసీదుగా పిలుచుకునే ఈ ప్రదేశం వాస్తవంగా చక్రధర స్వామి జన్మస్థలం. ఈ స్థలానికి చెందిన అసలు రూపాన్ని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నాం" అని చెప్పారు.
"ఈ ప్రదేశం భారత పురావస్తు సర్వేక్షణ పరిధిలోకి వస్తుంది, కానీ ఇక్కడ పురావస్తు శాఖ నిబంధనలను అమలు చేయడం లేదు." అని ఆయన ఆరోపించారు.
"మసీదులో స్నానాల గదులు నిర్మించారు, నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు, అంతేకాకుండా మృతదేహాలను ఖననం చేస్తున్నారు. ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ ఈ పనులు జరుగుతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తున్నాం" అని విమర్శించారు.
భరూచ్‌లోని జామా మసీదును జైన దేవాలయంగా ఎందుకు భావిస్తున్నారని అడిగినప్పుడు, "అక్కడ ఉన్న శిల్పాలు, ఇతర రూపాలు మరే ఇతర మసీదులోనూ కనిపించవు. మసీదులకు లేదా ఇస్లాంకు విగ్రహాలతో ఎలాంటి సంబంధం లేదు." అని ముక్తానంద స్వామి అన్నారు.
అయితే, తనపై పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.

ఫొటో సోర్స్, Rupesh Sonwane
జామా మసీదు చరిత్ర ఏంటి?
భరూచ్‌లోని జామా మసీదుకు ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉంది.
భరూచ్ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని అందించే గుజరాత్ ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, జామా మసీదును 14వ శతాబ్దంలో ఒక ప్రాచీన జైన దేవాలయ నిర్మాణ సామగ్రితో నిర్మించారు.
భరూచ్ కోట పాదాల వద్ద ఉన్న ఈ మసీదు నిర్మాణం 14వ శతాబ్దం ప్రారంభంలో, సుమారు క్రీ.శ. 1300 ప్రాంతంలో జరిగింది.
ఈ భవనానికి మూడు పెద్ద గోపురాలు, బ్రాకెట్ పద్ధతిలో నిర్మించిన మొత్తం 48 స్తంభాలు ఉన్నాయి.
ఆలయానికి చెందిన సామగ్రిని, శిథిలాలను ఈ మసీదు నిర్మాణానికి ఉపయోగించారు. అయితే, దీని నిర్మాణం మసీదుకు ఉండాల్సిన సూత్రాల ప్రకారమే జరిగిందని గుజరాత్ ప్రభుత్వ వెబ్సైట్ పేర్కొంది.
ముస్లిం పర్యవేక్షకుల మార్గదర్శకత్వంలో ఈ మసీదు నిర్మితమైంది. అయితే దీని నిర్మాణ పనులను స్థానిక కూలీలు చేపట్టారు. బహుశా వారు అంతకుముందు ఎప్పుడూ మసీదును చూసి ఉండకపోవచ్చు అని అందులో వెల్లడించారు.
ఈ మసీదు సముదాయానికి మూడు వైపులా ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రధాన ప్రార్థనా స్థలం పశ్చిమ దిశలో ఉందని గుజరాత్ ప్రభుత్వ వెబ్సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Rupesh Sonwane
పురావస్తు శాఖ ఏం చెబుతోంది?
జామా మసీదుకు సంబంధించిన వివాదం కోర్టుకు చేరిన వేళ, భారత పురావస్తు శాఖ అధికారుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
అయితే, మసీదులోని బేస్మెంట్లోకి వెళ్లి వీడియో తీసిన ఘటనపై భారత పురావస్తు శాఖ వడోదర సర్కిల్ సూపరింటెండెంట్ డాక్టర్ శుభమ్ మజుందార్ స్పందించారు.
"ఈ భవనంలోకి అందరికీ అనుమతి ఉంది. ఇక్కడికి రావొద్దని ఎవరినీ ఆపలేదు"అని అన్నారు.
"1958 నాటి 'స్మారక చిహ్నాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం' పరిధిలోకి వచ్చినప్పటి నుంచి, ఇది మసీదు రూపంలోనే ఉంది" అని పురావస్తు శాఖ అధికారి రిజ్జు ఘోష్ బీబీసీ గుజరాతీతో మాట్లాడుతూ చెప్పారు.
"అంతకు ముందు ఇది ఏ రూపంలో ఉండేదో నేను చెప్పలేను." అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































