చీర కట్టుకుని చెప్పులు లేకుండా పరుగెత్తిన కవితా దేవి ‘హోంగార్డ్’ కల ఎందుకు నెరవేరలేదు?

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
"ఉదయం ఐదు గంటలకే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు హైజంప్‌లో కాలు కాస్త జారడం వల్ల కొన్ని నెలల కఠోర శ్రమ వృథా అవుతుందని అనుకోలేదు"
అక్టోబర్ 25న రామ్‌గఢ్ జిల్లాలో హోంగార్డ్ రిక్రూట్‌మెంట్ శారీరక పరీక్షలో పాల్గొన్న కవితా దేవి మాటలు ఇవి. ఈ శారీరక పరీక్ష కోసం కవితకు ఉచితంగా శిక్షణ ఇచ్చిన కోచ్ అంకిత్ అగర్వాల్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.
"హైజంప్‌లో ఆమె విఫలమవుతారని మేం అస్సలు ఊహించలేదు. ప్రాక్టీస్ సమయంలో ఆమె పరుగులో ఎంత ప్రతిభ చూపిందో హైజంప్‌లోనూ అంతే బాగా చేసేవారు" అని కోచ్ అంకిత్ బీబీసీతో చెప్పారు.
"మొదటి రౌండ్‌లో జరిగిన 1600 మీటర్ల పరుగు పందెంలో కవితా చాలా సులభంగా విజయం సాధించారు. హైజంప్‌లో కూడా ఆమె అదే విధంగా విజయం సాధించి ఉంటే బాగుండేది" అని అంకిత్ అన్నారు.
అంకిత్ మాదిరిగానే కవిత కూడా నిరాశ చెందారు. "ఈ అపజయం కలిగించిన షాక్ నుంచి కోలుకోవడానికి నెలలు పట్టవచ్చు" అని ఆమె అన్నారు.


ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
కుటుంబం కోసం కవిత పోరాటం
కష్టాలు చుట్టుముట్టినప్పుడు కుంగిపోకుండా వాటికి ఎదురు నిలిచిపోరాడే లక్షల మంది మహిళల జీవితాలకు కవిత కథ సజీవ సాక్ష్యం
ఐదేళ్లపాటు అనారోగ్యంతో ఇబ్బంది పడ్డాక కవిత భర్త 2023లో మరణించారు.
ఆ సమయంలో భర్త వైద్యం కోసం చేసిన అప్పుల వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో అత్తమామలు, కొడుకు, కూతురి బాధ్యత కవిత భుజాలపై పడింది. అలా మొదలైన ఆమె జీవన పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది.
ఇల్లు గడవడానికి కవిత కొన్నిసార్లు ఇటుక బట్టీల్లో కూలీగా మరికొన్నిసార్లు పొలం పనులు చేసేవారు.
ఎక్కడా ఏ పని దొరకనప్పుడు ఊళ్లోనే ఏదో ఒక కూలిపనికి వెళ్లేవారు.
రామ్‌గఢ్‌లో హోంగార్డ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కవితలో కొత్త ఆశలు చిగురించాయి.
ఆమె ఇంటర్మీడియట్ వరకు చదివారు.
"హోంగార్డ్ యూనిఫాం కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. నా పిల్లల భవిష్యత్తు భద్రతకు కొండంత అండగా నిలుస్తుందని అనిపించింది" అని ఆమె చెప్పారు.
ఆ ఆశతోనే కవిత పరుగు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది.
కవితకు ఆమె అత్తయ్య ప్రోత్సహించారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
పరుగు ప్రాక్టీస్ కోసం కోచ్ దగ్గరకు..
గ్రామంలో ఉదయం 5 గంటలకే పరుగు ప్రాక్టీస్ చేసే కవితకు సిదో-కన్హు మైదానంలో ఒక ట్రైనర్ పర్యవేక్షణలో ఉచిత ట్రయల్స్ జరుగుతున్నట్లు సెప్టెంబర్ చివరి వారంలో తన తోటికోడలు సరిత ద్వారా తెలిసింది.
సెప్టెంబర్ 4న జరిగిన ఉచిత కోచింగ్ సెంటర్ ట్రయల్స్‌లో పాల్గొన్న కవిత నిర్ణీత సమయం కంటే ముందే 1600 మీటర్ల పరుగును పూర్తి చేశారు.
చీర కట్టుకుని, ఒట్టి కాళ్లతో ఆమె పరిగెత్తిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
దాన్ని చూసిన తర్వాత కవితా దేవిపై ప్రశంసలు కురిశాయి.
"స్పోర్ట్స్ షూస్, ట్రాక్ సూట్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ కిట్ ఏవీ లేకుండానే 1600 మీటర్ల రేసును పూర్తి చేసిన కవితా జీ సామర్థ్యాన్ని చూసి ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చాం" అని కోచ్ అంకిత్ అగర్వాల్ చెప్పారు.
ఆ తర్వాత కోచ్ అంకిత్ కవితకు రన్నింగ్ షూస్, ట్రాక్ సూట్, ప్రొఫెషనల్ ట్రైనింగ్ కిట్‌ను ఉచితంగా అందించారు.
కోచ్ మద్దతు, ప్రజల నుంచి లభించిన ప్రశంసలు కవితలో నమ్మకం పెంచాయి. హోంగార్డ్ అయితే తన రాత మారుతుందని ఆమె నమ్మారు.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
అక్టోబర్ 25న ముక్కలైన కల
దురదృష్టవశాత్తూ జీవితాల్లో ఎప్పుడూ సినిమా కథల్లాగా ఆనందకరమైన ముగింపు ఉండదు.
అక్టోబర్ 25న హోంగార్డు పరీక్షల రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కవిత 1600 మీటర్ల రేసును విజయవంతంగా పూర్తి చేశారు. కానీ హైజంప్‌లో విఫలమయ్యారు.
పరుగు పందెం కోసం తన శక్తినంతా ధారపోసిన కవిత శరీరం కాళ్లు అప్పటికే విపరీతమైన అలసట, ఒత్తిడికి లోనయ్యాయి.
"చీరలో పరుగెత్తిన వీడియో వైరల్ అయినప్పటి నుంచి మాకు చాలా వింతగా అనిపిస్తోంది. అక్టోబర్ 25న జరిగే రేసులో మేము విజయం సాధించకపోతే, మా ఊరి జనాలు నన్ను చూసి ఎగతాళి చేస్తారని భయంగా ఉంది" అని ఆమె ఈ ట్రయల్స్‌కు ముందు బీబీసీతో చెప్పారు.
కవిత భయాన్ని కోచ్ అంకిత్ కూడా అంగీకరించారు.
"నేను ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. కానీ రన్నింగ్ రేస్‌లో విజయవంతంగా పరిగెత్తిన తర్వాత కూడా ఆమె తీవ్రమైన ఒత్తిడిలోనే ఉన్నారు" అని ఆయన చెప్పారు.
"హైజంప్ ప్రారంభించే సమయంలో ఆమె కాలు స్వల్పంగా జారింది. దాంతో ఆమె నిర్ణీత మార్కును దాటలేక విఫలమయ్యారు" అని ఆయన తెలిపారు.
ఆ సమయంలో అక్కడున్న వారందరి దృష్టి కవితపైనే ఉంది. ఆమె వైఫల్యం తర్వాత మైదానమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
కవిత కళ్లు చెమ్మగిల్లాయి. ఆ కుటుంబం అంతా నెలల తరబడి ఎదురుచూసిన ఆ క్షణం ఒక్క నిమిషంలో ముక్కలైపోయింది.

ఫొటో సోర్స్, Mohammad Sartaj Alam
ఇంట్లో విషాద ఛాయలు
కవిత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె అడుగులు భారంగా సాగాయి.
ఇంటి గుమ్మం వద్ద కూర్చుని ఉన్న ఆమె వృద్ధ అత్తమామలు అప్పటికే ఆశ, భయాల మధ్య ఎదురుచూస్తున్నారు.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కవిత కళ్లను చూడగానే అందరికీ విషయం అర్థమైపోయింది.
కొన్ని రోజుల క్రితం వరకు ఆశల కిరణాలు వెలిగిన ఆ రెండు గదుల చిన్న ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది.
"చిన్న కోడలు సరిత విజయం సాధించింది. కానీ కవితను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఆమె నాకు కేవలం కోడలు మాత్రమే కాదు, కూతురు, కొడుకు.. అంతా తనే" అని కవిత అత్తగారు ఫుల్కో దేవి అన్నారు.
"కవిత తన వంతు ప్రయత్నం చేసింది. కానీ దేవుడికి ఆమె విజయం సాధించడం ఇష్టం లేదు. నా కొడుకు బతకడం ఎలా ఇష్టం లేదో అలాగే ఇదీ జరిగింది" అని పుల్కో దేవి ఆవేదన చెందారు.
"ఇల్లు గడవాలంటే కవిత మళ్లీ పొలం పని, ఇటుక బట్టీపైనే ఆధారపడవలసి వస్తుంది. నా కొడుకు చనిపోయినప్పటి నుంచీ ఆమె చేస్తున్నది అదే" అని ఆమె అన్నారు.
కవిత ఎదుర్కొన్న ఈ వైఫల్యం కేవలం ఒక పరీక్షలో వైఫల్యం మాత్రమే కాదు.
వనరుల కొరత వల్ల ఒక ప్రతిభావంతురాలైన పోరాట పటిమ గల వ్యక్తి కలలు ఎలా చల్లాచెదురవుతాయో చెప్పడానికి వ్యవస్థ ముందు నిలిచిన ఒక ప్రశ్న కూడా.
కవితకు సరైన శిక్షణ, పౌష్టికాహారం, వనరులు అంది ఉంటే బహుశా ఈ ఫలితం వేరేలా ఉండేదేమో.
"నాకెంత నిరాశగా అనిపించిందో మాటల్లో చెప్పాలేను. నా హృదయం గాయాలతో నిండిపోయినట్లు అనిపిస్తోంది" అని కవిత చెప్పారు.
"ట్రయల్స్ తర్వాత నేను ఏ స్థితిలో ఉంటానో అని ఊహించుకున్నాను. కానీ ఈ అపజయం నన్ను మళ్లీ పాత స్థానంలోనే నిలబెట్టింది" అని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























