‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

తమిళనాడు, తేని,
ఫొటో క్యాప్షన్, తమిళనాడులోని తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు తప్పించుకున్నారు
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

తమిళనాడులోని తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు సోమవారం రాత్రి తప్పించుకున్నారు. ప్రస్తుతానికి వారిలో నలుగురిని పోలీసులు పట్టుకోగలిగారు.

తప్పించుకొని పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా తప్పించుకున్న ఖైదీల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని దక్షిణ మండల పోలీసు ఇన్స్‌పెక్టర్ జనరల్ విజయేంద్ర బిడారి తెలిపారు.

తేని జిల్లా ఆండిపట్టి సమీపంలోని తెక్కంపట్టిలో జిల్లా కారాగారం ఉంది. ఈ జైలులో తేని, దిండిగల్, మదురై జిల్లాలకు చెందిన ఖైదీలను ఉంచుతారు. తెక్కంపట్టి జైలు నుంచి సోమవారం(అక్టోబర్ 26) రాత్రి 17 మంది ఖైదీలు పరారైనట్టు పోలీసులు వెల్లడించారు.

ఘటన జరిగిన వెంటనే తెక్కంపట్టి జైలను జిల్లా ఎస్పీ ప్రవీణ్ గౌతమ్ సందర్శించారు. అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దక్షిణ మండలం ఐజీ విజయేంద్ర బిడారి కూడా జైలు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తమిళనాడు, తేని,
ఫొటో క్యాప్షన్, మీడియాతో మాట్లాడుతున్న విజయేంద్ర బిడారి

జైలు అధికారులపై దాడి చేసి ఖైదీలు పరారైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఖైదీలు అనారోగ్యంగా ఉన్నట్టు నటించి జైలు సిబ్బందిపై దాడి చేసి ఆ తర్వాత పరారైనట్టు దక్షిణ మండల ఐజీ విజయేంద్ర బిడారి మీడియాకు తెలిపారు.

ఒకే సెల్‌లో 17 మంది ఖైదీలు ఉన్నారు. వారిలో ఒకరికి అస్వస్థతగా ఉందని చెప్పడంతో జైలు గార్డు ఆ సెల్ వద్దకు వచ్చారు.

ఆ సమయంలోనే దాడి చేసి 17 మంది పరారైనట్టు పోలీసులు తెలిపారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

తమిళనాడు, తేని,
ఫొటో క్యాప్షన్, తప్పించుకున్న ఖైదీల్లో నలుగురిని పట్టుకున్న పోలీసులు

జైలు గార్డుకు తలకు బలమైన గాయం కావడంతో ఆయన్ని తంగపాండి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గార్డులు కూడా గాయపడినట్టు చెబుతున్నారు.

పరారైన ఖైదీలను పట్టుకునేందుకు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా దిండిగల్ జిల్లాలో 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ చెక్ పోస్టుల గుండా వెళ్లే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఖైదీల కోసం ప్రత్యేకంగా నిఘా పెంచినట్టు దిండిగల్ జిల్లా ఎస్పీ ఎస్ జయకుమార్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

తమిళనాడు, తేని,
ఫొటో క్యాప్షన్, ఖైదీలు తప్పించుకున్న తేని జైలు

తప్పించుకున్న ఖైదీలు ఎవరు?

మదురై జిల్లాకు చెందిన కరుప్పసామి అలియాస్ మదన్, రాజ్‌కుమార్, తిరుపతి, పొన్నముత్తుచెల్వం, మీనాక్షి సుందరం, నిశాంత్, ముత్తు ఎలంగోవన్, కార్తిక్‌రాజా, ప్రశాంత్ అలియాస్ లింగ ప్రసాద్, రాజా సికందర్, సోలైముగిలీశ్వరన్ తప్పించుకున్న వారిలో ఉన్నారు.

శివగంగై జిల్లాకు చెందిన తరుణ్ కుమార్, రామనాథపురం జిల్లాకు చెందిన పాండి సెల్వం, సేలం జిల్లాకు చెందిన శబరినాథన్, కన్యాకుమారి జిల్లాకు చెందిన రెజీనా, తేని జిల్లాకు చెందిన శిలంబరసన్ కూడా పరారైన జాబితాలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)