వెలిగొండ: మునిగిపోతున్న గ్రామంలోకి ఆ ముగ్గురు ఎందుకు వెళ్లారు? దాదాపు 8 గంటల రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారులు ఏం చెప్పారు?

పోలీసులు, క్షతగాత్రులు

ఫొటో సోర్స్, Venkateswar Reddy/Markapuram

ఫొటో క్యాప్షన్, పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసిన నేపథ్యంలో ముంపుకు గురయ్యే గ్రామానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు నీటి ప్రవాహంలో చిక్కుకుని దాదాపు ఎనిమిది గంటల తర్వాత అధికారుల రెస్క్యూ ఆపరేషన్‌తో బయటపడ్డారు.

ఆగస్టు 31వ తేదీ సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను మార్కాపురం ఆర్డీవో శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజులు బీబీసీకి వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ మార్కాపురం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు ప్రాజెక్ట్‌ ఫీడర్‌ కెనాల్‌ వద్ద గేట్లు ఎత్తి కృష్ణా నది నీటిని నల్లమల సాగర్‌కి విడుదల చేశారు.

నీళ్లు విడుదలైన నేపథ్యంలో ముంపు గ్రామాల్లోకి మధ్యాహ్నం తర్వాత ప్రవాహ ఉధృతి పెరుగుతూ వచ్చింది.

ఈ క్రమంలో మార్కాపురం పట్టణానికి చెందిన నామాల తిరుపతి నాయుడు (45), నల్ల బోతుల శీను (40) పసుపులేటి రమణ (40) అనే ముగ్గురు వ్యక్తులు ముంపు గ్రామమైన కలనూతలను చివరిసారిగా చూసేందుకు వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బొలెరే వాహనంలో ఊళ్లోకి వెళ్లారు. అప్పటికే గ్రామంలో నీటి ప్రవాహం పెరగడంతో రాత్రి ఏడుగంటల సమయంలో తిరుగు ముఖం పట్టారు.

‘‘తిరిగి వచ్చే క్రమంలో కలనూతల గ్రామం ఆవల వాగు దాటుతుండగా రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహవేగం పెరిగింది. ఆ ఉధృతికి వాహనం కొట్టుకుపోతుండగా, ఈ ముగ్గురూ వాహనంలో నుంచి బయటకు వచ్చి నీళ్లల్లో దూకేసి ఈదుకుంటూ సమీపంలోని చెట్టు వద్దకు వెళ్లారు.

అక్కడ కూడా వరద ప్రవాహం పెరగడంతో చెట్టుపైకి ఎక్కి కొమ్మల ఆసరాగా కూర్చుని కేకలు వేశారు. వాగుకి మరోవైపు ఒడ్డున ఉన్న స్థానికులు ఇది గమనించి వెంటనే 100కి ఫోన్‌ చేశారు’’ అని అధికారులు బీబీసీకి వివరించారు.

నీటి ప్రవాహం

ఫొటో సోర్స్, Venkateswar Reddy/Markapuram

ఫొటో క్యాప్షన్, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న బొలెరో వాహనం

దాదాపు 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి కూడా అక్కడికి చేరుకుని ఆ ముగ్గురిని ఎలా రక్షించాలనే విషయమై సమాలోచనలు చేశారు.

పెద్దసంఖ్యలో పోలీస్‌ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బందిని అక్కడికి రప్పించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో విద్యుత్‌ స్తంభాలకు తాళ్లు కట్టి వారికి అందుబాటులోకి తేవాలని యత్నించినా సాధ్యపడలేదు.

చివరికి గజఈతగాళ్లతో పాటు ఓ భారీ క్రేన్‌ తరహా వాహనాన్ని (ప్రొక్లెయిన్‌ 210) రప్పించి..ఆ వాహనాన్ని చెట్టు దగ్గరగా తీసుకువెళ్లగా, ఆ ముగ్గురూ చెట్టుపై నుంచి దానిపై దిగారు. అక్కడి నుంచి వాగు ఒడ్డుకు సురక్షితంగా తీసుకురాగలిగామని ఆర్డీవో శివరామి రెడ్డి, డీఎస్పీ నాగరాజు బీబీసీకి తెలిపారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ అయ్యేటప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటలైందని మొత్తంగా ఎనిమిది గంటలకి పైగా రెస్క్యూఆపరేషన్‌ చేసి వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు.

అధికారులు, రెస్క్యూ ఆపరేషన్

ఫొటో సోర్స్, Venkateswar Reddy/Markapuram

ఫొటో క్యాప్షన్, ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఇతర అధికారులు

మునిగిపోతున్న ఊరు చూసేందుకే వెళ్లారా?

మార్కాపురంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఆ ముగ్గురూ మునిగిపోతున్న ఊరిని చూసేందుకు వెళ్లామని చెబుతున్నారని, దీనిపై తాము విచారణ చేస్తున్నామని డీఎస్పీ నాగరాజు చెప్పారు. పెద్దారవీడు పోలీస్‌స్టేషన్‌లో ఈ ముగ్గురినీ ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

''అదృష్టవశాత్తూ రెస్క్యూఆపరేషన్‌ విజయవంతమైంది కాబట్టి సరిపోయింది.. లేదంటే ప్రాజెక్టు ప్రారంభమైన తొలిరోజే అపశృతిగా మిగిలేది’’ అని జిల్లాకు చెందిన ఓ ముఖ్య అధికారి బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.

ఈ ఘటనకు సంబంధించి చాలా వదంతులు వ్యాప్తి చెందాయని, వాహనంలో ఐదుగురు ఉండగా, మరో ఇద్దరు కొట్టుకుపోయారని ప్రచారం జరిగిందని, అవన్నీ అవాస్తవాలనీ డీఎస్పీ నాగరాజు చెప్పారు.

అయితే వాహనం మాత్రం వాగులో కొట్టుకుపోయిందని అన్నారు.

చెట్టు, రెస్క్యూ టీం

ఫొటో సోర్స్, Venkateswar Reddy/Markapuram

ఫొటో క్యాప్షన్, క్రేన్‌ సాయంతో క్షతగాత్రులను చెట్టుపై నుంచి కిందకు దించుతున్న రెస్క్యూ టీం

దేవాలయాల్లో నగల కోసమా?

''ముంపు గ్రామాల్లో ఊళ్లు ఖాళీ చేసినా దేవాలయాల్లోని విగ్రహాలను తీయకూడదని అలానే వదిలేశారు. ప్రధానంగా కలనూతలలో ఉన్న చారిత్రక దేవాలయాల్లో దేవతామూర్తులకు ఉన్న బంగారు ఆభరణాలను తీయకుండా సెంటిమెంట్‌ నేపథ్యంలో అలానే వదిలేశారు. ఇప్పుడు కొందరు ఆ ఆభరణాలను అపహరించేందుకు ఆ ఊళ్లల్లోకి వెళ్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి బీబీసీతో అన్నారు.

కాగా, ముంపు గ్రామాల్లోకి ఎవ్వరూ వెళ్లకుండా సోమవారం ఉదయం నుంచే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, కానీ సరిగ్గా ఈ ముగ్గురూ వెళ్లే సమయంలోనే పోలీసులు వేరే పనిపై పక్కకు వచ్చారని పెద్దారవీడు ఎస్‌ఐ సైదాబాబు బీబీసీకి తెలిపారు.

ఆ ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం వరకు పోలీసుల అదుపులో ఉండటంతో వారి వివరణ తీసుకునేందుకు సాధ్యపడలేదు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక వారు అందుబాటులోకి వస్తే వారి అభిప్రాయాన్ని అప్‌డేట్‌ చేస్తాం. అలాగే, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాం.

జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, కలెక్టర్‌ విజయసునీత,

ఫొటో సోర్స్, Venkateswar Reddy/Markapuram

ఫొటో క్యాప్షన్, ఘటనాస్థలం వద్ద కలెక్టర్‌ విజయసునీత, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు.

రాత్రి కొంతసేపు నీటి విడుదలను నిలిపివేశాం: జాయింట్ కలెక్టర్

నీటి ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నీటి విడుదలను నిలిపివేశామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసరావు బీబీసీకి తెలిపారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటరీ వద్ద గేట్లను మూసివేసి నీటి విడుదలను ఆపివేశామనీ, తిరిగి ఆ ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్లీ గేట్లు ఎత్తి నీటి విడుదల యధావిధిగా జరుగుతోందని ఆయన తెలిపారు,

నీటి ప్రవాహం కొద్దిగా ఉందనో, లేదంటే తగ్గిపోతుందనో భావించి ముంపుగ్రామాల ప్రజలు ఎవ్వరూ ఊళ్లల్లోకి వెళ్లవద్దని ఆయన సూచించారు.

కాగా, తమకున్న సమాచారం ప్రకారం సోమవారం రాత్రి నాటికే ముంపు గ్రామాల్లోని నిర్వాసితులందరూ బయటకు వచ్చేశారని జేసీ శ్రీనివాసులు బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)