జేబులో రూ. 300తో బస్సెక్కి బెంగళూరు వచ్చిన కుర్రాడు ఇండియాలో అగ్రశ్రేణి నటుల్లో ఒకరిగా ఎలా ఎదిగారు?

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

రణ్‌బీర్ కపూర్ నటించిన రామాయణ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బడ్జెట్ నుంచి నటీనటుల ఎంపిక వరకు అనేక అంశాలు చర్చకు దారితీశాయి.

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆయనే కన్నడ సినీ నటుడు యశ్.

ఈ సినిమాలో యష్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా ఆయన ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా మొదటి భాగం నవంబర్ 5న విడుదల కానుంది.

1986 జనవరి 8న కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జన్మించిన యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.

అయితే, ప్రస్తుతం ఆయన అసలు పేరు కంటే రాకింగ్ స్టార్ యశ్ అనే పేరుతోనే ఎక్కువగా గుర్తింపు పొందారు.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను నవీన్ కుమార్ గౌడ అని పిలిస్తే ఎలా స్పందిస్తారని అడిగినప్పుడు యశ్ సరదాగా "అతనెవరు?" అన్నారు.

ఒక చిన్న పట్టణం నుంచి ప్రయాణం ప్రారంభించి, కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారల్లో ఒకరిగా ఎదిగి, ఇప్పుడు బాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్ర పోషించేవరకు ఎలా ఎదిగారు?

యశ్ కుటుంబానికి చిత్ర పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేదు. ఆయన తండ్రి బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారు. చదువు పూర్తయిన తర్వాత యశ్ నాటకరంగం, టెలివిజన్ ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టారు.

2014లో జీ కన్నడలో ప్రసారమైన వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన.. తాను చిన్నప్పటి నుంచే నాటకాలు, నృత్య పోటీల్లో పాల్గొనేవాడినని వెల్లడించారు.

చిన్న వయసులోనే ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు తనను ఎంతగానో ఆకర్షించేవని, క్రమంగా వాటికి అలవాటుపడిపోయానని చెప్పారు.

"ఉపాధ్యాయులు నన్ను హీరో అని పిలిచినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది. క్రమంగా హీరో కావాలనే ఆలోచన నా మనసులో బలపడింది. ఎలాగైనా సినిమాల్లో నటుడిని కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను" అని యశ్ వివరించారు.

అయితే, ఆయన బాల్యం, తొలి రోజులు అంత సాఫీగా సాగలేదు. తన తండ్రి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేసేవారని, రోజుకు కేవలం రూ.14 సంపాదించేవారని యశ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆయనకి ఓ చెల్లెలు ఉన్నారు.

కుటుంబ అవసరాల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని, కుటుంబానికి సహాయం చేసేందుకు కిరాణా దుకాణం నిర్వహణలో పాలుపంచుకున్నానని యశ్ తెలిపారు.

సినిమాల్లోకి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదని ఆయన చెప్పారు. తన తండ్రి తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలని కోరుకున్నారని చెప్పారు.

2019లో ‘ద న్యూస్ మినిట్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ తన జీవితంలోని కీలక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇంటి నుంచి బెంగళూరుకు వెళ్లిపోయానని, అప్పుడు తన జేబులో కేవలం రూ. 300 మాత్రమే ఉన్నాయని చెప్పారు.

"బెంగళూరుకు చేరుకున్నప్పుడు నాకు భయమేసింది. ఎంత పెద్ద నగరం అది! అయినప్పటికీ, నాకు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం ఎక్కువ. కష్టాలను ఎదుర్కోవడానికి నేను భయపడలేదు. ఒకవేళ తిరిగి ఇంటికి వెళ్తే, మళ్లీ ఇక్కడికి రావడానికి నా తల్లిదండ్రులు ఎప్పటికీ అనుమతించరని నాకు తెలుసు" అని యశ్ చెప్పారు.

హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తల్లిదండ్రులు అవకాశం ఇచ్చారని, అయితే అందులో విజయం సాధించకపోతే వారు చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉంటుందని షరతు విధించారని ఆయన చెప్పారు.

వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో తన స్నేహితుడు నంజుండ్ గురించి మాట్లాడుతూ, తనను నాటకరంగానికి పరిచయం చేసింది అతనేనన్నారు.

"అంతకుముందు నాకు పౌరాణిక నాటకాల గురించే తెలుసు. వాటిలో పాత్రలు గదలతో పోరాడుతుంటాయి. సామాజిక అంశాలతో కూడిన నాటకాల గురించి నాకు తెలియదు. నంజుండ్ ద్వారానే నాటకరంగ ప్రపంచాన్ని తెలుసుకున్నాను" అని వివరించారు.

బెంకా నాటక బృందంలో చేరిన తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని యశ్ చెప్పారు.

"నాటకరంగం నన్ను మరో వ్యక్తిగా మార్చిందని నేను భావిస్తాను. నా వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో అది కీలక పాత్ర పోషించింది" అని తెలిపారు.

అనుకోకుండా దక్కిన మొదటి సినిమా అవకాశం

2007లో విడుదలైన జంబడ హుడుగి చిత్రంలో సహాయ నటుడిగా యశ్ సినీ రంగ ప్రవేశం చేశారు. అంతకుముందు ఉత్తరన్, నంద గోకుల వంటి పలు టెలివిజన్ కార్యక్రమాల్లో నటించారు.

2004 నుంచి 2007 వరకు ప్రసారమైన నంద గోకుల టెలివిజన్ కార్యక్రమం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో యశ్, రాధికా పండిట్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2008లో విడుదలైన ‘మోగిన్న మనసు’ చిత్రం యశ్‌కు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.

ఈ సినిమాలో తనకు అవకాశం ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విషయాన్ని వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.

"ఆ పాత్రకు మొదట మరో నటుడిని ఎంపిక చేశారు. అయితే సినిమా ప్రారంభోత్సవ సమయంలో బైక్‌పై నుంచి పడిపోవడంతో ఆయనకి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌లో పాల్గొనలేకపోయారు. చిత్ర బృందానికి మరో నటుడు అవసరమయ్యాడు. చివరకు ఆ అవకాశం నాకు దక్కింది" అని యశ్ చెప్పారు.

ఆ సినిమా దర్శకుడు శశాంక్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఒక టెలివిజన్ ధారావాహికలో యశ్ నటనను చూసి తాను ఆకర్షితుడయ్యానని చెప్పారు. కొత్త నటీనటులతో మోగిన్న మనసు చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ పాత్రకు యశ్ సరిపోతాడని భావించినట్లు వివరించారు.

"ఆ పాత్రను అర్థం చేసుకోవడానికి యశ్ ఎంతో కష్టపడ్డారు. ప్రతి షాట్‌కు ముందు ఎలా చేయాలని అడిగేవాడు. ఒకే సన్నివేశానికి అనేక ప్రత్యామ్నాయాలను సూచించేవారు. ఆయనలో నటన, నృత్య నైపుణ్యాలు, అంకితభావం, పని పట్ల గౌరవం ఉన్నాయి" అని శశాంక్ తెలిపారు.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా యశ్ అందుకున్నారు.

సినీ విమర్శకురాలిగా ప్రారంభించి, ఆ తర్వాత చిత్ర నిర్మాతగా మారిన సునయన సురేశ్ అభిప్రాయం ప్రకారం.. యశ్ కెరీర్‌ను మలుపు తిప్పిన రెండు, మూడు చిత్రాలు ఉన్నాయి.

మోగిన్న మనసు ఆయనకు గుర్తింపు తీసుకురాగా, ఆ తర్వాత వచ్చిన గూగ్లీ యువతలో, ముఖ్యంగా కళాశాల విద్యార్థుల్లో ఆయనను ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా మార్చింది. ఈ చిత్రం ఆయనను స్టార్‌గా నిలబెట్టింది.

ఆ తర్వాత వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి ఆయన స్టార్‌డమ్‌ను మరింత పెంచింది. ఇందులో ఆయన భార్య రాధికా పండిట్ కూడా నటించారు. ఈ చిత్రం కన్నడ సినీ పరిశ్రమలో భారీ విజయాన్ని సాధించింది.

ఈ రెండు చిత్రాలు యశ్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించగా, కేజీఎఫ్ ఆయనకు ఇతర నటీనటులకు భిన్నమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రంతో ఆయన దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యారు.

"కేజీఎఫ్ ద్వారా హిందీ చిత్రాల మార్కెట్‌కు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి హిందీ మాట్లాడే ప్రాంతాల్లోని ప్రేక్షకులకు, వారు ఎదురుచూస్తున్న తరహా హీరోను యశ్ అందించారు" అని సునయన సురేశ్ చెప్పారు.

రావణుడి పాత్రపై యశ్ ఏమన్నారు?

రావణుడి పాత్ర పోషించడం గురించి ‘కామిక్ కాన్ 2026’లో అడిగినప్పుడు యశ్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

"ఇది చాలా సంక్లిష్టమైన పాత్ర. ప్రజలు ద్వేషించే, ప్రతి సంవత్సరం దిష్టిబొమ్మను దహనం చేసే పాత్ర గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆ పాత్ర ప్రజల మనసుల్లో ఎంత బలమైన గుర్తింపును సంపాదించుకుందో ఇది తెలియజేస్తుంది" అని ఆయన అన్నారు.

ఇప్పటికే ప్రేక్షకులకు పాత్రల గురించి తెలిసి ఉండటం, వాటిపై ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడి ఉండటం వల్ల అలాంటి పాత్రలను పోషించడం మరింత సవాలుగా మారుతుందని యశ్ చెప్పారు.

"కొత్త సినిమా తీస్తున్నప్పుడు, కొత్త కథ చెబుతున్నప్పుడు, మీరు ఆ పాత్రను ఎలా చూపిస్తే అదే దాని గుర్తింపుగా మారుతుంది. కానీ ఒక పాత్ర గురించి ప్రజలకు ఇప్పటికే ఒక అభిప్రాయం ఉండి, అనేకమంది నటులు దాన్ని విభిన్నంగా పోషించినప్పుడు, నటుడిపై అదనపు ఒత్తిడి ఉంటుంది" అని వివరించారు.

రావణుడు అలా ఎందుకు ప్రవర్తించాడు, అతడి చర్యల వెనుక ఉన్న ఆలోచన ఏమిటనే విషయాలను అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నిస్తున్నానని యశ్ చెప్పారు.

"రావణుడిని తెరపై ఆవిష్కరించడానికి ఉత్తమమైన మార్గం అతడి ఆలోచనలను, అతడు అలా ప్రవర్తించడానికి గల కారణాలను అర్థం చేసుకోవడమేనని నేను భావించాను" అని యశ్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)