‘నిండు గర్భిణి’కి సిజేరియన్ చేస్తుండగా ఆమె కడుపులో బిడ్డే లేదని గ్రహించారు

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ముహమ్మద్ జుబైర్ ఖాన్
    • హోదా, జర్నలిస్ట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ప్రసూతి వైద్య శాస్త్రంలోనే ఇదొక అరుదైన కేసు. ఓ మహిళకు కాన్పు కోసం సర్జరీ చేస్తుండగా అసలు ఆమె గర్భాశయంలో బిడ్డే లేదని వైద్యులు గుర్తించారు.

కరాచీలోని హమ్దార్ద్ ఆస్పత్రిలో 2026 ఆగస్టు 27న ఈ మహిళకు ఆపరేషన్ చేశారు. ఆ సమయానికి ఆ మహిళకు 9 నెలలు పూర్తయ్యాయని, ఆమె కుటుంబం నమ్మింది. ఆమె 38 వారాల గర్భంతో ఉన్నట్లు ఆల్ట్రాసౌండ్ రిపోర్టు కూడా వారి వద్ద ఉంది.

కానీ, సర్జరీ తర్వాత.. ఆమె కడుపులో అసలు బిడ్డే లేదని వైద్యులు ఆ మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. డెలివరీ చేయడంలో వైద్యులు విఫలమయ్యారని ఆరోపించారు.

ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తన గర్భం గురించి ఆమె అబద్ధం చెప్పినట్టుగా ఆరోపణలు వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ మహిళకు పెళ్లై 3ఏళ్లు అయ్యిందని, ఆమె కుటుంబంలోని మిగిలిన మహిళలు తల్లుల య్యారని, అందుకే తాను కూడా గర్భం దాల్చినట్టు చెప్పారని పోలీసులు తెలిపారు.

అయితే ఆ మహిళ గర్భవతో కాదో తెలుసుకోకుండానే.. ఆస్పత్రి ఆపరేషన్‌ ఎందుకు చేసిందనే ప్రశ్న కూడా తలెత్తింది.

ఆగస్టు 27న ఆ మహిళ ఆస్పత్రికి వచ్చి, తన ఆల్ట్రాసౌండ్ రిపోర్టు సమర్పించిందని హమ్దార్ద్ ఆస్పత్రి గైనకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అంజుమ్ అరా హసన్ చెప్పారు. ఆ రిపోర్టు ప్రకారం.. విధుల్లో ఉన్న డాక్టర్ వైద్య పరీక్షలు, ఇతర పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్జరీ చేయాలని నిర్ణయించారని తెలిపారు.

ఈ విషయంపై మరింత స్పష్టత కోసం ఆస్పత్రి యాజమాన్యాన్ని బీబీసీ సంప్రదించగా, సింధ్ హెల్త్‌కేర్ కమిషన్ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలని కోరారు.

గర్భాన్ని నిర్ధరించకుండా ఇలాంటి సర్జరీ చేయడానికి వీలులేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా.. వైద్యులు మొదట సాధారణ ప్రసవానికే ప్రాధాన్యత ఇస్తారు.

అయితే ఆపరేషన్‌కు ముందుగానే ఆ మహిళ గర్భవతి కాదనే విషయాన్ని డాక్టర్ ఎందుకు గుర్తించలేకపోయారని చీఫ్ పోలీస్ సర్జన్ డాక్టర్ సమీయా ప్రశ్నించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

'మహిళపై సామాజిక ఒత్తిడి'

ఈ ఘటనపై జిల్లా కేంద్ర పోలీసులు దర్యాప్తు జరిపారు. దర్యాప్తు బాధ్యతను పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖాలిద్ రఫిక్‌కు అప్పగించారు.

సర్జరీ సమయంలో ఆ మహిళ గర్భవతి కాదని వైద్య సిబ్బంది గుర్తించినప్పుడు, ఆ నిజాన్ని అంగీకరించడానికి ఆ మహిళ, ఆమె కుటుంబం సిద్ధంగా లేకపోవడంతో ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకొందని పోలీసులు చెప్పారు.

మహిళ భర్త లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన తరువాత, ఆస్పత్రిని సంప్రదించగా, "ఆపరేషన్ సమయంలో మహిళ గర్భంలో బిడ్డ లేదు" అని తమకు తెలిసిందని వైద్యులు చెప్పినట్లు ఇన్‌స్పెక్టర్ ఖాలిద్ రఫిక్ బీబీసీకి తెలిపారు.

ఈ విషయం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ కేసు దర్యాప్తు కోసం అధునాతన శాస్త్రీయ విధానాలను ఉపయోగించామని చెప్పారు.

''ఆ మహిళను ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసరంగా పరీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రి నివేదిక ప్రకారం, ఆ మహిళ ఇంతకుముందు ఎప్పుడూ గర్భం దాల్చలేదు'' అని తేలిందన్నారు.

''ఆస్పత్రి నివేదిక వచ్చిన తర్వాత కూడా ఆ మహిళ, ఆమె కుటుంబం దాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఆ తర్వాత.. అగా ఖాన్ ఆస్పత్రిలో అన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించాం'' అని చెప్పారు.

''హమ్దార్ద్ ఆస్పత్రికి చెందిన అన్ని రికార్డులను సీజ్ చేశాం. ఉద్యోగులందరి నుంచి వాంగ్ములాలను తీసుకున్నాం'' అని ఖాలిద్ రఫిక్ తెలిపారు.

పోలీసులు అన్ని టెస్టు రిపోర్టులను, ఇతర సాక్ష్యాలను పరిశీలన కోసం అగా ఖాన్ ఆసుపత్రికి పంపారు. అప్పుడు, ఆ మహిళ తాను ఎప్పుడూ గర్భవతి కాలేదని, ఈ విషయంలో అబద్ధం చెప్పానని ఒప్పుకున్నారు.

ఇదంతా చేయడానికి ఆమెపై 'సామాజిక ఒత్తిడి'నే కారణమని ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

"పెళ్లయి మూడేళ్లు అయినా పిల్లలు లేరు. కానీ, ఆమె వయసున్న ఇతర మహిళలు తల్లులయ్యారు. ఈ విషయం ఆమెను కలవరపరిచింది. అందుకే ఆమె కూడా గర్భవతి అని తన కుటుంబానికి చెప్పారు" అని ఆ మహిళ తెలిపినట్లు పోలీసులు చెప్పారు.

ఆ మహిళ గర్భం దాల్చాలని ఆశించారు. కానీ, అది జరగలేదని పోలీసులు తెలిపారు.

అయితే, దీనిపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆమె భర్త ఇప్పుడు ఆ సంఘటనను మరిచిపోయి జీవితంలో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు.

''మహిళ అబద్ధం చెప్పినప్పటికీ... ఆ నిజం వైద్యుల దృష్టికి ఎలా రాలేదు? గర్భాన్ని నిర్ధరించుకోకుండానే వైద్యులు సర్జరీ ఎలా చేశారు?'' అని ఆ కుటుంబం ప్రశ్నిస్తోందని ఖాలిద్ రఫిక్ తెలిపారు.

మహిళ భర్త ఆస్పత్రిపై ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతోంది.

"సింధ్ హెల్త్‌కేర్ కమిషన్ తగిన చర్యలు తీసుకోవచ్చు. పోలీసులు తమ పూర్తి దర్యాప్తు నివేదికను, పరిశోధనను, లభించిన సాక్ష్యాలను సింధ్ హెల్త్‌కేర్ కమిషన్‌కు పంపుతారు" అని ఖాలిద్ రఫిక్ తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఆస్పత్రి పాత్ర ఏంటి?

హమ్దార్ద్ ఆస్పత్రిలోని గైనకాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అంజుమ్ అరా హసన్ దీనిపై ఒక వీడియో ప్రకటనను విడుదల చేయగా, ఆస్పత్రి అధికార ప్రతినిధి దానిని ధృవీకరించారు.

ఆ మహిళ వైద్య రికార్డులలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్నాయని డాక్టర్ అంజుమ్ అరా హసన్ చెప్పారు.

అయితే, ఆ తర్వాత తాను గర్భవతినని చూపే మరో ఆస్పత్రికి చెందిన ఆల్ట్రాసౌండ్ రిపోర్టును ఆమె సమర్పించిందన్నారు.

అయితే, ఇది కూడా నకిలీదేనని తెలిసిందన్నారు.

ఆగస్టు 27న ఆ మహిళ అత్యవసర విభాగానికి రాగా, ఆమె ఇచ్చిన రిపోర్టు ఆధారంగా డ్యూటీలో ఉన్న డాక్టర్, సీటీజీ వంటి అవసరమైన పరీక్షలతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ చేసినట్లు డాక్టర్ అంజుమ్ ఆరా తెలిపారు. ఆ తర్వాత సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

సర్జరీ సమయంలో ఆమె గర్భవతి కాదని, గర్భంలో బిడ్డ కూడా లేదని తేలిందని డాక్టర్ అరా చెప్పారు.

అయితే, సర్జరీకి ముందు ఆస్పత్రి వారు గర్భ నిర్ధరణ పరీక్ష ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న ఇంకా అలానే మిగిలి ఉంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

సర్జరీకి ముందు ఏం చేయాలి?

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి పలువురు వైద్య నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

"ఏదైనా సర్జరీకి ముందు, సాధారణంగా రోగిని పరీక్షించి, వారి మెడికల్ హిస్టరీ తెలుసుకుంటారు. ఆ తర్వాత, సర్జరీ అవసరాన్ని, రోగ నిర్ధరణను ధ్రువీకరించేందుకు రోగి పరిస్థితికి అనుగుణంగా సంబంధిత పరీక్షలు చేస్తారు. వీటిలో రక్త పరీక్షలు, ఇమేజింగ్ లేదా ఇతర అవసరమైన పరీక్షలు ఉండవచ్చు" అని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫజల్ రబీ తెలిపారు.

సర్జరీకి ముందు, మత్తుమందు ఇవ్వడానికి రోగి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారని తెలిపారు. రక్తపోటు, పల్స్ రేటు, ఆక్సిజన్ స్థాయిలు, ఇతర కీలకమైన వాటిని పరీక్షిస్తారని అన్నారు.

పరీక్షలు అన్ని చేసిన తర్వాత.. రోగి అనుమతి తీసుకొనే సర్జరీ నిర్వహిస్తారని డాక్టర్ ఫజల్ రబీ చెప్పారు.

''ఏ రకమైన గర్భధారణలోనైనా, సాధారణ ప్రసవానికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ, కొన్ని తీవ్రమైన పరిస్థితులలో శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది'' అని చెప్పారు.

సాధారణంగా రోగిని పరీక్షించిన తర్వాత, సాధారణ ప్రసవం సాధ్యమవుతుందో లేదో వైద్యుడికి ఒక అంచనా వస్తుందని, ఆ తర్వాత నిర్ధరణ కోసం ఆల్ట్రాసౌండ్ నిర్వహిస్తారని ఆయన అన్నారు.

''సిజేరియన్ సర్జరీకి ముందు, వైద్యుడు మహిళకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా తల్లి, బిడ్డ గురించి వైద్యులకు అనేక విషయాలు తెలుస్తాయి'' అని చెప్పారు.

''వైద్యులు మహిళ పొత్తికడుపును కూడా పరీక్షిస్తారు. దీని ద్వారా గర్భాశయం పరిమాణాన్ని, శిశువు ఉన్న స్థానాన్ని, ప్రెగ్నెన్సీ మొత్తం పరిస్థితిని అంచనా వేస్తారు. శిశువు ఉనికిని, పరిస్థితిని తెలుసుకునేందుకు హృదయ స్పందనను పరిశీలిస్తారు'' అని తెలిపారు.

వైద్య పరీక్ష లేదా గత వైద్య రికార్డుల ఆధారంగా గర్భంపై ఏమైనా అనుమానం ఉంటే, వైద్యులు మరిన్ని పరీక్షలు చేయగలరని ఆయన అన్నారు.

బిడ్డ పరిస్థితిపై అనుమానం ఉన్నప్పటికీ, వైద్యులు అవసరాన్ని బట్టి ఆల్ట్రాసౌండ్ లేదా ఇతర అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారు. ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటే, అవసరమైన పరీక్షలు చేయవచ్చు.

'వైద్య వ్యవస్థలోని నిజాలు బయటపడ్డాయి’

''ఆ మహిళ గర్భవతి అని అబద్ధం చెప్పినందుకు తాను ఆందోళన చెందడం లేదని, అసలు ప్రశ్న ఏమిటంటే... సిజేరియన్ ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఆ మహిళ చెప్పిన అబద్ధం ఎలా బయటపడలేదు'' అని కరాచీ పోలీసు సర్జన్ డాక్టర్ సమీయా ఎక్స్‌లో రాశారు.

"రోగికి ఎలాంటి హాని చేయకపోవడం వైద్యంలో ఒక ప్రాథమిక సూత్రం, కానీ ఈ కేసు మన వైద్య వ్యవస్థలోని నిజాలేమిటో మరోసారి బట్టబయలు చేసింది" అని ఆమె అన్నారు.

''సిజేరియన్ సెక్షన్ అనేది కేవలం ఒక రిపోర్ట్ చూసి నిర్ణయించే ప్రక్రియ కాదు. ఇందులో వివిధ డాక్యుమెంట్లను సిద్ధం చేయడం, రోగికి వైద్య పరీక్ష నిర్వహించడం, వివిధ పరీక్షల ఫలితాలను సమీక్షించడం వంటి అనేక దశలు ఉంటాయి'' అని డాక్టర్ సమీయా వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)