ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?

  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్, జెడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

అయితే, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ప్రత్యర్థుల నామినేషన్ పత్రాలు చించేయడంవంటి ఘటనల నేపథ్యంలో గ్రామాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికల వేళ జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, జాతీయ స్థాయిలో ఎన్డీయే వ్యతిరేక పక్షాలు, నెటిజన్లు ఏపీలో జరుగుతున్న ఘటనలపై ప్రశ్నిస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం, ఏపీ పోలీసులని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వీటికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కినట్లైంది.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ గతంలో కనీవిని ఎరిగిన రీతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రభుత్వం మాత్రం గతంకంటే మెరుగ్గా ప్రక్రియ సాగుతోందని చెబుతోంది.

ఇంతకు ముందు కనీసం తమ పార్టీ నేతలకు నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితులు ఉన్నాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద అన్ని వర్గాల నుంచి విమర్శలు పెరిగాయి.

పుంగనూరు, పులివెందుల ఘర్షణలు

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన తొలిరోజే పుంగనూరు నియోజకవర్గం కేంద్రంగా ఘర్షణలు జరిగాయి. స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి తన కాన్వాయ్‌తో బారికేడ్లను ఢీ కొట్టారని, అలాగే తమను గుద్ది హత్య చేయడానికి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, కార్లను అడ్డుకొని మిథున్‌రెడ్డిపైనే హత్యాయత్నానికి టీడీపీ నేతలు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆరోజు గ్రౌండ్‌లో మిథున్‌రెడ్డి కాన్వాయ్ వాహనాలు స్పీడ్‌గా చక్కర్లు కొట్టిన విజువల్స్, అలాగే, వాటిని టీడీపీ నేతలు ధ్వంసం చేసిన విజువల్స్ రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా పుంగనూరులో నియోజకవర్గంలో చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, అక్కడ పోలీసులు ఉన్నా పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక రాయచోటి విషయానికొస్తే... వైసీపీ ఆఫీస్ ఎదుట పార్క్ చేసిన ఐదుకుపైగా కార్లను ధ్వంసం చేసిన విజువల్స్ బయటకు వచ్చాయి. కొన్ని కార్లను తగలబెట్టినట్లు ఆ వీడియోలలో కనిపించాయి. ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా అక్టోబర్ 18న ఘర్షణలు జరిగాయి. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ల కోసం వెళ్లిన వాహనాలను పోలీసులు అడ్డుకోవడం, స్వయంగా పోలీసులే ఆ వాహనాల మీద కర్రలతోటి, లాఠీలతో అద్దాలు పగలగొట్టిన విజువల్స్ బయటకు వచ్చాయి. పదుల సంఖ్యలో రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయు ప్రయోగం జరిగిందంటే అక్కడ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా... పల్నాడు, దక్షిణ కోస్తా, ఇతర రాయలసీమ జిల్లాలలో కూడా ఇలాంటి ఘర్షణలు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. పలువురు గాయపడ్డారు. చాలా చోట్ల నామినేషన్ పత్రాలను ఆందోళనకారులు, ప్రత్యర్థి పార్టీల వారు చించేసిన ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాలలో పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం, పోలీసులు కూడా అచేతనంగా ఉండిపోవడం వంటివి వీడియోలలో కనిపించాయి.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోరు: ప్రచారంలో భౌతిక దాడులు, విత్ డ్రా వివాదాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని చెప్పుకోవాలి. తిరుపతి దగ్గరలోని చంద్రగిరి, శ్రీకాళహస్తి వంటి చోట్ల ఘర్షణలు జరిగాయి. రాళ్లు విసురుకున్నారు. రక్తాలు వచ్చాయి. పల్నాడు జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి దగ్గర వాహనాలను తగలబెట్టారు. అలాగే, కలెక్టర్ ఆఫీస్ ఎదుట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటాపోటీగా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక, పులివెందులలో అంతకు ముందు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన వారి ఇళ్ల ముందు ఉన్న వాహనాలను ప్రత్యర్థులు తగలబెట్టారు. ఇంటి ముందు పగలగొట్టిన బీరు బాటిళ్లు వేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, పులివెందుల పరిధిలోని లింగాల మండలంలో నామినేషన్ వేయడానికి వైసీపీ నేతలను స్వయంగా పోలీసులే అడ్డగించి కంచెలు వేసిన దృశ్యాలను బీబీసీ ప్రత్యక్షంగా చూసింది. ముగ్గురు వస్తే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు మాత్రమే వెళ్తే తమపై దాడి జరుగుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. మరోవైపు టీడీపీ వారిని మాత్రం 30 మందికిపైగా వెళ్లడానికి అదే పోలీసులు అనుమతించారు. దాని గురించి బీబీసీ ప్రశ్నించినప్పుడు పోలీసులు మాట్లాడటానికి నిరాకరించారు.

పల్నాడులో జిల్లాలో నరసరావుపేట, పిడుగురాళ్ల, మాచర్ల, రొంపిచర్ల తదితర ప్రాంతాల్లో పరస్పర దాడులు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ వేసిన వైసీపీ నాయకుల పత్రాలను ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా చేశారని... అక్కడ 60 వార్డులు ఉంటే 58 వార్డుల్లో నామినేషన్ పత్రాలు విత్‌డ్రా చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో, దీనిపై ఆ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో మున్ముందు ఇలాంటివి జరకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. అలాగే, ఘర్షణలు జరిగిన చోట కేసులు నమోదు చేశామని వారు తెలిపారు.

గతానికీ, ఇప్పటికీ తేడా ఏంటి? ఇరు వర్గాల పరస్పర ఆరోపణలు..

మరోవైపు ఈ ఘర్షణపై వైసీపీ, టీడీపీ నేతలతో బీబీసీ మాట్లాడింది. పులివెందులలో ఇలాంటి ఘర్షణలు జరగటం ఇదే మొదటిసారి కాదని, కొన్ని దశాబ్దాలుగా ఇది మాకు అనుభవమేనని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

"గతంలోనూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైసీపీ ఎన్నో అరాచకాలు చేసింది. మమ్మల్ని కనీసం రోడ్ల మీద కూడా తిరగనివ్వలేదు. వారి హయాంతో పోల్చితే.. ఇప్పుడు వారు కనీసం నామినేషన్లు అయినా వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు" అని రామగోపాల్ రెడ్డి అన్నారు.

అయితే, వైసీపీ నేతల వాదన మరోలా ఉంది.

"గతంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను ఇంతలా నిర్బంధించలేదు. నామినేషన్లు కాదు కదా.. ఇప్పుడు కనీసం బయటకు వచ్చే పరిస్థితి లేదు. అసలు యుద్ధం టీడీపీ వాళ్లతో కాదు, పోలీసులతో ఉన్నట్లుగా ఉంది" అని మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ చవ్వాద్ దుష్వంత్ రెడ్డి బీబీసీతో అన్నారు.

మరోవైపు పుంగనూరులో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పుంగనూరులోని చౌడేపల్లి మండలం బోయికొండకు చెందిన భూదేవి భర్త వైసీపీ తరఫున ఎంపీటీసీగా నామినేషన్ వేశారు.

"ఇక్కడ గంగమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులకు గదులను అద్దెకు ఇచ్చుకుంటాను. అయితే, నా భర్త నామినేషన్ వేశారనే కోపంతో టీడీపీ నేతలు మా ఈ గెస్ట్ హౌస్ లాంటి నిర్మాణాన్ని కూల్చేశారు. ఇంత పగ, టీడీపీ వాళ్లకు కాకపోతే ఎవరికి ఉంటుంది" అని భూదేవి బీబీసీతో అన్నారు.

ఇది ఇలా ఉంటే.... మరోవైపు అదే పుంగనూరు నియోజకవర్గ పరిధిలో... తమ నాయకుడి కారును వైసీపీ వారు తగలబెట్టేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల సమయంలో మొదలైన ఘర్షణ వాతావరణం ఆ తరువాత కూడా కొనసాగుతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. సదుం మండలంలో అయితే దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నట్టు స్థానిక పాత్రికేయులు కొందరు బీబీసీకి చెప్పారు.

''మా ఎంపీ మిథున్ గారిని రాళ్లు కర్రలతో అడ్డగించి, దౌర్జన్యం చేసి గో బ్యాక్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఇక నామినేషన్ సెంటర్ బయట ఒక 20 మంది గుంపు చేరుకొని నా నామినేషన్ లాక్కెళ్లిపోయారు. నా చొక్కా చింపేశారు. మా భార్య చైర్మన్ అభ్యర్థిగా నేను 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఈ రెండు నామినేషన్లు తీసుకొని అక్కడికి వెళ్లాను. పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారు నా పత్రాలు లాక్కుని మమ్మల్ని గెంటేశారు. వెళ్లిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారు'' అని బీబీసీకి చెప్పారు వైఎస్సార్సీపీకి చెందిన నయాజ్.

2021లో పరిస్థితులు ఎలా ఉండేవి?

2021 నాటి పరిస్థితుల గురించి ప్రశ్నించినప్పుడు,

''అక్కడక్కడ లోకల్ క్యాండిడేట్స్‌లో వాళ్ల వాళ్ల స్థానిక గొడవల వల్ల ఆపి ఉండొచ్చు. కొన్ని చోట్ల జరిగాయేమో కానీ, అన్నిచోట్లా జరిగాయని చెప్పలేం. కొన్ని చోట్ల వాళ్లని అడ్డగించినారు. కానీ ఈసారి వీళ్లు చేసింది మాత్రం ప్రజాసామ్యానికే వ్యతిరేకం'' అన్నారాయన.

తెలుగుదేశం వారి వాదన మరోలా ఉంది.

''2005 నుండి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ నియోజక వర్గానికి వచ్చినప్పటి నుంచీ టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాకూడదు. నామినేషన్లు వేయకూడదు అనే పద్ధతి మొదలైంది. సదుం మండలంలో 2005 తరువాత ఇప్పటి వరకు టీడీపీ నామినేషన్లు పడిన దాఖలాలు లేవు. 2021లో ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడా నామినేషన్లు వేయనీలేదు. కొట్టి కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. భూములకు దారులు లేకుండా చేస్తారు. వన్ బీ పట్టా రాకుండా చేస్తారు. 2021లో 86 పంచాయతీలు ఉంటే 86 పంచాయతీల్లో మాకు సర్పంచ్ అభ్యర్థులు లేకుండా పోయారా? ఒక్కచోట కూడా మాకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులే లేరా? అందర్నీ భయపెట్టారు. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా.. అన్నట్టు వాళ్లు నేర్పించిందే ఇది. దాదాపు 475 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి కడప జైల్లో 55 రోజులు పెట్టారు. 2021లో మమ్మల్ని కనీసం ఇంటిలో నుంచి బయటకు కూడా రానీలేదు. ఇప్పుడు మీరు కనీసం నామినేషన్లు వేస్కోగలుగుతున్నారు. నా ఒక్కడి మీదే 12 ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టారు అంటే పరిస్థితి అర్థం చేసుకోండి'' అని బీబీసీతో అన్నారు సోమల ఏఎంసీ అధ్యక్షులు కె.శ్రీనివాసులు నాయుడు.

2021లో పుంగనూరులో ఇటువంటి ఘటనలు జరిగాయి. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థి అంజిరెడ్డి నుంచి పత్రాలు లాక్కోవాలని చూస్తే ఆయన తొడగొట్టిన దృశ్యాలు వైరల్ కాగా, స్వయంగా లోకేశ్, చంద్రబాబులు ఆయనతో మాట్లాడారు, మహానాడుకు పిలిచారు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక రకంగా పోస్టర్ బాయ్ గా మారిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఆయన వీడియోను టీడీపీ ఉపయోగించుకుంది. 2021లోనే తెలుగుదేశం ఈ ఏకగ్రీవాలపై హైకోర్టుకు వెళ్ళింది. 87 పంచాయతీలలో 85 పంచాయతీలు ఏకగ్రీవం చేయడం వెనుక, ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమ కేసులు ఉన్నాయని అప్పటి టీడీపీ ఇంచార్జి అనీషా రెడ్డి కోర్టుకు వెళ్ళారు.

‘‘2021లో అంజిరెడ్డి ఉదంతం నుంచి చూసినా, ఆ ఏడాది ఇక్కడ ఉన్న 98 - 99% పంచాయతీలే ఏకగ్రీవం అయ్యాయి. ఏ నియోజకవర్గంలోనూ అలా జరిగే అవకాశం లేదు కదా? 2021 లో ఏమైందంటే తెలుగు దేశం క్యాడర్ ఈ ఏకగ్రీవాలను ధిక్కరించ లేకపోయింది. కేసులకు భయపడో, మరో కారణం మనకి తెలియదు కానీ, వాళ్లు పెద్దగా రెసిస్ట్ చేయలేదు. దీంతో 2021 లో వైఎస్సార్సీపీ పెద్ద మొత్తంలో ఏకగ్రీవాలు చేయగలిగారు. ఇప్పుడు 2026లో అలాగే ఏకగ్రీవాలు చేయాలని తెలుగుదేశం ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ వైఎస్సార్సీపీ వాళ్లు గట్టిగా ధిక్కరించి, రెసిస్ట్ చేసే ప్రయత్నం చేయడంతో అది ఘర్షణలకు దారి తీసింది'' అని బీబీసీతో చెప్పారు పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానిక పాత్రికేయులు.

ఎస్‌ఈసీ ముందుకు వినతులు..

ఈ మొత్తం వ్యవహారంపై ఒక దశలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలిపి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల అడ్డంకులపై ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేతకు వినతిపత్రం సమర్పించారు.

మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోరులోనూ అక్రమాలు కొనసాగుతున్నాయని, తమ అభ్యర్థులను గృహ నిర్బంధాలు, భౌతిక దాడులు, నామినేషన్ పత్రాల చించివేతలతో అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.

అభ్యర్థుల రక్షణపై సుప్రీంకోర్టు ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఎస్‌ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోతే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. బెదిరింపులు, అపహరణల ద్వారా ఏకగ్రీవాలను బలవంతంగా చేయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు.

అభ్యర్థులకు భద్రత, సీసీటీవీ నిఘా, పక్షపాత అధికారులపై చర్యలు డిమాండ్ చేస్తూ, స్థానిక పోరు స్వేచ్ఛగా జరిగే వరకు తమ రాజకీయ, న్యాయపోరాటం కొనసాగుతుందని నేతలు వెల్లడించారు.

‘‘13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు’’

నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైఎస్సార్సీపీ ఫేక్ ప్రచారం చేసిందని టీడీపీ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కంటే ఎక్కువ నామినేషన్లు వైఎస్సార్సీసీ దాఖలు చేసిందని ఆ పార్టీ అంటోంది. గత పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు జరిగాయనీ, నాడు జరిగిన పట్టణ స్థానిక సంస్థల్లో 20.72 శాతం, గ్రామీణ స్థానిక సంస్థల్లో 24 శాతం మేర ఎంపీటీసీ స్థానాలు, 19 శాతం మేర జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా బలవంతంగా వైఎస్సార్సీపీ తీసుకుందనీ తాము అలా చేయడం లేదనీ తెలుగుదేశం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

దీనిపై అక్టోబరు 22న డీజీపీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ''ఎన్నికల ప్రక్రియను భంగపరచాలన్నా, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లను అడ్డుకోవాలని చూసినా పోలీసు యంత్రాంగం నిష్పాక్షికంగా, అత్యంత కఠినంగా అణచివేస్తుందని డీజీపీ హెచ్చరించారు'' అని ఆ ప్రకటనలో రాశారు.

''నామినేషన్ల దాఖలు సందర్భంగా 13 జిల్లాల్లో 31 ఎన్నికల సంబంధిత ఘటనలు నమోదయ్యాయి. అందులో 22 ఘటనలు నేరుగా శాంతిభద్రతలకు విఘాతం, ఘర్షణలు, హింసకు సంబంధించినవి కాగా, 9 ఘటనలు నామినేషన్ పత్రాలను లాక్కోవడం లేదా చించివేయడానికి సంబంధించినవి'' అని ఆ ప్రకటన పేర్కొంది.

''రాళ్లు రువ్వినా, ఆస్తులు ధ్వంసం చేసినా, పోలీసులపై దాడి చేసినా సహించేది లేదని డీజీపీ హెచ్చరించారు. తెరవెనుక ఉండి గుంపులను సమీకరించిన, రెచ్చగొట్టిన సూత్రధారులను కూడా అరెస్టు చేస్తామని, రాజకీయ పలుకుబడి రక్షణ ఇవ్వదని తేల్చిచెప్పారు'' అని ప్రకటనలో పేర్కొంది డీజీపీ కార్యాలయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)