‘పోర్న్ వీడియోలకు బానిసై అత్యాచారం చేశాడు’.. నర్సు హత్య కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

తెలంగాణ పోలీస్

ఫొటో సోర్స్, UGC

(ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి దారుణ హత్యకు గురయ్యారని హైదరాబాద్ పోలీసులు చెప్పారు.

నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు శంషాబాద్ డీసీపీ బి.రాజేశ్ తెలిపారు.

''నిందితుడు యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అయినప్పటికీ అత్యాచారానికి పాల్పడ్డాడు'' అని డీసీపీ చెప్పారు.

హైదరాబాద్ శివారులో జరిగిన ఈ దారుణ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది.

ఈ నేరానికి సంబంధించి బిహార్‌కు చెందిన మొహమ్మద్ సనావుల్లాను పోలీసులు అరెస్టు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి హాస్టల్‌లో ఆగస్ట్ 29న మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో ఓ యువతి (21) మృతదేహం ఉందని పహాడీ షరీఫ్ పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని డీసీపీ రాజేశ్ చెప్పారు.

'ప్రైమ్ కేర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న నర్సుల హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది. యువతి ముఖం, తలపై రక్తంతో గాయాలు ఉన్నాయి. దాంతో హత్యగా నిర్ధరించుకుని కేసు నమోదు చేశాం' అని చెప్పారాయన.

అంతకుముందు రోజు ఆగస్ట్ 28 రాత్రి 10.30గంటల వరకు యువతి తన బంధువులతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మరుసటి రోజు ఉదయం బంధువులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మహేశ్వరంలో ఉండే బంధువు ఒకరు వచ్చి తోటి ఉద్యోగులు, నర్సుల సాయంతో పక్కనే ఉన్న మరో కిటికీ నుంచి చూడగా చనిపోయి ఉందని గుర్తించి, తమకు సమాచారం అందించారని పోలీసులు చెబుతున్నారు.

అత్యాచారం

ఫొటో సోర్స్, HydCityPolice

'పోర్న్ వీడియోలు, ఫొటోలకు బానిసై…'

యువతి ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చినట్లు, తలపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని డీసీపీ వివరించారు.

'హత్య జరిగిన ప్రదేశం సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించి, నలుగురైదుగురు అనుమానితులను గుర్తించాం. వారిలో నిందితుడు మొహమ్మద్ సనావుల్లా కూడా ఉన్నాడు. నర్సు ఉండే హాస్టల్ సమీపంలోని భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తూ అతను అక్కడే ఉంటున్నాడు' అని డీసీపీ చెప్పారు.

రెండు, మూడు నెలల నుంచి అతను అక్కడ పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

'మద్యం, పోర్న్ వీడియోలు, ఫొటోలకు బానిస అయ్యాడు సనావుల్లా. నెల రోజులుగా యువతి కదలికలను గమనిస్తూ వచ్చాడు. కొందరు యువతుల ఫొటోలు కూడా తీశాడు. ఆగస్ట్ 28న ఆ యువతితోపాటు గదిలో ఉండే మరో స్నేహితురాలు పండుగకు ఊరెళ్లింది. దీంతో సదరు యువతి ఒంటరిగా ఉన్నట్లు సనావుల్లా గమనించి, ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలింది' అని డీసీపీ చెప్పారు.

హాస్టల్ గది కిటికీ.. బైక్ మెకానిక్ షాపు వెనుక వైపు ఉండే కిటికీ నుంచి కనిపిస్తుంటుందని పోలీసులు తెలిపారు.

హత్య కేసు

ఫొటో సోర్స్, UGC

'కిటికీలోంచి ప్రవేశించి...'

హాస్టల్ గది కిటికీకీ గ్రిల్స్ లేకపోవడంతో అందులోనుంచే సనావుల్లా ప్రవేశించినట్లు డీసీపీ చెప్పారు.

'అర్ధరాత్రి 12-2 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. అతను లోపలకు రావడంతో యువతి కేకలు వేసింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో నిందితుడు సనావుల్లా ఆమెను కొట్టగా.. అపస్మారక స్థితిలోకి చేరుకుంది. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు సనావుల్లా విచారణలో చెప్పాడు' అని డీసీపీ రాజేశ్ చెప్పారు.

ఘటన జరిగిన సమయంలో సనావుల్లా మద్యం తాగి ఉన్నట్లు విచారణలో తేలిందని, నేరానికి పాల్పడిన తర్వాత అదే కిటికీ నుంచి సనావుల్లా వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

కేసు తదుపరి విచారణ కోసం సనావుల్లాను కస్టడీలోకి తీసుకుంటామని, వేగంగా దర్యాప్తు పూర్తి చేస్తామని డీసీపీ చెప్పారు.

మృతురాలిది కొత్తగూడెం జిల్లా అని పోలీసులు తెలిపారు.

పోలీసు విచారణ, సీసీటీవీ

ఫొటో సోర్స్, UGC

'నిందితుడికి శిక్ష పడాలి'

సనావుల్లాది బిహార్‌లోని బెగుసరాయ్ ప్రాంతం అని ఇన్‌స్పెక్టర్ కె.లక్ష్మీనారాయణ రెడ్డి బీబీసీతో చెప్పారు.

'2023లో నుంచి బిహార్ నుంచి హైదరాబాద్ వలస వచ్చాడు. ఉప్పల్ సహా వివిధ ప్రాంతాల్లో బైక్ మెకానిక్ పనులు చేశాడు. కొన్ని నెలల కిందటే తుక్కుగూడకు వచ్చి బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు'' అని చెప్పారు.

సనావుల్లాకు భార్య, కుమారుడు ఉన్నారని.. భార్య మరోసారి గర్భవతి కావడంతో బిహార్ వెళ్లారని లక్ష్మీనారాయణ రెడ్డి చెప్పారు.

ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకులతో బీబీసీ మాట్లాడింది.

'మా అమ్మాయి చనిపోయింది. మేం బాధలో ఉన్నాం. ప్రస్తుతం ఏం మాట్లాడదలచుకోలేదు. నిందితుడికి కఠిన శిక్షపడాలి' అని ఆమె కుటుంబ సభ్యులొకరు బీబీసీతో చెప్పారు.

ఈ ఘటనపై సనావుల్లా కుటుంబీకుల స్పందన కోసం ప్రయత్నిస్తున్నాం. వారు అందుబాటులోకి రాగానే అప్డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)