హైదరాబాద్: మద్రాస్ రెజిమెంట్‌లో 'ఆయుధాలు చోరీ' – బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్మీ అధికారులు

ఫొటో సోర్స్, UGC
ఆర్మీకి చెందిన ఆయుధాలు చోరీకి గురైనట్లుగా హైదరాబాద్‌లోని బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్రాస్ రెజిమెంట్‌లో ఆగస్ట్ 30 రాత్రి పెద్ద ఎత్తున ఆయుధాలు చోరీకి గురయ్యాయని రెజిమెంట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆర్మీ అధికారులు కూడా దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని అత్యంత భద్రత మధ్య ఉండే రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ వ్యవహారం బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
దీనిపై స్పందించేందుకు అటు ఆర్మీ అధికారులు గాని, పోలీసులు గాని ఇష్టపడటం లేదు.

బొల్లారం పీఎస్‌లో నమోదైన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని బీబీసీ పరిశీలించింది.
దీని ప్రకారం ఆయుధాల చోరీ ఘటనపై ఆగస్టు 31న కేసు నమోదు చేశారు బొల్లారం పోలీసులు.
ఆగస్ట్ 31న ఉదయం 8 గంటల ప్రాంతంలో చోరీ వ్యవహారం బయటపడిందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు.
ఎప్పుడు జరిగింది?
‘‘కోటే (ఆయుధాగారం), బెటాలియన్ మ్యాగజీన్ (మందుగుండు సామగ్రి నిల్వ చేసే ప్రాంతం) తాళాలు పగలుగొట్టి ఉన్నాయి. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కనిపించలేదు. స్టోర్, లోపలి బాక్సుల తాళాలు పూర్తిగా పగలుగొట్టి ఉన్నాయి’’ అని మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిత్రికర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు, నాలుగు ఏకే 20౩ రైఫిల్స్, ఐదు మ్యాగజైన్స్, ఇన్సాస్ 1బీ1 – 3 మ్యాగజైన్స్, ఆరు 9ఎంఎం పిస్టల్స్- 12 మ్యాగజైన్స్, బోర్ పిస్టల్ – ఒక మ్యాగజైన్, నైట్ విజన్ బైనాక్యులర్, 9ఎంఎం పిస్టల్ బుల్లెట్లు 1120 (మరో 36 బుల్లెట్ల వివరాలు తెలియాల్సి ఉంది), ఏకే 203 బుల్లెట్లు 720, ఇన్సాస్ కోసం వాడే మందుగుండు సామగ్రి చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ.15లక్షలు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
‘‘ఆగస్ట్ 30న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆయుధాగారం మూసివేసే సమయంలో ఈ ఆయుధాలు, మందు గుండు సామగ్రి ఉన్నాయి. చోరీ జరిగిన కచ్చితమైన సమయం తెలియడం లేదు’’ అని లెఫ్టినెంట్ కల్నల్ తన ఫిర్యాదులో తెలిపారు.
చోరీ ఘటన బయటకు రావడంతో ఆర్మీలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ముఖ్యంగా మద్రాస్ రెజిమెంట్ సహా ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
చోరీ ఘటనపై మద్రాస్ రెజిమెంట్ లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవిత్రికర్‌ను బీబీసీ సంప్రదించగా.. ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు.
చోరీకి గురైన వాటిలో ఏకే 203 అనే రైఫిల్ రష్యా, భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది సుమారు 3.8 కిలోల బరువు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
ఆర్మీ అధికారుల అంతర్గత విచారణ
చోరీ ఘటన బయటకు రావడంతో తాము కూడా విచారణ చేపట్టామని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
‘‘ఆయుధాలు, మందు గుండు సామగ్రి వివరాలు సమగ్రంగా తిరిగి ధ్రువీకరించుకున్నాం. ఇతర ఆయుధాగారాలు, సమీపంలోని ఇతర ప్రాంగణాలనూ పరిశీలించాం. అన్ని రికార్డులూ పరిశీలించాం. ఆయుధాగారాల్లోకి అనుమతి ఉన్న వ్యక్తులను విచారించాం. ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. అంతర్గతంగా సమగ్ర విచారణ చేపట్టాం’’ అని చెప్పారు.
ఘటనపై బీఎన్ఎస్ సెక్షన్ 331(4), 305 కింద కేసు నమోదు చేశారు బొల్లారం పోలీసులు.
దీనిపై బొల్లారం ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నారాయణ రాజును బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
ఈ వ్యవహారంపై ఆర్మీ రిటైర్డ్ మేజర్ పీటీ చౌదరి బీబీసీతో మాట్లాడారు.
ఘటనపై ఆర్మీ తరఫున 'కోర్టు ఆఫ్ ఎంక్వయిరీ' నడుస్తున్నట్లుగా తెలిసిందని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.
మద్రాస్ రెజిమెంట్ అంటే ఏంటి?
మద్రాస్ రెజిమెంట్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. దీన్ని బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేశారు.
మద్రాస్ రెజిమెంట్ భారత్‌లో అతి పురాతన రెజిమెంట్లలో ఒకటని, దీన్ని 1750లలో ఏర్పాటు చేశారని భారత ఆర్మీ రిటైర్డ్ మేజర్ పీటీ చౌదరి బీబీసీతో చెప్పారు.
భారత్‌లో రెజిమెంట్స్ అనేవి వాటి పేర్ల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. మద్రాస్ పేరుతో ఉన్నప్పటికీ మద్రాస్ రెజిమెంట్ అనేది హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కొనసాగుతోంది.
ఒక్కో రెజిమెంట్ పరిధిలో 800-1000 మంది సైనికులు, అధికారులు ఉంటారని ఆయన చెప్పారు.
రెజిమెంట్‌లో భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుందని, 24 గంటల నిరంతర నిఘా ఉంటుందని పీటీ చౌదరి వివరించారు. అంత భద్రత ఉన్న ప్రాంతంలో ఆయుధాలు చోరీకి గురికావడం కొంత ఆశ్చర్యంగానే ఉందని ఆయనన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























