గ్లోబల్ వార్మింగ్‌కు నేపాల్ కారణం కాదు.. అయినా విపత్తులతో ఎందుకు నష్టపోతోంది?

ఫొటో సోర్స్, PRAKASH MATHEMA / AFP via Getty Images
వాతావరణ సంక్షోభానికి నేపాల్ తీవ్రంగా ప్రభావితమైంది. వరదలు, మంచు చరియలు విరిగిపడటం, కార్చిచ్చులు, కరవులు వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్న దేశాల్లో ఇది ఒకటి.
అయితే, తమకెలాంటి పాత్ర లేని ఈ వాతావరణ సంక్షోభంలో, తాము బాధితులుగా మారామని నేపాల్ చెబుతోంది.
ఈ వాదనకు మద్దతుగా.. ప్రపంచ గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో తన వాటాను నేపాల్ తరచూ ప్రస్తావిస్తోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. నేపాల్‌లో 0.05 శాతం కంటే తక్కువ గ్రీన్‌హౌస్ ఉద్గారాలు వెలువడుతున్నట్లు వెల్లడైంది.
గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణం గ్రీన్‌హౌస్ గ్యాస్‌లే.
అయితే, ముఖ్యంగా నేపాల్-చైనా సరిహద్దు వెంబడి సంభవించే భారీ ఆకస్మిక వరదలు, మంచు చరియలు విరిగిపడటం విపత్తుల కారణంగా నేపాల్ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

నేపాల్ సుమారు 3 కోట్ల జనాభా కలిగిన ఒక పర్వత ప్రాంత దేశం. నేపాల్‌కు సరిహద్దుగా ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు ఉన్నాయి. అందులో ఒకటైన చైనా ఉత్తరాన ఉండగా.. రెండో దేశం భారత్ తూర్పు, పశ్చిమ, దక్షిణ సరిహద్దుల్లో ఉంది.
''నేపాల్‌లోని ప్రజలు వారు తయారు చేయని విషాన్ని తాగాల్సి వస్తుందనే నానుడి ఎప్పట్నుంచో ఉంది. ప్రపంచ కర్బన్ ఉద్గారాల్లో నేపాల్ వాటా 0.05 శాతం కంటే తక్కువనే'' అని బీబీసీ ప్రతినిధి నవీన్ సింగ్ ఖాడ్కా చెప్పారు.
అంటే దీనర్థం.. ప్రపంచ భూతాపంలో నేపాల్ పాత్ర చాలా తక్కువ అయినప్పటికీ.. దాని దుష్ఫ్రభావాలను మాత్రం అనుభవించాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Ambir Tolang/NurPhoto via Getty Images
గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం
పుష్కలమైన నీటి వనరులు కారణంగా.. నేపాల్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్ అంతా దాదాపు హైడ్రోఎలక్ట్రిసిటీ నుంచే వస్తోంది. ఇది ప్రాథమికంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని హిమానీ నదాల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడుతుందని నవీన్ సింగ్ ఖాడ్కా తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిలోనూ నేపాల్ చాలా ముందుందని ఆయన చెప్పారు.
సోలార్, విండ్ ఎనర్జీ వంటి ఇతర స్వచ్ఛ ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచేందుకు నేపాల్ ప్రయత్నిస్తోంది.
అంతేకాక.. నేపాల్ తన భూభాగంలో 46 శాతానికి పైగా అడవులను సంరక్షించిందని, ఇవి కర్బన శోషకాలుగా(కార్బన్ సింక్)లుగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.
అంటే గాలిలో (వాతావరణం) నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను ఎక్కువగా పీల్చుకునే ప్రకృతి వ్యవస్థను కార్బన్ సింక్‌గా వ్యవహరిస్తారు. తాము వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేయమని, బదులుగా దానిని వాతావరణం నుంచి గ్రహిస్తామని నేపాల్ చెబుతోంది.
వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం చేస్తోన్న ప్రయత్నాలలో ఈ అడవులే ఒక కీలకమైన సాధనం.
"ఈ నేపథ్యంలో వరదలు, కార్చిచ్చులు, మంచు చరియలు విరిగిపడటం లేదా కరువు వంటి వాటి వల్ల ప్రభావితమై నేపాల్‌లో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. ఇది పర్యావరణ అన్యాయం తప్ప న్యాయం కాదని నేపాల్ ప్రజలు అంటున్నారు"అని నవీన్ సింగ్ ఖాడ్కా తెలిపారు.

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
ఆగని విపత్తులు
ఒకవైపు నేపాల్ వాతావరణ మార్పుల దుష్ప్రభావాలకు గురవుతుండగా, మరోవైపు దాని భౌగోళిక స్థానం కూడా దానిని ఎల్లప్పుడూ ప్రమాదానికి దగ్గరగా ఉంచుతోంది.
నేపాల్-చైనా సరిహద్దు గుండా ఉన్న హిమాలయ ప్రాంతంలోని భౌగోళిక నిర్మాణం కూడా దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక, గ్లేసియర్ లేక్స్ పరిస్థితుల్లో మార్పులు కూడా ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.
వాస్తవానికి టిబెట్ ప్రాంతంలో చాలా గ్లేసియర్ లేక్స్ ఉన్నాయి. నేపాల్ వైపుగా వాలు ఉన్న ప్రాంతంలో చాలా నివాస ప్రాంతాలు ఉండటం వల్ల.. ఈ సరస్సులు ఉప్పొంగడం, మంచు చరియలు విరిగిపడటం వల్ల పెద్ద మొత్తంలో నష్టం కలిగే అవకాశం ఉంటుంది.
రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలు, గ్లేసియర్ లేక్స్ కదలికలు, మంచు చరియలు విరిగిపడటం పెద్ద మొత్తంలో నీటిని, మట్టి దిబ్బలను, రాళ్లను తక్కువ సమయంలోనే తీర ప్రాంతాలకు కొట్టుకొచ్చేలా చేస్తున్నాయి.
హిమనీ నదం విరగడంతో చాలా వేగంగా మంచు కరిగి ఆగస్టు 26 ఈ ప్రమాదానికి కారణమైందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
''హిమాలయ పర్వత శ్రేణుల కింద చాలా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులు పర్వతాలపై జరిగే పరిణామాలను కిందకి తీసుకొని వస్తుంటాయి. కొన్నిసార్లు అవి భారత్, బంగ్లాదేశ్ కూడా చేరుకుంటాయి'' అని నవీన్ సింగ్ ఖాడ్కా తెలిపారు.
''అంతేకాక, నేపాల్ తరచూ భూకంపాలకు ప్రభావితమవుతోంది. 2015 భూకంపం అయితే తీవ్ర విధ్వంసాన్నే సృష్టించింది. కానీ, దానికి మించి, హిమాలయ ప్రాంతంలో ప్రతి రోజూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది'' అని చెప్పారు.
''ఈ ప్రకంపనలు పర్వతాలను బలహీనపరుస్తున్నాయి. వాతావరణ మార్పు హిమనీ నదాలు కరిగేందుకు కారణమవుతోంది. ఇదే మంచు పర్వతాలకు ఒక సిమెంట్‌లాగా పనిచేసి, వాటిని కలిపి ఉంచుతుంది'' అని శాస్త్రవేత్తలు తెలిపారు.

అందువల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్వతాల పరస్పర పట్టు లేదా బలం తగ్గుతోంది. ఇది తరచూ వర్షాకాలంలో మంచు చరియలు విరిగిపడటం రూపంలో కనిపిస్తుంటోంది.
2024వ సంవత్సరంలో కూడా నేపాల్‌లో వరదలు, మంచు చరియలు విరిగిపడటం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు.
2023వ సంవత్సరంలో దేశంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి.
2021లో కూడా నేపాల్‌లో మంచు చరియలు విరిగిపడటం, వరదల కారణంగా అనేక మంది మరణించారు.
2020, 2019, 2017, 2016 సంవత్సరాలలో నేపాల్‌లో కూడా మంచు చరియలు విరిగిపడిన సంఘటనలు నెలకొన్నాయి.
నేపాల్‌లో ఇలాంటి విపత్తులు సర్వసాధారణం అయిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Arun SANKAR / AFP via Getty Images
రాజకీయ అస్థిరతతో నష్టం
దీర్ఘకాలంగా నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా, వాతావరణ మార్పుల వల్ల కలిగే కొన్ని అనివార్య ప్రభావాలను ఎదుర్కోవడానికి నేపాల్ చేయగలిగినంతగా చేయలేకపోయిందని నవీన్ సింగ్ ఖాడ్కా అన్నారు.
అభివృద్ధి చెందిన దేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వాతావరణ మార్పులకు అనుగుణంగా తనను తాను మలుచుకునేందుకు గత కొన్నేళ్లలో నేపాల్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందాయని చెప్పారు.
''అయితే, క్షేత్రస్థాయిలో అవసరమైన కమ్యూనిటీలకు ఇది అందలేదు'' అని విమర్శకులు అంటున్నారు.
''నేపాల్‌లో ఇటీవల ఈ ప్రమాదం జరిగినప్పుడు, పర్వత ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక సైరన్‌లు లాంటివి లేవు. రెండు మూడు నెలల క్రితం ఎవరెస్ట్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశంలో చాలా ప్రమాదకరమైన సరస్సు ఉందని మేం ఒక వార్తలో రిపోర్ట్ చేశాం. కానీ, అక్కడి హెచ్చరిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా పనిచేయడం లేదు'' అని నవీన్ సింగ్ ఖాడ్కా తెలిపారు.
విపత్తులకు నేపాల్ సన్నద్ధమయ్యే తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. నేపాల్ ప్రభుత్వాల అస్థిరత్వం కూడా ఒక కారణంగా నిలుస్తోంది.
"రాజకీయ స్థిరత్వం లేకపోవడం వల్ల, నేపాల్‌లో రూపొందించాల్సిన విధానాలను లేదా ప్రణాళికలను రూపొందించడం సాధ్యపడటం లేదు" అని నవీన్ సింగ్ ఖాడ్కా చెప్పారు.
రాజకీయ అస్థిరత కారణంగా దేశంలోని కీలక ప్రభుత్వ పదవులలో తరచూ మార్పులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఏ స్థిరమైన విధానానికి లేదా ప్రణాళికకు మంచిదిగా పరిగణించడం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































