బీర్ ట్రక్కు చోరీ: దొంగలకు డెడ్‌లైన్ ప్రకటించిన తయారీ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్వాసీ గ్యాంఫీ అసైదు
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
కాలిఫోర్నియాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి దొంగిలించిన తమ బీర్ క్యాన్ల ట్రక్కును గుర్తించడంలో సాయం చేయాలని పాబ్స్ట్ బ్లూ రిబ్బన్ (పీబీఆర్) బీర్ తయారీ సంస్థ సోషల్ మీడియాను ఆశ్రయించింది.
ఆ బీర్లను ఎవరో దొంగిలించారని కంపెనీ ప్రకటించింది.
"దొంగకు: మీ దగ్గర మా కంపెనీ బీర్లు చాలా ఉన్నాయని మీ స్నేహితులకు మీరు గొప్పగా చెప్పుకోవాలనుకోవడాన్ని మేం తప్పుబట్టడం లేదు. కానీ మీరు దాన్ని గౌరవప్రదమైన మార్గంలో సంపాదించి ఉంటే బాగుండేదని మాత్రమే కోరుకుంటున్నాం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెసేజ్‌లో దొంగలను ఉద్దేశిస్తూ రాసింది.
బీర్ క్యాన్‌లు దొంగతనం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దొంగ, మాంట్‌క్లేర్‌లోని ఎన్‌హైజర్-బుష్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తప్పుడు పత్రాలు సమర్పించారని పోలీసులు తెలిపారు.
శాండియాగోకు వెళ్లాల్సిన దాదాపు 25 వేల డాలర్ల ( సుమారు రూ. 24 లక్షల) విలువైన సరుకును చోరీ చేసుకెళ్లారని పోలీసులు చెప్పారు.

ఈ చోరీ విషయంలో తాము చాలా సీరియస్‌గా ఉన్నామని పీబీఆర్ చెప్పింది. 18,144 కేజీల బరువున్న బీర్ కేసులను కనుక్కోవడంలో సాయపడే వారికి బహుమతి ప్రకటించింది.
ఆ పంపిణీ కేంద్రంలో ఆ రోజు ఇది రెండో దొంగతనం అని మాంట్‌క్లేర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘ఒకేలా జరిగే మోసాలలో భాగంగానే ఇవి జరిగాయా’’ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదటి ఘటనలో అరిజోనాలోని టక్సన్‌కు వెళ్లాల్సిన దాదాపు 45 వేల డాలర్లు ( సుమారు రూ. 42.67 లక్షలు) విలువైన సరుకును ఆగస్టు 17న తీసుకెళ్లారు. రెండు వారాలు గడిచినా అది గమ్యస్థానానికి చేరుకోలేదు.
ఇది జరిగిన గంట తర్వాత దొంగలు తప్పుడు పత్రాలు ఉపయోగించి పాబ్స్ట్ బ్లూ రిబ్బన్ బీర్‌ను తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.
"రెండు ఘటనల మధ్య సారూప్యత ఉన్నట్లు అధికారులు గుర్తించారు" అని పోలీసులు తెలిపారు.
"డ్రైవరు, వాహనాల గురించి ఆ వాహనాన్ని సమకూర్చిన సంస్థ అందించిన సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది" అని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వేర్వేరు కంపెనీలైనప్పటికీ పీబీఆర్ బీర్‌ను తయారు చేయడానికి ఎన్‌హైజర్-బుష్ కంపెనీల మధ్య ఒప్పందం ఉంది. అరిజోనాకు వెళ్లాల్సిన సరుకులో పీబీఆర్ బీర్ కూడా ఉందా అనేది స్పష్టంగా తెలియదు.
"ఒక నకిలీ వ్యక్తి వచ్చి బీర్‌ను తీసుకెళ్లాల్సిన వ్యక్తిగా నటించాడని మేం గుర్తించాం" అని సంస్థకు చెందిన ఓ వ్యక్తి బీబీసీకి అమెరికాలో భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.
కంపెనీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ నేరం తీవ్రతను నొక్కి చెప్పాలని కోరుకుంది.
‘‘అది జోక్‌గా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. మేము దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం’’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
ఇందులో దొంగకు ఒక సందేశం కూడా ఇచ్చింది కంపెనీ.
"మా బీర్ ఉన్న ట్రక్కును ఎలాంటి ప్రశ్నలు అడగకుండా తిరిగి ఇవ్వడానికి మీకు కచ్చితంగా 18 రోజుల 44 నిమిషాలు ఉన్నాయి" అని దొంగకు సూచన ఇచ్చింది.
ఈ సంఖ్య కంపెనీ స్థాపించిన 1844 సంవత్సరానికి సూచిక.
సరుకును తిరిగి ఇచ్చినందుకు కంపెనీ బహుమతిని కూడా ఇస్తామంది. అయితే అది ఎంత మొత్తమన్నది వెల్లడించ లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























