ఇజ్రాయెల్ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, నెతన్యాహు ఏమన్నారు?

ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఇజ్రాయెల్‌లో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటివరకు 2.5 శాతం ఓట్లను లెక్కించారు.
మరోవైపు నెతన్యాహు, ఐసెన్కాట్ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొందని తాజా ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది.
ఇజ్రాయెల్‌కు చెందిన కాన్ 11, ఛానల్ 13 వార్తా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను సవరించి, తాజా అంచనాలను విడుదల చేశాయి. పోటీలో ఉన్న రెండు కూటములు చెరో 51 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపాయి.
ఛానల్ 12 కూడా తన ఎగ్జిట్ పోల్‌ను సవరించింది. ఐసెన్కాట్ నేతృత్వంలోని కూటమి 50 స్థానాలతో స్వల్పంగా వెనుకబడుతుందని, నెతన్యాహు కూటమికి 52 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అంతకుముందు విడుదల చేసిన అంచనాల్లో ఐసెన్కాట్ కూటమి స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టు ఆ సంస్థ పేర్కొంది.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కెనెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్)లో కనీసం 61 స్థానాలు కావాలి.


ఫొటో సోర్స్, Getty Images
‘చరిత్ర సృష్టించాం’
ఐసెన్కాట్ కొద్దిసేపటి క్రితమే టెల్ అవీవ్‌లోని తన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. యషార్ పార్టీ అభ్యర్థులు, అక్కడ గుమిగూడిన ప్రజల మధ్య నుంచి ఆయన వేదికపైకి నడుచుకుంటూ వెళ్లారు.
"మనం చరిత్ర సృష్టించాం" అని ఆయన అన్నారు.
"రాబోయే సంవత్సరాల్లో దేశానికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపై ఇజ్రాయెల్ ప్రజలు ఈ ఉదయం ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మార్పునకు అనుకూలంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. నెతన్యాహు పదవీకాలం కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ఓటు వేశారు" అని ఆయన అన్నారు. దీంతో అక్కడున్న ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.
మరోవైపు "లికుడ్ అతిపెద్ద పార్టీ" అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు.
"మనం బలమైన మితవాద జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అరబ్ పార్టీల మద్దతుతో నడిచే ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు నాయకత్వం వహించకూడదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
77 శాతానికి పైగా ఓటింగ్: ఎన్నికల సంఘం
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 22:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు) పోలింగ్ ముగిసింది.
77.7 శాతం ఓటింగ్ నమోదైందని ఇజ్రాయెల్ కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ఆ సమయానికి మొత్తం 56,95,682 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించింది. 1999 తర్వాత పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన అత్యధిక ఓటింగ్ శాతం ఇదేనని తెలిపింది.
"ఇంత భారీ స్థాయిలో ఓటర్లు పాల్గొన్న ఎన్నికల్లో మళ్లీ ఎన్నికలకు వెళ్లడం పొరపాటు అవుతుంది. ప్రజల ఆకాంక్షలను గౌరవించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకోవడం మా బాధ్యత. వ్యక్తిగతంగా నాపైనా ఈ బాధ్యత ఉంది" అని ఐసెన్కాట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
'పెద్ద సంఖ్యలో ఓటు వేసిన అరబ్ సమాజం'
అరబ్ పార్టీలకు లభించిన స్థానాలు, వాటికి మద్దతుగా నమోదైన ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగాయని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి.
అరబ్ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా ప్రచారం చేసిన కార్యకర్తల్లో ఒకరైన మహదీ కబాహాతో బీబీసీ ప్రతినిధి మాట్లాడారు. ఆయన వయసు 29 సంవత్సరాలు. ఆయన న్యాయవాది. ఉత్తర ఇజ్రాయెల్‌లో ప్రధానంగా అరబ్ ప్రజలు నివసించే ఉమ్ అల్-ఫహ్మ్ అనే పట్టణంలో ఉంటున్నారు.
"ఇది చరిత్రాత్మకమైన రాత్రి. అరబ్ సమాజం పెద్ద సంఖ్యలో ఓటు వేసి, 'మేమిక్కడే ఉన్నాం. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మేమూ భాగమే' అని స్పష్టంగా చెప్పింది" అని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్‌లోని మొత్తం ఓటర్లలో అరబ్ ఓటర్లు దాదాపు ఐదో వంతు ఉన్నారు. గత ఎన్నికల్లో వారిలో సగం కంటే కొద్దిమందే ఓటు వేశారు.
గతంలో చాలామంది అరబ్ ఓటర్లు ఓటు వేయడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే, "ఇజ్రాయెల్ సంస్థలకు తమ ఓటు ద్వారా చట్టబద్ధత కల్పించడం తమకు ఇష్టం లేదు" అని కబాహా చెప్పారు.
ఇజ్రాయెల్ అరబ్బులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేయాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో తమ ఓటు శక్తిని ఉపయోగించుకోవాలని కబాహా ప్రచారం చేశారు.
అరబ్ ఓటర్లు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అరబ్ ప్రజలు నివసించే ప్రాంతాల్లో పెరుగుతున్న నేరాలు, తగినంత పోలీసు నిఘా లేకపోవడం.

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది?
ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి రాలేదు. దీంతో అక్కడ ఎప్పుడూ కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది.
ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాను భావించిన పార్టీ నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు.
ఆ నేతకు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 28 రోజుల సమయం ఉంటుంది. ఒకవేళ మరింత సమయం అవసరమైతే మరో 14 రోజుల గడువును పొడిగించాలని కోరవచ్చు.
ఈ గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆ నేత విఫలమైతే మరో నాయకుడికి అవకాశం ఇవ్వవచ్చు. ఎవరిని ఎంపిక చేయాలనేది అధ్యక్షుడు నిర్ణయిస్తారు.
రెండో నాయకుడు కూడా విఫలమైతే, మూడో నాయకుడికి అవకాశం ఇవ్వాలని కెనెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) సభ్యులు అధ్యక్షుణ్ని కోరవచ్చు. ఆ ప్రయత్నం కూడా విఫలమైతే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























