రివ్యూ: రోమాంచకం సినిమా ఎలా ఉంది, సుమంత్ ప్రభాస్, అనంతిక మ్యాజిక్ చేశారా?

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ ప్ర‌భాస్ హీరోగా, ఎనిమిది వ‌సంతాల‌తో పేరు తెచ్చుకున్న అనంతిక హీరోయిన్‌గా రోమాంచ‌కం థియేట‌ర్‌లోకి వ‌చ్చేసింది.

క‌థ విషయానికి వస్తే అన్వేష్ (సుమంత్‌) స్టార్ట‌ప్ కంపెనీ య‌జ‌మాని. ఫ్రెండ్స్‌తో క‌లిసి డేటింగ్ యాప్ డెవ‌ల‌ప్ చేస్తాడు. అప్పుల్లో వుంటాడు. ఒక ర‌కంగా అల్ల‌రిచిల్ల‌రి జెన్‌జీ బ్యాచ్‌.

చెన్నైలో వున్న మైథిలి (అనంతిక) అన్వేష్‌కు యాప్‌లో ప‌రిచ‌య మ‌వుతుంది. ప్రేమ‌గా మారుతుంది. ఆమెని క‌లుసుకోడానికి అన్వేష్ చెన్నై వెళ‌తాడు. కానీ ఆమె ఇత‌న్ని బ్లాక్ చేస్తుంది. నిరాశ‌గా తిరిగి వ‌స్తాడు. కొన్ని నెల‌ల త‌ర్వాత ఆమె హైద‌రాబాద్ వ‌స్తుంది. త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది మిగతా క‌థ‌.

ఈ కాలం పిల్ల‌లు ఆన్‌లైన్‌లోనే ప్రేమించుకుని, ఆన్‌లైన్‌లోనే విడిపోతున్నారు. నాన్ సీరియ‌స్‌గా, నాన్ సింక్‌లో మాట్లాడ‌డం చేస్తున్నారు. ఈ పాయింట్‌ని ద‌ర్శ‌కుడు వేణుగోపాల్‌రెడ్డి క‌రెక్ట్‌గానే ప‌ట్టుకున్నాడు. కానీ తెర‌మీద‌కి వ‌చ్చేస‌రికి ఆయ‌నకి జాతిర‌త్నాలు పూనింది.

ఐదేళ్ల క్రితం వ‌చ్చిన ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్ట‌ర్‌. త‌ర్వాత చాలా మంది ఫాలో అయ్యారు. రోమాంచ‌కం కూడా అలాంటిదే. అయితే ఇది కామెడీ పేరుతో అరాచ‌కం ఎక్కువ‌. రోమాంచ‌కం త‌క్కువ‌.

సుమంత్ ప్రభాస్, అనంతిక మధ్య కెమిస్ట్రీ కుదిరిందా?

సినిమాలో క‌థ ఏమీ వుండ‌దు. పోనీ ఫీల్ గుడ్ సీన్స్ వుంటాయా అంటే అదీ లేదు. సుమంత్ మంచి న‌టుడు, అనంతిక గొప్ప‌గా చేస్తుంది. కానీ ఆ అవ‌కాశం లేకుండా పోయింది. స‌న్నివేశాల్లో డెప్త్ పోయింది.

ఈ కాలం పిల్ల‌లు ఇలాగే క‌దా వున్నార‌ని స‌ర్దుకు పోదామ‌నుకుంటే తెర‌మీద లౌడ్ కామెడీ న‌డుస్తూ వుంటుంది. హీరో మిత్ర బృందం నాన్‌స్టాప్‌గా అరుస్తూ వుంటారు.

మ‌ధ్య‌లో కొన్ని పంచ్‌లు పేలి న‌వ్వు వ‌స్తూ వుంటుంది. అక్క‌డ‌క్క‌డ న‌వ్వుకోడానికి ఓకే. కానీ సందీప్ వంగా పేరు చూసి ఏదో ఆశిస్తే నిరాశే!

కమల్ హాసన్ నటించిన పంచ‌తంత్రం సినిమాలాగా, చిన్న క్రైం ఎలిమెంట్ ఎంట‌రై, సెకెండాఫ్ బావుంటుంద‌ని ఆశిస్తే అదీ లేదు. సెకండాఫ్‌లో కూడా హీరో మిత్ర బృందాల వాదోప‌వాదాలే వుంటాయి. సెల్ఫ్ చెక్ పేరుతో టూర్ వెళ్లాల‌నుకున్న హీరోయిన్‌, త‌ర్వాత అంత అమెచ్యూర్‌గా, క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఎందుకుంటుందో అర్థం కాదు. హీరోకి దారీతెన్నూ వుండ‌దు. క్లైమాక్స్‌లో పెళ్లి కామెడీ కూడా చాలా సినిమాల్లో చూసేసిందే.

ఇలాంటి సినిమాల‌కి బీజం వేసిన ద‌ర్శ‌కుడు అనుదీప్ కూడా చిన్న పాత్ర‌లో క‌నిపించ‌డం విశేషం.

హీరో ఫ్రెండ్‌గా వేసిన న‌రేంద్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. ఆయ‌న కామెడీ టైమింగ్ సినిమాని చాలా చోట్ల నిల‌బెట్టింది. సెకండాఫ్‌లో వ‌చ్చిన ఉపేంద్ర‌లిమాయే కామెడీ కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. విసిగించింది.

ప్రేమ, హాస్యం, ఉత్కంఠ

రెండు పాట‌లు బావున్నాయి. బీజీఎం కూడా చాలా చోట్ల పెద్ద‌గా సౌండ్ చేసింది. కెమెరా బావుంది. నిడివి కూడా 2 గంట‌ల 22 నిముషాలే.

న‌ర్సుల‌ను వెకిలిగా చూప‌డం మ‌న సినిమాల‌కి ఒక అల‌వాటుగా మారింది. అదే విధంగా హీరో ప‌దేప‌దే పొట్టి సాలే అని ఫ్రెండ్‌ని పిలుస్తూ వుంటాడు. బాడీ షేమింగ్, పొట్టిత‌నాన్ని హేళ‌న చేయ‌డం కుసంస్కారం.

సినిమాలో ప్రేమ‌, హాస్యం, ఉత్కంఠ ఉన్నాయి. కానీ ఉండాల్సిన విధంగా లేవు. కాసిన్ని జోకులుంటే చాలు న‌వ్వుకుందాం అనుకునే వాళ్ల‌కి ఓకే. జెన్‌జీకి న‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు.

ప్ల‌స్ పాయింట్స్‌

1.కాసింత కామెడీ

2.అవంతిక స్క్రీన్ ప్రెజెన్స్‌

మైన‌స్ పాయింట్స్

1.క‌థ లేక‌పోవ‌డం

2.లౌడ్‌నెస్‌

ఫైన‌ల్‌గా --- హాస్యం కంటే అప‌హాస్య‌మే ఎక్కువ‌

(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)