చెట్లను పెకిలించి, పొలాలను ముంచేసి.. గతంలో ఏపీని వణికించిన తుపానులు ఇవే..

హుద్ హుద్ తుపాను
ఫొటో క్యాప్షన్, హుద్ హుద్ తుపానుతో విశాఖపట్నంలో పెను విధ్వంసం జరిగింది
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లకు ఆంధ్రప్రదేశ్ తీరం ఎప్పుడూ ప్రధాన కేంద్రంగా మారుతూనే ఉంటుంది. గత 132 ఏళ్ల కాలంలోని వాతావరణ శాఖ డేటాను పరిశీలిస్తే, అనేక పెను తుపాన్లు ఆంధ్రప్రదేశ్ వద్ద తీరాన్ని దాటుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.

1892 నుంచి ఇప్పటివరకు నమోదైన ఏపీఎస్‌డీఎంఏ రికార్డుల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వద్ద 150 తుపాన్లు తీరాన్ని దాటాయి. వీటిలో 31 అతి తీవ్ర తుపాన్లు (గంటకు 118 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయి) ఉన్నాయి.

భారత తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 1053.07 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరం ఉంది. గుజరాత్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద తీరం ఇదే.

బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు ఆగ్నేయం నుంచి వాయువ్య దిశగా పయనిస్తూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు తీరాలను తాకడం సహజసిద్ధమైన వాతావరణ ధోరణి. ఈ రకంగా బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లకు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని కేంద్రంగా చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ), వాతావరణ చరిత్ర రికార్డుల ప్రకారం, ఇప్పటివరకు ఏపీని వణికించి, చరిత్రలో నిలిచిపోయిన కొన్ని భీకర తుపాన్ల గురించి ఇక్కడ చూద్దాం. తుపాను గాలి వేగం కంటే కూడా సమాజంపై అది చూపిన విధ్వంసం ఆధారంగా ప్రధాన తుపాన్లను ఇక్కడ ప్రస్తావించాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దివి సీమ ఉప్పెన
ఫొటో క్యాప్షన్, దివిసీమ ఉప్పెన సమయంలో ఆహారం కోసం హెలీకాప్టర్ వైపు వెళుతున్న ప్రజలు (ఫైల్ ఫోటో)

1. దివిసీమ తుపాను (1977 నవంబర్): మాటలకందని విధ్వంసం

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన, వేలమంది ప్రాణాలను బలిగొన్న తుపానుగా 1977 నవంబర్‌ నాటి దివిసీమ తుపాను నిలిచింది.

దివిసీమ ఉప్పెనగా ఈ తుపాను తెలుగునాట ప్రాచుర్యం పొందింది.

ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రికార్డుల ప్రకారం, నవంబర్ 15-20వ తేదీల్లో సంభవించిన ఈ తుపానును 'అత్యంత తీవ్రమైన తుపాను'గా వర్గీకరించారు. అంటే ఈ తుపాను అత్యున్నత దశలో (పీక్ స్టేజ్) ఉన్నప్పుడు గంటకు దాదాపు 204 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. తీరం దాటే సమయంలో గాలి వేగం 107 నాట్లు (సుమారు గంటకు 198 కిమీ)గా నమోదు అయింది.

కాకినాడలో వానకు రక్షణగా ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్న ఇద్దరు

నవంబర్ 19న కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతాన్ని తాకిన ఈ భీకర తుపాను కారణంగా సుమారు 10,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తుపాను విధ్వంసం కారణంగా బాపట్ల అతలాకుతలమైంది.

మొత్తం 8 జిల్లాల్లోని 24 లక్షల మంది ప్రభావితమయ్యారు. మొత్తం 10.14 లక్షల ఇళ్లు ధ్వంసం కాగా, 2.5 లక్షల పశుసంపదకు నష్టం కలిగింది. ఓవరాల్‌గా దీని వల్ల 172 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా వేశారు.

దివిసీమ తుపాను కారణంగా శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

2. మే 1990 ఆంధ్ర తుపాను: ఏకైక సూపర్ సైక్లోన్

దివిసీమ తుపాను తర్వాత దక్షిణ భారతదేశాన్ని కుదిపేసిన అత్యంత తీవ్రమైన విపత్తుగా ఇది రికార్డుకెక్కింది. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రికార్డుల ప్రకారం అత్యంత బలమైన (స్ట్రాంగెస్ట్) తుపానుల జాబితాలో ఈ తుపాను అగ్రస్థానంలో నిలిచింది.

1990 మే 4న బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి తీవ్రరూపం దాల్చింది. సూపర్ సైక్లోనిక్ స్టార్మ్ స్థాయికి చేరుకుంది.

అంటే సముద్రంలో ఉన్నప్పుడు దీని గరిష్ఠ గాలుల వేగం 127 నాట్లు అంటే గంటకు సుమారు 235 కిలోమీటర్ల వేగంతో ప్రచండంగా మారింది.

మే 9న కృష్ణానది ముఖద్వారం వద్ద తీరాన్ని దాటిన ఈ భీకర తుపాను అత్యంత ప్రమాదకరమైన గాలులతో విరుచుకుపడింది. రికార్డుల ప్రకారం, ఆ సమయంలో గంటకు సుమారు 167 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 6 రోజుల పాటు ఏపీని వణికించింది. 14 జిల్లాలపై ప్రభావం చూపిన ఈ తుపాను ధాటికి 817 మంది మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సుమారు 77.81 లక్షల మంది ప్రభావితం కాగా, దాదాపు 14.39 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. అప్పట్లోనే రూ. 2137 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

1977 దివిసీమ తుపాను సమయంలో దాదాపు పదివేల మంది చనిపోగా, 1990లో అంతకంటే భీకర గాలులు వీచినా ప్రాణనష్టం గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం ముందస్తు హెచ్చరికలు, వేగవంతమైన పునరావాస చర్యలేనని ఐక్యరాజ్యసమితి యూఎన్‌డీఆర్‌వో రిపోర్టు పేర్కొంది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందుస్తుగానే రేడియో, టీవీ ప్రసారాల ద్వారా తీర ప్రాంత ప్రజలను హెచ్చరించింది.

దాదాపు లక్షన్నర మందికిపైగా ప్రజలను తీర ప్రాంతాల నుంచి ముందుగానే సురక్షిత ప్రాంతాలు, తుపాను షెల్టర్లలోకి తరలించినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి.

3. కాకినాడ తుపాను (నవంబర్ 1996)

1996 నవంబర్‌లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరాన్ని ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాలను కదిలించిన భీకర తుపాను ఇది.

నవంబర్ 5-7 తేదీల్లో ప్రభావం చూపిన ఈ తుపాను కారణంగా 1077 మంది మృతి చెందారు. దీన్ని అతి తీవ్ర తుపానుగా వర్గీకరించారు.

సుమారు 6 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమై, రూ. 6129 కోట్లకు పైగా అపార నష్టం వాటిల్లింది.

నవంబర్ 6న రాత్రి కాకినాడ సమీపంలో గంటకు 124 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకింది. తూర్పు గోదావరి జిల్లా ముఖ్యంగా కోనసీమ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది.

అధికారిక రికార్డుల ప్రకారం మృతుల సంఖ్య 1077 అని ఉన్నప్పటికీ, సముద్రంలో కొట్టుకుపోయి ఆచూకీ దొరకని వారిని కూడా కలుపుకుంటే మొత్తం మరణాల సంఖ్య 2560 వరకు ఉన్నట్లు కాకినాడ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్ సాలగ్రామా, ఏపీ ప్రభుత్వ ఫిషరీస్ కమిషనర్ డీఎస్ మూర్తి రాసిన రిపోర్టులో పేర్కొన్నారు.

తూర్పు గోదావరి తీరప్రాంత గ్రామలైన భైరవపాలెం, బలసుతిప్ప అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయని రెడ్‌క్రాస్ సిచ్యుయేషన్ రిపోర్టులో పేర్కొన్నారు.

సముద్రంలో వేటకు వెళ్లిన మెకనైజ్డ్ బోట్లు, రొయ్యల పిల్లల సేకరణలో ఉన్న వందల మంది ప్రజలు సముద్రపు అలల ఉధృతికి కొట్టుకుపోయారని రిపోర్టులో రాశారు.

తుపాను సమయంలో వరి పొలాలు, కొబ్బరి తోటలు, ధ్వంసం కారణంగా రూ.5,040 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

అర్నబ్ తుపాను కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. యానాంలో రోడ్డుపై పడిపోయిన చెట్టు
ఫొటో క్యాప్షన్, యానాంలో రోడ్డుపై పడిపోయిన చెట్టు

4. హుద్‌హుద్ తుపాను (అక్టోబర్ 2014)

విశాఖపట్నం నగరాన్ని పూర్తిగా వణికించి, తలకిందులు చేసిన తుపాను 'హుద్‌హుద్'. అక్టోబర్ 7 నుంచి 14 వరకు ఈ తుపాను ప్రభావం చూపింది. అక్టోబర్ 12న మధ్యాహ్నం 12:00-13:00 గంటల (IST) మధ్య విశాఖపట్నం వద్ద తీరాన్ని దాటింది. దీన్ని అత్యంత తీవ్ర తుపానుగా వర్గీకరించారు.

ఇది, విశాఖ తీరం వద్ద భీకర గాలులతో (గంటకు 185 కిలోమీటర్ల వేగం) విరుచుకుపడింది.

లక్షలాది చెట్లు నేలకూలడం, కరెంట్ స్తంభాలు ధ్వంసమవడం, విమానాశ్రయం దెబ్బతినడం వంటి పరిణామాలతో విశాఖ రూపురేఖలే మారిపోయాయాయని పీఐబీ రిపోర్టులు చెబుతున్నాయి. నగరంలో విద్యుత్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోయిందని, రూ. 350 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పీఐబీ పేర్కొంది.

ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టం చాలావరకు తగ్గినా, ఆస్తి నష్టం మాత్రం వేల కోట్ల రూపాయలలో జరిగింది.

ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రికార్డుల ప్రకారం ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

నాలుగు జిల్లాల్లోని 92.78 లక్షల మంది ప్రజలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. అధికారిక లెక్కల ప్రకారం 63 మంది ప్రాణాలు కోల్పోగా, 5874 పశువులు చనిపోయాయి. 2 లక్షలకు పైగా ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తంగా 21,908 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.

ఇతర ముఖ్యమైన తుపాన్లు..

1972 నవంబర్ 22 (తిరుపతి / ఉమ్మడి నెల్లూరు తీరం): అత్యంత తీవ్రమైన తుపాను కేటగిరీకి చెందిన ఈ తుపాను సముద్రంలో 90 నాట్ల (గంటకు సుమారు 167 కిమీ) గరిష్ఠ తీవ్రతతో ప్రయాణించి నెల్లూరు/తిరుపతి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది.

1979 మే 12 (ఉమ్మడి నెల్లూరు / ప్రకాశం తీరం): ఇది కూడా అత్యంత తీవ్రమైన తుపాను కేటగిరీకి చెందినదే. ఇది 85 నాట్ల (గంటకు సుమారు 157 కిమీ) వేగంతో వచ్చి పడేలి గ్రామం సమీపంలో తీరాన్ని దాటి కోస్తా ప్రాంతాల్లో విస్తారమైన పంట నష్టాన్ని కలిగించింది.706 మంది చనిపోగా, 242 కోట్ల నష్టాన్ని కలిగించింది.

2005 సెప్టెంబర్ 17 - 21 (కళింగపట్నం): ఉత్తరాంధ్రలోని కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటి కోస్తాంధ్రలోని 10 జిల్లాలపై ప్రభావం చూపింది. ఈ తుపాను ధాటికి 107 మంది ప్రాణాలు కోల్పోగా, 1.18 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. రూ. 2,697.97 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది.

2006 అక్టోబర్ 29 - 30 ('అగ్ని' తుపాను): దక్షిణ ఆంధ్ర తీరాన ఒంగోలు - మచిలీపట్నం మధ్య తీరాన్ని దాటిన ఈ తుపాను 5 జిల్లాలను తీవ్రంగా కుదిపేసింది. 41 మంది మరణించగా, 3.5 లక్షల పశుసంపద కొట్టుకుపోయి, రూ. 7,173.25 కోట్ల భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది.

2010 మే (లైలా తుపాను) & 2012 నవంబర్ (నీలం తుపాను): లైలా తుపాను ప్రకాశం జిల్లా బాపట్ల వద్ద తీరాన్ని దాటి 14 జిల్లాల్లో అపారమైన వ్యవసాయ/పంట నష్టాన్ని తెచ్చిపెట్టగా, నీలం తుపాను కోస్తా జిల్లాల్లో తీవ్ర తుపానుగా మారి వర్షాలతో కుదిపేసింది.

ప్రతి సంవత్సరం బంగాళాఖాతంలో రుతుపవనాలకు ముందు (మార్చి-జూన్), రుతుపవనాల తర్వాత (అక్టోబర్-డిసెంబర్) నెలల్లో ఏర్పడే అల్పపీడనాలు ఇలా క్రమంగా బలపడి తుపాన్లుగా మారుతుంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)